తెలంగాణ పంచాయితీ ఎన్నికలకు కసరత్తు ముమ్మరం...డిసెంబర్ 31 తర్వాత...

తెలంగాణ పంచాయితీ ఎన్నికలకు కసరత్తు ముమ్మరం...డిసెంబర్ 31 తర్వాత...
x
Highlights

పంచాయితీ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. జనవరి 10 లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్డు ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా ఏర్పాట్లు...

పంచాయితీ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. జనవరి 10 లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్డు ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసి ఎన్నిక సంఘానికి ఇచ్చేందుకు ప్రభుత్వం కూడా రేయింబవళ్లు కష్టపడుతోంది. అయితే బీసీ సంఘాలు మాత్రం రిజర్వేషన్ల కోటా తగ్గించడంపై మండి పడుతున్నాయి.

పంచాయితీ ఎన్నిక నిర్వహణపై తెలంగాణ ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిసెంబర్ 31 తర్వాత ఎప్పడైనా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దంగా ఉండాలని అదేశించారు. పంచాయితీ ఎన్నికల నిర్వహణకు 95 వేల బ్యాలెట్ బాక్స్ లతో పాటు 3 కోట్ల 20 లక్షల 54 వేల 279 బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. లక్షన్నరకు పైగా ఇంకు బాటిళ్లు కూడా రెడీ అయ్యాయన్నారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు 150 గుర్తులను కేటాయిస్తున్నట్లు వివరించారు. అయితే పంచాయితీ ఎన్నికలకు అసెంబ్లీ ఓటరు జాబితానే ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు నాగిరెడ్డి తెలిపారు.

పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అంతా ఒక్కరోజులోనే పూర్తి కానుంది. ఉదయం ఏడు గంటలకు మొదలయ్యే పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటతో ముగుస్తుంది. సర్పంచ్ కోసం ఒక బ్యాలెట్, వార్డు మెంబర్ ఎన్నిక కోసం మరొక బ్యాలెట్ ఉంటుంది. మద్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. తెలంగాణ కొత్త పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం 12, 751 గ్రామ పంచాయతీలు, 1,13,354 వార్డులున్నాయి. ఇందులో 12,734 గ్రామ పంచాయితీల్లోనే ఎన్నికలు నిర్వహిస్తారు. గడువు తీరని 17 పంచాయితీలకు తర్వాత ఎన్నికలు నిర్వహిస్తారు. గడువు తీరని వాటిలో అదిలాబాద్ జిల్లాలో రెండు, మంచిర్యాలలో మూడు, మహబూబద్ నగర్ లో రెండు నల్గొండలో ఏడు, రంగారెడ్డిలో రెండు, వరంగల్ అర్బన్లో ఒక గ్రామ పంచాయితీ ఉన్నాయి. కొత్త గ్రామ పంచాయతీల్లో వార్డుల సంఖ్య 20 నుంచి 23 వరకు ఉండే అవకాశముంది. అటు బీసీ రిజర్వేషన్లను 34 నుండి 23 శాతానికి తగ్గించడం పట్ల బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పాత పద్ధతిలోనే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కొనసాగించాని కోరుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories