ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రసవత్తర రాజకీయం.. ఎన్నికల పోరులో గెలిచేదేవరో..? ఓడేదేవరో..?

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రసవత్తర రాజకీయం.. ఎన్నికల పోరులో గెలిచేదేవరో..? ఓడేదేవరో..?
x
Highlights

కిందటిసారి రాష్ట్రమంతా ఒకరకమైన ఫలితాలు వస్తే, రంగారెడ్డి జిల్లా ప్రజలు మిశ్రమ తీర్పిచ్చారు. జిల్లాలోని మొత్తం 14 స్థానాల్లో తెలుగుదేశం, బీజేపీ కూటమికి...

కిందటిసారి రాష్ట్రమంతా ఒకరకమైన ఫలితాలు వస్తే, రంగారెడ్డి జిల్లా ప్రజలు మిశ్రమ తీర్పిచ్చారు. జిల్లాలోని మొత్తం 14 స్థానాల్లో తెలుగుదేశం, బీజేపీ కూటమికి ఎనిమిది స్థానాలు దక్కాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా సత్తా చాటినా టీఆర్ఎస్ ఈ జిల్లాలో మాత్రం మూడు స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాలనే గెలుచుకోగలిగింది. కానీ ఈ నాలుగున్నరేళ్లలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టీడీపీ నుంచి గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరడంతో సీను మొత్తం మారిపోయింది. మరి ఈ ఎన్నికల్లో పరిస్థితి ఏంటి? జిల్లాలో మరీ ముఖ్యంగా దాదాపు ఎనిమిది నియోజకవర్గాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉన్న సెటిలర్లు ఎటువైపు మొగ్గబోతున్నారు?

ఒకవైపు కంచుకోటలు మరోవైపు హేమాహేమీలు. ఇంకోవైపు వ్యతిరేకతలు ఇటువైపు అసమ్మతులు అసంతృప్తులు. రసవత్తర పోరుకు తెరలేపిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల రాజకీయం అనుక్షణం ఉత్కంఠగా సాగుతుంది. డిసైడింగ్‌ ఫ్యాక్టర్‌గా ఉన్న సెటిలర్లను ఆకట్టుకునేందుకు కూటమి పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే... గులాబీ పార్టీ వారిని తమ వైపు తిప్పుకునేందుకు అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తుంది. మొత్తంగా 14 నియోజకవర్గాలు ఏం చెబుతున్నాయి.? ఎవరెవురు ఎక్కడెక్కడ బరిలో ఉన్నారు? ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. జిల్లాపై పట్టుసాధించేందుకు అన్ని పార్టీల నాయకులు కసరత్తు మొదలుపెట్టారు. ఆయా పార్టీల్లో కీలకస్థానాల్లో ఉన్నవారు ముఖ్యభూమిక పోషించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మేడ్చల్. ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. 43,455 ఓట్ల భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తోటకూర జంగయ్యపై టీఆర్ఎస్ అభ్యర్థి మలిపెద్ది సుధీర్‌రెడ్డి ఘన విజయం సాధించారు. ఇక్కడ, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి 58 వేల ఓట్లు సాధించినా మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఈసారి ఎన్నికల్లో త్రిముఖ పోరు కనపడుతోంది. టీఆర్ఎస్‌ నుంచి ఆ పార్టీ ఎంపీ మల్లారెడ్డి, కాంగ్రెస్‌ నుంచి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, బీజేపీ నుంచి మోహన్‌రెడ్డి బరిలో నిలిచారు. ఇక్కడ కాంగ్రెస్‌ వర్సెస్‌ టీఆర్ఎస్‌ అన్నట్టుగానే పోరు సాగే అవకాశాలున్నాయి.

ఇక మల్కాజిగిరి. ఇక్కడ గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి చింతల కనకారెడ్డి బీజేపీ అభ్యర్థి ఎన్.రాంచందర్‌రావుపై 2,768 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి నందికంటి శ్రీధర్ మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఈ ఎన్నికల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. టీఆర్ఎస్‌ నుంచి మైనంపల్లి హనుమంతరావు, కూటమి పొత్తులో భాగంగా సీటు దక్కించుకున్న తెలంగాణ జన సమితి నుంచి కపిలవాయి దిలీప్‌కుమార్‌, బీజేపీ నుంచి రాంచందర్‌రావు మరోసారి బరిలో నిలిచారు.

కుత్బుల్లాపూర్‌. సెటిలర్ ఓట్లు కీలకంగా ఉండే ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున కేపీ వివేకానంద్ 40 వేల మెజారిటీతో ఘన విజయం సాధించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. వివేకానంద్ టీడీపీని వీడి టీఆర్ఎస్ గూటికి చేరారు. సెటిలర్లు ఎక్కువగా ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్‌ నుంచి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వివేకానంద్‌, కాంగ్రెస్‌ నుంచి కూన శ్రీశైలంగౌడ్‌, బీజేపీ నుంచి కాసాని వీరేష్‌ బరిలో నిలిచారు.

ఇక కూకట్‌పల్లి. ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసిన మాధవరం కృష్ణారావు 43,186 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇక్కడ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన గొట్టిముక్కు పద్మారావు రెండోస్థానంలో నిలిచారు. ఈసారి టీఆర్ఎస్‌ తరుపున మాధవరం కృష్ణారావు, తెలుగుదేశ పార్టీ నుంచి దివంగత నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని, బీజేపీ నుంచి కాంతారావు తలపడుతున్నారు. సెటిటర్లు అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో పోటాపోటీగా ఉండే ఛాన్సే కనిపిస్తోంది.

ఉప్పల్. గత ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గంలో టీడీపీతో పొత్తులో భాగంగా బీజేపీ తరుపున పోటీ చేసిన ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ టీఆర్ఎస్ అభ్యర్థి భేతి సుభాష్‌రెడ్డిపై 14,169 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బండారి లక్ష్మారెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఎమ్మెల్యే ప్రభాకర్ నియోజకవర్గంలో తన ముద్రను వేసుకున్నా పార్టీ పరంగా చూస్తే బీజేపీ అంత బలంగా లేదు. ఈసారి టీఆర్ఎస్‌ నుంచి భేతి సుభాష్‌రెడ్డి, టీడీపీ నుంచి మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్‌ కుమారుడు వీరేందర్‌గౌడ్‌, బీజేపీ నుంచి గత ఎన్నికల్లో నిలిచి గెలిచిన ఎన్వీఎస్ఎస్‌ ప్రభాకర్‌ తలపడుతున్నారు.

ఇక ఇబ్రహీంపట్నం. ఈ నియోజకవర్గంలో రెండుసార్లు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. టీడీపీ తరుపున గెలిచిన ఆయన తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. ఈసారి కూడా మంచిరెడ్డే టీఆర్ఎస్‌ నుంచి బరిలో నిలిచారు. కూటమి పొత్తులో భాగంగా టికెట్‌ దక్కించుకున్న టీడీపీ నుంచి సామ రంగారెడ్డి, బీజేపీ నుంచి అశోక్‌గౌడ్‌ బరిలో నిలిచారు. ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎల్‌.బి.నగర్‌. ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బీసీల నేత ఆర్.కృష్ణయ్య టీడీపీ తరుపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దిగారు. టీడీపీ, బీజేపీ పొత్తు, సెటిలర్ ఓట్లు, బీసీల అండ కలిసివచ్చి ఆయన సులువుగా విజయం సాధించారు. టీఆర్ఎస్‌ నుంచి ముద్దగోని రామ్మోహన్‌గౌడ్‌, కాంగ్రెస్‌ నుంచి మరోసారి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బీజేపీ నుంచి పేరాల శేఖర్‌రావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీల మధ్య త్రిముఖ పోటీ కొనసాగుతుంది.

మహేశ్వరం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచిన తీగల కృష్ణారెడ్డి టీఆర్ఎస్‌లోకి జంప్ చేశారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మంచి బలం ఉంది. ఈసారి కూడా టీఆర్ఎస్‌ నుంచి తీగల, కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, బీజేపీ నుంచి శ్రీరాములుయాదవ్‌ బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య ఇక్కడ హోరాహోరీ పోరు నెలకొననుంది.

రాజేంద్రనగర్ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి రెండుసార్లు టీడీపీ నుంచి ప్రకాశ్‌గౌడ్ ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో 25 వేల ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి జ్ఞానేశ్వర్‌పై విజయం సాధించారు. ఇక్కడ టీఆర్ఎస్ నాలుగో స్థానానికి పరిమితైంది. ముస్లిం జనాభా గణనీయంగా ఉండే ఇక్కడ మజ్లీస్ పార్టీకి మంచి ఓటు బ్యాంకు ఉంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ సుమారు 50 వేల ఓట్లు సాధించింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ నుంచి ప్రకాశ్‌గౌడ్‌, టీడీపీ నుంచి గణేష్‌గుప్త, బీజేపీ నుంచి బద్దం బాల్‌రెడ్డి బరిలో నిలిచారు.

ఇక సాఫ్ట్ వేర్ హబ్‌గా ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సెటిలర్ ఓట్లే కీలకం. గత ఎన్నికల్లో వారు వన్‌సైడ్‌గా టీడీపీకి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ నుంచి పోటీ చేసిన అరికేపూడి గాంధీ 75,904 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. తర్వాత ఆయన టీఆర్ఎస్ గూటికి చేరారు. ఈసారి కూడా అరికేపూడి గాంధీనే టీఆర్ఎస్‌ నుంచి బరిలో నిలిచారు. టీడీపీ నుంచి భవ్య ఆనంద్‌ప్రసాద్‌, బీజేపీ నుంచి యోగానంద్‌ బరిలో నిలిచారు.

చేవెళ్ల. గత ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ గెలిచిన రెండు నియోజకవర్గాల్లో చేవెళ్ల ఒకటి. ఇక్కడి నుంచి హస్తం గుర్తుపై పోటీ చేసిన కాలె యాదయ్య టీఆర్ఎస్ అభ్యర్థి కే.ఎస్ రత్నంపై 781 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. తర్వాత ఆయన కాంగ్రెస్‌ని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. ఈసారి టీఆర్ఎస్‌ నుంచి కాలె యాదయ్య, కాంగ్రెస్‌ నుంచి కేఎస్‌ రత్నం, బీజేపీ నుంచి కంజెర్ల ప్రకాశ్‌ బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఖాయంగా కనపడుతోంది.

పరిగి. గత ఎన్నికలకు ముందు వరకూ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్న హరీశ్వర్‌రెడ్డి ఎన్నికలకు కొంత ముందు టీఆర్ఎస్‌లో చేరారు. ఆయన విజయం ఖాయం అన్న అంచనాలు ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి ఇక్కడ 5,163 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ తరుపున పోటీ చేసిన మాజీ మంత్రి కమతం రాంరెడ్డి మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఈసారి టీఆర్ఎస్‌ నుంచి మహేష్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి రామ్మోహన్‌రెడ్డి, బీజేపీ నుంచి కరణం ప్రహ్లాద్‌రావు పోటీ చేస్తున్నారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రెండు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో వికారాబాద్ ఒకటి. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన బి.సంజీవరావు గడ్డం ప్రసాద్‌పై 10 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ నుంచి మెతుకు ఆనంద్‌, కాంగ్రెస్‌ నుంచి మళ్లీ గడ్డం ప్రసాద్‌, బీజేపీ నుంచి రాయిపల్లి సాయికృష్ణ పోటీ చేస్తున్నారు.

తాండూరు. ఈ నియోజకవర్గం గతంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఆ పార్టీ తరుపున ప్రస్తుత మంత్రి పట్నం మహేందర్ రెడ్డి నాలుగుసార్లు విజయం సాధించారు. తర్వాత మహేందర్‌రెడ్డి టీఆర్ఎస్ గూటికి చేరారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి నారాయణరావుపై 15,982 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి కూడా టీఆర్ఎస్‌ నుంచి పట్నం మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి పైలెట్‌ రోహిత్‌రెడ్డి, బీజేపీ నుంచి పటేల్‌ రవిశంకర్‌ పోటీ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories