రైతుబంధుపై గులాబీల ప్రచారం, గ్రామాలకు నేతలు

Submitted by santosh on Tue, 05/08/2018 - 11:13
raithubhandu scheme, trs leader go to villages

గులాబీ నేతలు పల్లె బాట పట్టారు. రైతుబంధు పథకాన్ని అనుకూలంగా మలచుకోవాలని పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ ఆదేశించారు. చెక్కుల పంపిణీ సందర్భంగా నిత్యం ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కో మండలంలో పూర్తి సమయాన్ని వెచ్చించాలని కోరారు. దీంతో గులాబీ నేతలంతా పల్లెలకు చలో మంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశ పెట్టినా రైతులు మాత్రం అసంతృప్తిగా ఉన్నారు. రుణ విముక్తులు గాక, పంటకు గిట్టుబాటు ధర రాక, అప్పులు పుట్టక కేసీఆర్ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. రైతన్నల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ప్రభుత్వం కొత్తగా రైతుబంధు ప్రభుత్వాన్ని ప్రవేశ పెట్టింది. ఎకరాకి 4 వేల పంట రుణాన్ని అందించబోతోంది. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతుబంధు పథకం చెక్కుల పంపిణీ గురువారం నుంచి ప్రారంభమవుతోంది. ప్రణాళిక బద్ధంగా ఏర్పాట్లు చేసినా చెక్కుల పంపిణీలో గందరగోళం తప్పదు. తమకు చెక్ రాలేదని.. వచ్చినా పేరు తప్పుగా వచ్చిందని.. వేరే వారి చెక్ వచ్చిందని.. తక్కువ మొత్తం వచ్చిందని.. పంపిణీలో ఆలస్యం జరుగుతుందనే ఫిర్యాదులు వచ్చే అవకాశాలున్నాయి. అందరికీ సర్దిచెప్పి పథకం సజావుగా అమలయ్యే విధంగా చూసే బాధ్యత పార్టీ ప్రజా ప్రతినిధులదేనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడంతో పాటు పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలని టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది. పార్టీ సర్పంచ్‌లు మొదలుకొని మంత్రుల వరకు అంతా విధిగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని ఆదేశించింది. నియోజవర్గంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ చైర్మన్‌లు, ఇతర ప్రజా ప్రతినిధులు మండలాల వారీగా బాధ్యతలు తీసుకుంటారు. మండలాల వారీగా టీంలుగా ఏర్పడి ఒక్కొక్కరు ఒక్కో మండలంలో మకాం వేసి చెక్కుల పంపిణీని పర్యవేక్షించనున్నారు. దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టని పథకాన్ని తమ ప్రభుత్వం చేస్తోందని చెబుతూ ప్రజలకు చేరువయ్యేందుకు గులాబీ ప్రజా ప్రతినిధులంతా గ్రామాలకు తరలుతున్నారు.

English Title
raithubhandu scheme, trs leader go to villages

MORE FROM AUTHOR

RELATED ARTICLES