మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌దే

మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌దే
x
Highlights

మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచాలనే ఏకైక లక్ష్యంతో ఎస్పీ, బీఎస్పీ...

మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచాలనే ఏకైక లక్ష్యంతో ఎస్పీ, బీఎస్పీ కాంగ్రెస్‌తో జతకట్టడంతో సమీకరణాలు మారిపోయాయి. కాంగ్రెస్‌కు లైన్ క్లియర్ అయింది. ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను కాంగ్రెస్‌ అధ్యక్షులు రాహుల్ గాంధీకి అప్పగిస్తూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ శాసన సభా పక్షం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్ వైపే కాంగ్రెస్‌ అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది.

మధ్యప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. మధ్యప్రదేశ్‌లో 230 శాసనసభ స్థానాలు ఉండగా, ఇరు పార్టీలలో ఏ ఒక్క పార్టీ మ్యాజిక్‌ ఫిగర్‌ మార్కును అందుకోలేక పోయాయి. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌, బీజేపీలు ప్రయత్నాలు చేశాయి. మధ్యప్రదేశ్‌లో బీజేపీని అధికారంలోకి రాకుండా నిలువరించేందుకు కాంగ్రెస్ పార్టీకి ఎస్పీ, బీఎస్పీ మద్దతు ప్రకటించాయి. మ్యాజిక్ ఫిగర్‌కు కేవలం రెండు సీట్ల దూరంలో ఉండటంతో కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నట్టు బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. బీజేపీని అధికారంలోకి రానీయకుండా చూడటమే తమ లక్ష్యమని అందుకే కాంగ్రెస్‌తో జతకట్టామని మాయావతి వెల్లడించారు.

మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలుండగా కాంగ్రెస్ 114 చోట్ల, బీజేపీ 109, బీఎస్పీ 2, సమాజ్‌వాదీ పార్టీ 1, ఇతరులు 4 చోట్ల విజయం సాధించారు. అధికారం చేపట్టాలంటే 116 సీట్లు రావాలి. దీంతో మాయావతి కాంగ్రెస్‌తో జత కలిసేందుకు సిద్ధమయ్యారు. అలాగే సమాజ్‌వాది పార్టీ కూడా మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.

బీఎస్పీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు లభించడంతో మేజిక్‌ ఫిగర్‌ను సాధించిన కాంగ్రెస్‌ తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ గవర్నర్‌ను కలిసింది. సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మధ్యప్రదేశ్‌ సీఎం రేస్‌లో నిలిచిన కమల్‌ నాథ్‌ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ను కలిశారు. కమల్‌ నాథ్‌తో పాటు దిగ్విజయ్‌ సింగ్‌, జ్యోతిరాదిత్య సింధియా రాజ్‌భవన్‌కు వెళ్లిన నేతల బృందంలో ఉన్నారు. తమకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల జాబితాను వారు గవర్నర్‌కు అందచేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంఖ్యాబలం తమకుందని కమల్‌ నాథ్‌ గవర్నర్‌కు వివరించారు. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌‌తో కలిసి మధ్యప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని కమల్ నాథ్ అన్నారు. రాష్ట్ర ఖజానాను బట్టి మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తామని కమల్ నాథ్ అన్నారు. రాజస్థాన్‌, చత్తీస్ గడ్ రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్‌ కూడా కాంగ్రెస్ వశం కావడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories