నేను నేరం చేయలేదు : రాహుల్ గాంధీ

Submitted by arun on Tue, 06/12/2018 - 17:43
Rahul Gandhi

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ పై తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. గతంలో ఆర్ఎస్ఎస్ పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు కోర్టుకు వివరించారు. మహారాష్ట్రలో బివాండీ కోర్టుకు హాజరైన రాహుల్ తాను అపరాథిని కానని న్యాయమూర్తికి చెప్పారు. 

నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో.. రాహుల్‌ను జూన్‌ 12వ తేదీన తమ ముందు హాజరుకావాల్సిందిగా కోర్టు ఆదేశించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్టేట్‌మెంట్ రికార్డు చేయదలచిన బివాండీ కోర్టు స్వయంగా రాహుల్ కోర్టుకు రావాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలకనుగుణంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ  థానే కోర్టుకు హాజరయ్యారు. ఆయన న్యాయమూర్తి సమక్షానికి వెళ్ళిన వెంటనే న్యాయమూర్తి ఆయనపై ఆరోపణలను చదివి వినిపించారు. అపరాథినని అంగీకరిస్తారా? అని న్యాయమూర్తి అడిగినపుడు రాహుల్ మాట్లాడుతూ తాను అపరాథిని కాదని సమాధానం ఇచ్చారు. రాహుల్ స్టేట్‌మెంట్‌ను న్యాయమూర్తి రికార్డు చేసుకున్నారు. 

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌పై రాహుల్ గాంధీ 2014, మార్చి6న జరిగిన బహిరంగ సభలో విమర్శలు చేశారు. మహాత్మా గాంధీ హత్య వెనుక ఆరెస్సెస్ ఉందని ఆరోపించారు. రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా నిరసించిన రాజేశ్ కుంతే అనే కార్యకర్త పరువు నష్టం దావా వేశాడు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 499, 500 కింద కేసు వేశాడు. ఆరెస్సెస్‌ కూడా రాహుల్‌ తమ సంస్థపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. నాలుగేళ్లుగా కొనసాగుతున్నఈ కేసు ప్రస్తుతం విచారణకు వచ్చింది.

బివాండీ కోర్టులో హాజరై బయటకు వచ్చిన రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతున్నా, పెట్రోలియం ఉత్పత్పుల ధరలు పెరుగుతున్నా ప్రధాని పట్టించుకోరని...తనపై కేసులు మాత్రం వేస్తారని రాహుల్ మండిపడ్డారు. తాను చేస్తున్నది సైద్ధాంతిక పోరాటమని...ఆర్ఎస్ఎస్‌పై తాను చేస్తున్న పోరాటంలో తాను తప్పకుండా గెలుస్తానని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. 

English Title
Rahul Gandhi Pleads "Not Guilty" In Defamation Case Filed By RSS Leader

MORE FROM AUTHOR

RELATED ARTICLES