'పప్పూ' కాదు నిప్పు అంటున్న రాహుల్‌

పప్పూ కాదు నిప్పు అంటున్న రాహుల్‌
x
Highlights

పప్పూ అన్నారు. అజ్ణాని అన్నారు. మాట్లాడ్డం రాదని ఎద్దేవా చేశారు. వారసత్వమే తప్ప నాయకత్వ లక్షణాల్లేవని దెప్పి పొడిచారు. ఐరన్‌లెగ్‌ అని ముద్రేశారు....

పప్పూ అన్నారు. అజ్ణాని అన్నారు. మాట్లాడ్డం రాదని ఎద్దేవా చేశారు. వారసత్వమే తప్ప నాయకత్వ లక్షణాల్లేవని దెప్పి పొడిచారు. ఐరన్‌లెగ్‌ అని ముద్రేశారు. పరాజయాల పాదమని స్టాంపేశారు. ఇప్పుడు అవేనోళ్లు మూతపడుతున్నాయి. వెక్కిరించిన నొసళ్లే సైలెంటవుతున్నాయి. గుజరాత్‌‌లో మోడీని వణికించి, కర్ణాటకలో అపర చాణక్యం ప్రదర్శించి, కాషాయ కంచుకోట్లాంటి మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరేసి, తూటాల్లాటి మాటలు దూస్తూ, మిత్రో అబ్‌ కౌన్ హై పప్పు అంటున్నాడు.

రాహుల్‌ గాంధీ. అవును రాహుల్‌ గాంధీ. బీజేపీతో పాటు కొన్ని పార్టీలు ముద్దుగా పెట్టిన ముద్దపప్పు రాహుల్‌ గాంధీ. కానీ పప్పు కాదు నిప్పు అని, ఇప్పుడా రాహుల్‌ గాంధీయే సమరనాదం చేస్తున్నాడు. బీజేపీ ఫెవికల్ వేసి, తిష్టవేసిన మూడు రాష్ట్రాలను కొల్లగొట్టి, ఇప్పుడు చూసుకుందాం రా అని తొడగొడుతున్నాడు. మోడీ ఢీకి, రెడీ అంటున్నాడు. రాహుల్‌ టు పాయింట్‌ ఓ..రీలోడెడ్‌ అని గర్జిస్తున్నాడు. నిజంగా రాహుల్‌ గాంధీ మారాడా...లేదంటే గెలుపు ఊపులో లేనిపోని గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడా? కాంగ్రెస్ నాయకులు, ఇతర పార్టీల నేతలు, చివరికి బీజేపీ మిత్రులు కూడా, రాహుల్‌ను ఎందుకు ప్రశంసిస్తున్నారు?

అవును. ఐదు రాష్ట్రా ఎన్నికల్లో, మూడు రాష్ట్రాల్లో జయకేతనం ఎగరేసిన రాహుల్‌ గాంధీ పట్ల, ఇప్పుడు ఇలాంటి ప్రశంసలే కురిపిస్తున్నాయి. క్రియాశీలక రాజకీయాల్లో ఆయన రాటుదేలారని పలు పార్టీల ప్రముఖులు కితాబులిస్తున్నారు. రాజకీయ నాయకత్వానికి సంబంధించిన పరీక్షలన్నీ రాహుల్‌ పాసయ్యారని ఆ పార్టీ నేత వీరప్పమొయిలీ పొగిడారు. అంతేకాదు, సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉంటారని, ఓ రేంజ్‌లో ప్రశంసించారు. కాంగ్రెస్‌ విజయానికి రాహుల్‌ నాయకత్వ పటిమే కారణమని పార్టీ నేత జ్యోతిరాదిత్య సింధియా వ్యాఖ్యానించారు.

కేవలం కాంగ్రెస్‌ నేతలే కాదు, ఇతర పార్టీల నేతలు కూడా, రాహుల్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడుగా రాహుల్‌కు ప్రజామోదం లభించినట్లయ్యిందని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ప్రశంసిస్తే....బీజేపీకి రాహుల్ రూపంలో ప్రమాద ఘంటికలు మోగాయని ఎస్పీ నేత రాం గోపాల్‌ యాదవ్‌ అన్నారు. గతంలో ‘పప్పూ’గా విమర్శల పాలైన రాహుల్‌, ఇప్పుడు ‘పరమ పూజనీయుడు’ అయ్యారని ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌ రాజ్‌ ఠాకరే అన్నారు. గతంలో కాంగ్రెస్‌ పరాజయాలకు తనపై వచ్చిన విమర్శలను రాహుల్‌ స్వీకరించారని, ఇప్పుడు ప్రశంసలనూ అందుకోవాలని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా అభినందనలు తెలిపారు. ఇలా చెప్పుకుంటూపోతే, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో విజయపతాక ఎగరేసిన రాహుల్‌‌ను, అందరూ ఆకాశానికెత్తేస్తున్నారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ, మోడీ ఢీకొడతారని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories