ఎముకలు కుళ్లిన, వయసు మళ్లిన వృద్దులను సాగనంపి

ఎముకలు కుళ్లిన, వయసు మళ్లిన వృద్దులను సాగనంపి
x
Highlights

కాంగ్రెస్‌ పార్టీ శతాధిక పార్టీ. అంతేకాదు, శతకం కొట్టడానికి సిద్దంగా ఉన్న వృద్దుల పార్టీ కూడా. తరతరాలుగా కొందరు ముసలీముతక ఇందిరా గాంధీ తరం నేతలు,...

కాంగ్రెస్‌ పార్టీ శతాధిక పార్టీ. అంతేకాదు, శతకం కొట్టడానికి సిద్దంగా ఉన్న వృద్దుల పార్టీ కూడా. తరతరాలుగా కొందరు ముసలీముతక ఇందిరా గాంధీ తరం నేతలు, ఖద్దరు పార్టీ నీడలోనే నిద్రపోతున్నారు. మరికొందరు అటు పెద్ద తరానికి ఇటు యువతరానికి మధ్య సమన్వయంగా సాగుతున్నారు. మరి వృద్దుల పార్టీ ముద్రను రాహుల్‌ గాంధీ చెరిపేస్తాడా....ఎముకలు కుళ్లిన, వయసు మళ్లిన వృద్దులను సాగనంపి, నవయువ తరంతో నింపుతాడా....సీనియర్లు, జూనియర్ల పాతకొత్త కలయికను సామరస్యంగా సమన్వయం చేస్తాడా?

వంశపారంపర్య రాజకీయాలు మన దేశంలో పెద్ద సమస్య అని అంటూనే, రాహుల్‌ గాంధీ మొత్తానికి శతాధిక కాంగ్రెస్‌ పార్టీకి మరో నెహ్రూ-గాంధీ వారసుడయ్యాడు. కానీ అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే, గతంలో ఇందిరా, రాజీవ్, సోనియాలు పార్టీ కాస్త బెటర్‌గా ఉన్నప్పుడే బాధ్యతలు తీసుకుంటే, క్లిష్టపరిస్థితుల్లో రాహుల్‌ ముళ్లకిరీటం ధరిస్తున్నాడు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు రాహుల్‌ ముందు అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి.

ముసలీముతక నేతలకు కేరాఫ్‌ అడ్రస్ కాంగ్రెస్. మోతీలాల్‌ ఓరా నుంచి అనేకమంది ఇందిరా గాంధీ తరం నేతలు పార్టీని అట్టిపెట్టుకునే ఉన్నారు. సోనియా చుట్టూ అనేకమంది వృద్దనేతలు కనిపించారు. అందుకే డైనమిక్‌గా కనిపించే మోదీ, షాలను ఎదుర్కోనే వ్యూహాలను రచించలేకపోయారు. ఇప్పుడు రాహుల్ వీరందర్నీ సాగనంపి, యువరక్తంతో పార్టీని నింపాలి. కొత్త ముఖాలను తెరపైకి తీసుకురావాలి. సంస్థాగతంగా పెనుమార్పులు చేసి, పాత వారందరికీ ఉద్వాసన చెప్పి కొత్త రక్తం నింపాలి. అప్పుడే 2019 ఎన్నికల సంగ్రామానికి యువసైన్యం తయారవుతుంది. లేదంటే బాహుబలి-భళ్లాలదేవుల్లాంటి మోదీ-షాలను ఎదుర్కోవడం అంత సులభం కాదు.

రాహుల్‌కు మెరికల్లాంటి కొందరు యువకుల సపోర్ట్‌ ఉంది. జ్యోతిరాదిత్య సింధియా, సచిన్‌ పైలట్‌, రణ్‌దీప్‌ సూర్జే వాలా, అజయ్‌ మాకెన్‌, మిళింద్‌ దేవర, దీపేందర్‌ హూడా, సందీప్‌ దీక్షిత్‌, రాజీవ్‌ సాతవ్‌, గౌరవ్‌ గొగోయ్‌, సుస్మిత దేవ్‌ వంటి యంగ్‌ అండ్ డైనమిక్‌ లీడర్లు ఉన్నారు. వీరికి కీలక పగ్గాలు అప్పగిస్తే, రాహుల్ బృందం దూసుకెళ్లడం ఖాయం.

వృద్దతరం-నవతరం మధ్యలో చాలామంది సీనియర్లున్నారు. వీరి అనుభవం రాహుల్‌కు చాలా అవసరం కూడా. గులాం నబీ ఆజాద్‌, మల్లికార్జున్‌ ఖర్గే, కమల్‌నాథ్‌, ఆంటొనీ, చిదంబరం, దిగ్విజయ్‌ సింగ్‌, ఆనంద్‌ శర్మ వంటివారు గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా ఇందిరా గాంధీ కుటుంబం చెంతనే ఉన్నారు. వీరిని విస్మరించడం కష్టమే. యువతరం మద్దతు ఎంత అవసరమో పార్లమెంటులో, పార్టీ నిర్వహణలో సీనియర్లూ అంతే అవసరం. కనుక పాత కొత్తల మేలుకలయికగా రాహుల్‌ బృందం ఉండాల్సిందే. లేదంటే చుక్కానిలేని నావ అవుతుంది కాంగ్రెస్.

సోనియా గాంధీకి నమ్మినబంటు అహ్మద్‌ పటేల్. గుట్టుచప్పుడు కాకుండా కాంగ్రెస్‌లో అంతర్గత నియామకాలు, వివాదాలు పరిష్కారం, అసమ్మతి సెగలను అదుపు చేసేవారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలతో విభేదాలు పరిష్కరించేవారు. అయినా రాహుల్‌ ఆయనను రాజకీయ కార్యదర్శిగా నియమించే అవకాశం లేదంటున్నారు. మరి ఎవరెవరితో తన టీంను రాహుల్‌ సెట్‌ చేసుకుంటాడా చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories