రాహుల్ ముందున్న సవాళ్లు

రాహుల్ ముందున్న సవాళ్లు
x
Highlights

వచ్చే ఏడాది దేశంలో వివిధ రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అధ్యక్షుడైన తర్వాత మొదటి ఎన్నిక కర్ణాటక రూపంలో ఎదురుకాబోతోంది రాహుల్‌కు. 2018 ఆరంభంలో...

వచ్చే ఏడాది దేశంలో వివిధ రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అధ్యక్షుడైన తర్వాత మొదటి ఎన్నిక కర్ణాటక రూపంలో ఎదురుకాబోతోంది రాహుల్‌కు. 2018 ఆరంభంలో కర్ణాటక శాసన సభకు ఎలక్షన్స్‌ జరుగుతాయి. మోదీ-షాలు ఒక్కో కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని కమలం బుట్టలో వేస్తున్న తరుణంలో, కర్ణాటకలో అధికారం నిలబెట్టుకోవడం ఖద్దరు పార్టీకి అత్యంత ముఖ్యం. బీజేపీ ఇక్కడ మరోసారి పాగావేస్తే, దక్షిణాదిలో బలపడ్డానికి ద్వారాలు మరింతగా తెరుచుకున్నట్టే.
కర్ణాటక తర్వాత వరుసగా బీజేపీ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీలకు బ్యాలెట్‌ వార్‌ మొదలవుతుంది. బీజేపీకి దీటైన జవాబివ్వాలంటే, 2019కి క్యాడర్‌లో కాన్ఫిడెన్స్‌ నింపాలంటే, కమలం కోటలను రాహుల్‌ మొదట బద్దలుకొట్టాలి. అందుకోసం పార్టీని ఏ మేరకు సిద్ధం చేయగలరన్నది వేచిచూడాలి.
శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో మధ్యప్రదేశ్‌లో దూసుకెళుతోంది బీజేపీ. కానీ వ్యాపం స్కాం, అత్యాచారాలు, శాంతిభద్రతలు చౌహాన్‌ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కానీ వీటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే నాయకత్వం కనిపించడం లేదక్కడ. అంతర్గత కుమ్ములాటలు రాజ్యమేలుతున్నాయి. జ్యోతిరాదిత్య సింధియా, కమల్‌నాథ్‌ల వైరం తారాస్థాయికి చేరింది. ఇక దిగ్విజయ్‌సింగ్‌ గొడవలు అంతాఇంతాకాదు. ఈ విభేదాలు, వివాదాలు సమసిపోయేందుకు రాహుల్‌ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఉత్తరాది, దక్షిణాది పీసీసీల్లో ఆత్మవిశ్వాసం కనపడ్డంలేదు. పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌ ప్లేస్‌ను వెతుక్కోవాల్సన పరిస్థితి. దశాబ్దాలుగా మూడోస్థానానికే పరిమితమైంది. తమిళనాడులో ఒకటో అరో సీటు సంపాదించడానికి డీఎంకే, ఏఐఏడీఎంకేల్లో ఏదో ఒక పార్టీని ఆశ్రయించక తప్పని పరిస్థితి. జయలలిత మరణం తరవాత ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని భర్తీ చేయడానికీ తనవంతు ప్రయత్నాలేవీ చేయలేదు కాంగ్రెస్‌. మరి రాహుల్‌ ఏం చేస్తాడో చూడాలి.
ఇక తెలంగాణ ఇచ్చిన పార్టీగా పేరున్నా, ఓట్లరూపంలోకి మార్చుకోలేకపోయింది కాంగ్రెస్. అందుక్కారణం స్థానిక నాయకుల్లో విభేదాలు, నాయకత్వలేమీ. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతామంటూ బీజేపీ చెలరేగిపోతోంది. ఈ తరుణంలో పార్టీని పటిష్టం చేయడం, నాయకత్వాన్ని ఏకతాటిపైకి తేవడం రాహుల్‌ ముందున్న సవాలు. త్వరలో తెలంగాణలో పర్యటించబోతున్న రాహుల్, రేవంత్‌ రెడ్డి, విజయశాంతిలకు సముచితస్థానమిస్తారని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ నామరూపాల్లేకుండాపోయింది. ఒకప్పుడు కంచుకోటయిన ఏపీని, విభజనతో పోగొట్టుకుంది కాంగ్రెస్. తిరిగి రాహుల్ ఎలా నిలబెడతాడో చూడాలి.
ఉపాధ్యక్షుడిగా ఇప్పటివరకూ జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో రాహుల్‌ సాధించిందేమీ లేదు ఒక్క పంజాబ్‌లో తప్ప. సొంత నియోజకవర్గం అమేథిలో ఎమ్మల్యేస్థానాలు, మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వార్డులు కోల్పోయారు. కానీ గుజరాత్‌లో మాత్రం తన ప్రచార తీరును మార్చేసి ఆకట్టుకున్నాడని రాహుల్‌పై ప్రశంసలున్నాయి.
ఇలా వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చడం, పీసీీసీలను పటిష్టం చేయడం రాహుల్‌కు సవాలే.. అందుకోసం కొత్త కాంగ్రెస్ చీఫ్ ఏం చేస్తాడో చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories