ఉమ్మడి మెదక్ జిల్లాలో హోరాహోరి పోరు.. పీఠంపై ఏ జెండా ఎగరబోతుంది..?

Submitted by santosh on Mon, 11/26/2018 - 17:55
all parties

ఒకవైపు గులాబీ, మరోవైపు కమలం, ఇంకోవైపు కూటమి, అటువైపు స్వతంత్రులు. మెదక్‌ జిల్లా రాజకీయ సమరాంగణంపై నలుదిక్కులా రాజకీయ సేనలు మోహరించాయి. ఎన్నికల్ని సమర్థంగా ఎదుర్కొనడానికి సర్వ సన్నద్ధమై బరిలో నిలిచాయి. వ్యూహ ప్రతివ్యూహాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, సభలు, సమావేశాలతో రసవత్తరంగా మారిన ఉమ్మడి మెదక్‌ జిల్లా రాజకీయంలో ఎవరి ధీమా వారిదే. ఎవరి వ్యూహాలు వారివే. ఎవరి లక్ష్యమైనా గమ్యాన్ని ముద్దాడాలి గద్దెనెక్కాలి. ఉత్కంఠభరిత పోరులో, ఊహకందని మార్పులతో రాజకీయాన్ని ఉరకలెత్తిస్తున్న మెదక్‌ జిల్లా భావి ఎన్నికలను చర్నాకోల్‌తో నడిపిస్తానంటోంది. మరి ఓటరు మదిలో ఏముంది? మెదక్‌ జిల్లా పాలిటికల్‌ యాంగిల్‌ ఏమంటోంది? ఇదే ఇవాళ్టి 

మెదక్ జిల్లా ఈసారి రాష్ట్రవ్యాప్తంగా తన దృష్టిని ఆకర్షించనుంది. ఈ జిల్లా నుంచి హేమాహేమీలు బరిలో నిలిచారు. రసవత్తర పోరులో రంగులు మారుతున్న రాజకీయం ఊహకందని పరిణామాలను చూపిస్తోంది. ఓటరు మదిలో ఏముందో వారి వజ్రాయుధం ఎవరికి గురిపెడతారో నాడీ అందక, అంచనాలు వేయలేక నాయకులు అల్లాడుతున్నారు. మొత్తమ్మీద ఉమ్మడి మెదక్ జిల్లా, మరోసారి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు ఎన్నికల రణక్షేత్ర వేదికపై ఎదురుచూస్తోంది.

ఘన చరితకు రాజకీయ చతురతకు నిలయం మెదక్‌ జిల్లా. ఉమ్మడి జిల్లా నుంచి సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలుగా మారినా రాజకీయాల్లో మొత్తం మూడు జిల్లాలు చెరగని ముద్ర వేశాయి. నియోజకవర్గాల పునర్వివిభజనకు ముందు రూపురేఖలు మరోలా ఉన్నా తర్వాత రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయాలు మొదలయ్యాయి. ఏమైనా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల వేళ రాజకీయ పార్టీల నేతలు పరస్పర సవాళ్లు ప్రతి సవాళ్లు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. జిల్లాలో ఉన్న మొత్తం పది నియోజకవర్గాల్లో అభివృద్ధిపై పరస్పర ఆరోపణలు చేసుకున్న పార్టీలు టెన్షన్ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. 

గజ్వేల్‌. ఈ నియోజకవర్గం నుంచి గులాబీదళాధిపతి కేసీఆర్‌... కాంగ్రెస్‌ నుంచి.. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి కేసీఆర్‌కు టగ్‌ వార్‌ ఇచ్చిన ఒంటేరు ప్రతాపరెడ్డి, బీజేపీ నుంచి ఆకుల విజయ బరిలో దిగుతున్నారు. త్రిముఖ పోరులో ముఖ్యంగా టీఆర్ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌ అన్నట్టుగానే హోరాహోరి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీయే అధికారంలోకి రావడం ఆనవాయితీగా వస్తోంది. మరి ఈసారి ఏమవుతుందో చూడాలి. 

ఇక సిద్దిపేట. ఈ ఎన్నికల్లో సిద్దిపేట బరిలో త్రిముఖ పోరు ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్‌ నుంచి హరీష్‌రావు, కూటమి పొత్తులో భాగంగా సీటు దక్కించుకున్న టీజేఎస్ నుంచి భవానీరెడ్డి, బీజేపీ నుంచి నరోత్తమ్‌రెడ్డి బరిలో తలపడుతున్నారు. పార్టీలు ఏవైనా అభ్యర్థులెవరైనా.. వార్‌ వన్‌సైడ్‌ అన్నట్టుగానే సాగే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దుబ్బాక. ఈ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్‌ నుంచి రామలింగారెడ్డి, టీజేఎస్‌ నుంచి చిందెం రాజ్‌కుమార్‌, బీజేపీ నుంచి రఘునందన్‌రావులు తలపడుతున్నారు. పార్టీలు ఏవైనా ఇక్కడ కూడా వ్యక్తిగతంగానే రామలింగారెడ్డి, రఘునందన్‌రావుల మధ్యే ఆసక్తికరమైప పోరు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక మెదక్‌ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్‌ నుంచి డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, బీజేపీ నుంచి ఆకుల రాజయ్య, టీజేఎస్‌ నుంచి జనార్దన్‌రెడ్డి బరిలో నిలిచారు. 

జహీరాబాద్‌. ఈ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్‌ తరుపున మానిక్‌రావు, కాంగ్రెస్‌ నుంచి గీతారెడ్డి, బీజేపీ నుంచి జనగామ గోపి బరిలో నిలిచారు. త్రిముఖ పోరు ఉన్నా టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే హోరాహోరి పోరు జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇటు నర్సాపూర్‌ నియోజకవర్గంలో కూడా త్రిముఖ పోరే కనిపిస్తోంది. టీఆర్ఎస్‌ నుంచి మదన్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి సునీతాలక్ష్మారెడ్డి, బీజేపీ నుంచి ఎస్‌. గోపి బరిలో నిలిచారు. ఇక్కడ కూడా మదన్‌రెడ్డి వర్సెస్‌ సునీతాలక్ష్మారెడ్డి మధ్యే హోరాహోరి పోరు జరుగుతుంది.

నారాయణ్‌ఖేడ్‌ నియోజకవర్గంలో కూడా సేమ్‌ సీన్‌. టీఆర్ఎస్‌ నుంచి భూపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి సురేష్‌ షట్కార్‌, బీజేపీ నుంచి సంజీవరెడ్డి బరిలో నిలవగా టీఆర్ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌గానే పోరు జరుగుతుందంటున్నారు విశ్లేషకులు.
ఆంథోల్‌ నియోజకవర్గంలో ఈసారి ఆసక్తికరమైన పోరుండే అవకాశాలున్నాయి. టీఆర్ఎస్‌ నుంచి జర్నలిస్టు క్రాంతికిరణ్‌, కాంగ్రెస్‌ నుంచి దామోదర రాజనర్సింహా, బీజేపీ నుంచి గత ఎన్నికల్లో టీఆర్ఎస్‌ నుంచి గెలిచి... ఈసారి పార్టీ మారిన బాబుమోహన్‌బరిలో నిలిచారు. ఓటరు ఇక్కడ ఎవరిని వరిస్తారన్నది చివరకంటా ఉత్కంఠే ఉండనుంది.

పటాన్‌చెరు. ఈ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్‌ తరుపున మహిపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి కాటం శ్రీనివాసగౌడ్‌, బీజేపీ నుంచి కరుణాకర్‌రెడ్డి బరిలో నిలిచారు. సంగారెడ్డి. ఈ నియోజకవర్గంలో కూడా త్రిముఖపోరే. టీఆర్‌ఎస్‌ నుంచి చింతా ప్రభాకర్‌, కాంగ్రెస్‌ నుంచి జగ్గారెడ్డి, బీజేపీ నుంచి రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే నిలిచారు. ఇక్కడ నుంచి జగ్గారెడ్డి వర్సెస్‌ ప్రభాకర్‌గా సాగే పోరులో అంతిమ విజేత ఎవరో కూడా ఉత్కంఠగా ఉంది.మొత్తంగా ఆసక్తికరమైన ఉమ్మడి మెదక్‌ జిల్లా పోరులో ఓటరు దేవుడిపైనే నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఎవరిని గట్టెక్కిస్తారో ఎవరిని గద్దెనెక్కిస్తారో వేచి చూడాలి.
 

English Title
Pulse of The Medak Voters

MORE FROM AUTHOR

RELATED ARTICLES