యాదాద్రిలో పాపపు పనులు

Submitted by arun on Tue, 04/03/2018 - 11:27

తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం యాదాద్రి పాడు పనులకు ఆలవాలంగా మారుతోంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుపుతూ అపవిత్రం చేస్తున్నారు కొందరు. ప్రధానంగా ప్రైవేటు లాడ్జీలు, హోటళ్లూ అక్రమ జంటల నుంచి దండిగా డబ్బు తీసుకొని విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ చీడను కంట్రోల్ చేయాల్సిన పోలీసులు కంటితుడుపు చర్యలతో సరి పెడుతుండటంతో ఈ దందా అడ్డూఅదుపు లేకుండా సాగిపోతోంది. 

యాదాద్రి.. స్వయంభూగా నరసింహుడు వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలకు ధీటుగా తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న పవిత్ర ప్రదేశం. ప్రత్యేక శ్రద్ధతో పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన తెలంగాణ సర్కార్ యాద్రాద్రిని అభివృద్ధి చేస్తోంది. దీంతో యాదాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. రోజురోజుకీ పెరుగుతున్న భక్తుల సంఖ్యతో పాటుగా ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయి. కోరినవారికి కొంగు బంగారమైన నరసింహుడి సన్నిధికి కొందరు అక్రమ జంటలు తమ కోరికలు, శారీరక వాంఛలు తీర్చుకొనేందుకు వస్తున్నారు. ‌

స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందికరంగా యాదాద్రిలోని ప్రైవేటు లాడ్జీలు, హోటళ్లలో ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ప్రధానంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో ఈ అక్రమ జంటలు అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తూ పవిత్ర వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఇక్కడ వ్యభిచార గృహాలు ఓపెన్‌గానే నడిచేవి. కానీ పోలీసులు ఉక్కుపాదంతో దాన్ని చాలావరకు అదుపు చేయగలిగారు. ఇపుడు లాడ్జీలు, హోటళ్లు, అతిధి గృహాలు ఈ జాడ్యానికి కేంద్రాలుగా మారాయి.

యాదాద్రిలో అనైతిక కార్యకలాపాలపై రాచకొండ పోలీసులు అపుడపుడు కొరడా ఝుళిపిస్తున్నా వీటిని పూర్తిగా అదుపు చేయలేక పోతున్నారు. లాడ్జీలపై దాడి చేసిన ప్రతిసారీ అక్రమ జంటలు దొరుకుతున్నారంటే ఇక్కడ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటివరకు 12 లాడ్జీలు సీజ్ చేసినా పరిస్థితిలో మార్పు లేదు. దీంతో లాడ్జ్ నిర్వాహకులపై, పదే‌పదే దొరికే అక్రమ జంటలపై కూడా పిడి యాక్ట్ పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. లాడ్జీలు, హోటళ్లు పది రకాల నియమ నిబంధనలు పాటించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు చెబుతున్నారు.

పవిత్ర ఆధ్యాత్మికత వాతావరణం ఉండాల్సిన చోట అసాంఘిక, అనైతిక కార్యకలాపాలు జరిగితే తాట తీస్తామని పోలీసులు వార్నింగిస్తున్నారు. ఈ వ్యవహారంలో పోలీసులు కంటితుడుపు చర్యలతో సరిపెట్టకుండా  కఠినంగా వ్యవహరించాలని స్థానికులు భక్తులు కోరుతున్నారు.

Tags
English Title
prostitution: Yadadiri makeover has ugly underbelly

MORE FROM AUTHOR

RELATED ARTICLES