ఎన్నికల ఎజెండాగా విద్యావ్యవస్థ... తప్పా? ఒప్పొ?

Submitted by santosh on Fri, 11/30/2018 - 11:13
private educational correspondents

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. నాలుగేళ్లలో కనీసం ఒక్కసారి అపాయింట్ మెంట్ ఇవ్వని.. తమ గోడు వినని.. కేసిఆర్ పై కత్తి కట్టిన కేజీ టు పీజీ జేఏసి ఇవాళ రాహుల్ ని కలసి తమగోడు వెళ్లబోసుకుంది.. అధికారం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ తమను గెలిపిస్తే  ఫీజు రియింబర్స్ మెంట్ కల్పిస్తామని హమీ ఇచ్చింది. అలా విద్యా వ్యవస్థ కూడా ఎన్నికల ఎజెండాగా మారిపోయింది. తెలంగాణలో అధికారం సాధించాలన్న పట్టుదలతో ఉన్న మహాకూటమి కేసిఆర్ పై రేగుతున్న ప్రతీ వ్యతిరేకతనూ తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. తెలంగాణ ప్రభుత్వం తీరుపైనా, కేసిఆర్ వైఖరిపైనా తీవ్ర అసంతృప్తితో ఉన్న కేజీ టు పీజీ జేఏసి నేతలతో ఇప్పటికే మహాకూటమి నేతలు సమావేశమయ్యారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. 
నాలుగున్నర ఏళ్లలో ఒక్క సారికూడా అపాయింట్ మెంట్ ఇవ్వని సీఎంపైనా.. ప్రైవేటు విద్యాసంస్థలను అణచివేసే విధంగా వ్యవహరిస్తున్న తీరుపైనా మండి పడుతున్న ఈ జేఏసీ బేషరతుగా ఇప్పటికే మహా కూటమికి ఓటేస్తామని ప్రకటించింది. రెండు రోజుల ఎన్నికల ప్రచారానికి వచ్చిన రాహుల్ కేజీ టు పీజీ జేఏసి నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.ప్రైవేటు విద్యాసంస్థలపై కత్తి కట్టినట్లు వ్యవహరిస్తున్న టీఆరెస్ ప్రభుత్వం వేల స్కూళ్లను ఇప్పటికే మూసేయించిందని వక్తలు మండిపడ్డారు. స్కూళ్ల నిర్వహణే కష్టంగా మారుతోందని, ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక చాలా మంది స్కూళ్లను మూసేశారనీ అన్నారు.. ఉద్యమ సమయంలో తమ సేవలను వాడుకున్న కేసిఆర్ రాష్ట్రం వచ్చాక ఆంధ్ర కార్పొరేట్ విద్యాసంస్థలతో కుమ్మక్కై ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థలను బలవంతంగా మూసేయించారని ఆరోపించారు. ట్రెస్మా  ఆధ్వర్యంలోని స్కూళ్లను బోగస్ సంస్థలంటూ విజిలెన్స్ రైడింగ్స్, పోలీసులతో దాడులతో ఇబ్బందులు పెట్టారన్నారు. స్కూళ్ల నిర్వహణ  భారంగా మారిందన్నారు. సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ తాము అధికారంలోకి వస్తే.. పరిస్థితిని చక్కదిద్దుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ  తురుపు ముక్క అయిన ఫీజు రీయింబర్స్ మెంట్ అస్త్రాన్ని మళ్లీ సంధించారు రాహుల్.

ఎన్నికల సమయంలో కేజీ టు పీజీ ఉచిత విద్య అని హామీ ఇచ్చిన టిఆరెస్ అధికారం లోకి రాగానే ఈ స్కీము కోసం125  కోట్లు విడుదల చేయడానికి ఇష్టపడలేదు... ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థలపై ఇనస్పెక్షన్ అంటూ విజిలెన్స్ దాడులు చేయించడంతో వేలాది స్కూళ్లు మూతపడ్డాయని సమావేశంలో  విద్యాసంస్థల నేతలు తెలిపారు. లక్షమంది ఉపాధ్యాయులు రోడ్డున పడ్డారని, అక్షరాస్యతలో  రాష్ట్రం బీహార్ కన్నా  వెనుకబడి పోయిందనీ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల విద్యాసంస్థలు మూతపడ్డాయన్నారు.. అందుకే ఈ సారి ఎన్నికల్లో మహాకూటమికి ఓటేయాలని సమావేశంలో పాల్గొన్న నేతలు పిలుపు నిచ్చారు.. ఓటర్లలో దాదాపు లక్ష మంది ఉపాధ్యాయులున్నందున వీరందరి ఓట్లు మహా కూటమికి కచ్చితంగాపడతాయని కాంగ్రెస్ లెక్కలేస్తోంది. మొత్తం మీద విద్యా వ్యవస్థ కూడా ఎన్నికల ఎజెండాగా మారిపోయింది.

English Title
private educational correspondents

MORE FROM AUTHOR

RELATED ARTICLES