సిట్టింగులు వర్సెస్ ఆశావహులు...టీఆర్ఎస్‌లో రాజుకుంటున్న ముందస్తు చిచ్చు

x
Highlights

ఓ వైపు ముందస్తు అంటున్నారు మరోవైపు సిట్టింగులకే అవకాశాలంటున్నారు మరి తమకేంటని ఆలోచిస్తున్నారు టీఆర్ఎస్ క్యాడర్. గత ఎన్నికల్లో చేజారిన అవకాశం కోసం ఈ...

ఓ వైపు ముందస్తు అంటున్నారు మరోవైపు సిట్టింగులకే అవకాశాలంటున్నారు మరి తమకేంటని ఆలోచిస్తున్నారు టీఆర్ఎస్ క్యాడర్. గత ఎన్నికల్లో చేజారిన అవకాశం కోసం ఈ సారి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ సారైనా చేజారనీయొద్దని పట్టుదలతో ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. సీట్ల కోసం నోటికి పనిచెబుతున్నారు. దీంతో అధికార పార్టీలో ఇటు సిట్టింగులకు అటు ఆశావహుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది.

ముందస్తు ఎన్నికల హడావుడితో అధికార టీఆర్ఎస్ లో టిక్కెట్ల వేడి రాజుకుంటోంది. అంతేనా అది వర్గపోరుకు దారితీసినట్లే కనిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీ ఫారాల కోసం ఆశావ‌హులంతా అప్పుడే త‌మ ప్ర‌య‌త్నాలు మొదలుపెట్టగా సిట్టింగ్‌లకు సరికొత్త టెన్ష‌న్ పట్టుకుంది. త‌మ‌కు టిక్కెట్ ద‌క్కుతుందో లేదోన‌నే ఆందోళ‌న‌ కనిపిస్తోంది. ఇన్నాళ్లూ త‌మ‌కు టిక్కెట్ ద‌క్క‌లేద‌ని మ‌ద‌న‌ప‌డుతూ వ‌చ్చిన నేత‌లంతా ఇప్పుడు మ‌రోసారి తమ అదృష్టాన్ని ప‌రిక్షించుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే పార్టీ ముఖ్య‌ నేత‌ల‌తో ట‌చ్ లో ఉంటూ టిక్కెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

ముఖ్యంగా వ‌రంగల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యే కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తుండగా ఇదే నియోజ‌వ‌ర్గం నుంచి మాజీ మంత్రి బ‌స్వ‌రాజ్ సార‌య్య‌, ఎర్ర‌బెల్లి ప్ర‌దీప్ రావు, న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్ తో పాటు ప‌లువురు నేత‌లు టిక్కెట్ ఆశిస్తున్నారు. అందుకోసం పార్టీ హైక‌మాండ్ పెద్ద‌ల దగ్గర గ‌ట్టిగానే ప‌ట్టుబ‌డుతున్నారు. లాబీయింగ్‌ తో పావులు కదుపుతున్నారు. దీన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే కొండా సురేఖ సహించడం లేదనే వాదన వినిపిస్తోంది. అందులో భాగంగానే ఆమె సొంత పార్టీ నేత‌లనుద్దేశించి ఘాటైన విమ‌ర్శ‌లు చేశారని చెబుతున్నారు. కొత్తగా మీసాలు మెలిపెడితే ఉన్న‌వి ఊడ‌తాయని హైబ్రీడ్ జాతి మ‌నుషులు వ‌చ్చీ రాని వేషాలు వేస్తే స‌హించేది లేదంటూ రకరకాలుగా విమర్శల వాన కురిపించారు.

ఇక అధికారపార్టీకి చెందిన మ‌రో ఎమ్మెల్యే గువ్వ‌ల బాల‌రాజుకు సైతం సొంత‌పార్టీ నేత‌ల‌నుంచి పోటీ త‌ప్ప‌డం లేదు. తెలుగుదేశం నుంచి టిఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్న మాజీ మంత్రి రాములు అచ్చంపేట‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేకు త‌ల‌నొప్పిగా మారారు. దీంతో స‌హ‌నం కొల్పోయిన గువ్వ‌ల‌ రాములుతో పాటు అతని అనుచరులపై నోటికి పనిచెబుతున్నారు.

ఇటు ఆలంపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో మాజీ ఎంపి మందా జ‌గ‌న్నాధం కుమారుడు శ్రీనాధ్ పోటీ చేసి ఓడిపోయారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోమారు అదృష్టాన్ని ప‌రిక్షించుకోవాల‌ని నియోజ‌క‌వ‌ర్గంలోనే టెంట్ వేసుకుని కూర్చున్నారు. అయితే ఇటీవ‌ల టీడీపీ నేత గులాబీ తీర్థం పుచ్చుకున్న డాక్టర్ అబ్ర‌హం వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కే టిక్కెట్ గ్యారంటీ అని ప్ర‌చారం కూడా ప్రారంభించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మందా జ‌గ‌న్నాధం అబ్ర‌హంపై ఓపెన్ గానే ఫైర్ అయ్యారు.

మరోవైపు మ‌హ‌బూబాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో కూడా వ‌ర్గ‌పోరు తీవ్రతరమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్ ఉండ‌గా కాంగ్రెస్ నుంచి గులాబీ గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే మాలోతు క‌వితతో పాటు మరికొందరు కూడా టిక్కెట్ల కోసం ఆశిస్తున్నారు. ఇది సిట్టింగ్ ఎమ్మెల్యేకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో శంక‌ర్ నాయ‌క్ ఆశావ‌హుల‌పై అక్క‌సు వెళ్లగ‌క్కారు. కొంత‌మంది నేత‌లు చిత్తకార్తె కుక్క‌ల్లా తిరుగుతున్నార‌ంటూ నోరు పారేసుకున్నారు. బ్రోక‌ర్ల వెంట తిర‌గ‌కండి జీవితాల్ని నాశ‌నం చేసుకోకండి అంటూ సలహా ఇస్తూనే హెచ్చ‌రిస్తున్నారు.

ఇవి మచ్చుకు కొన్నే. మెజారిటీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు బాహ‌టంగానే బ్లాస్ట్ అవుతుంటే మ‌రికొన్ని చోట్ల ఎమ్మెల్యేలు లోలోప‌లే మ‌ద‌న‌ప‌డుతున్నారు. మొత్తంగా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో వ‌ర్గ‌పోరు నివురుగ‌ప్పిన నిప్పులా రగులుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories