మిర్యాలగూడ పరువు హత్య కేసులో కీలక ముందడుగు

మిర్యాలగూడ పరువు హత్య కేసులో కీలక ముందడుగు
x
Highlights

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్య కేసులో కీలక ముందడుగు పడింది. ప్రణయ్‌ను హత్య చేయించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ 1, ఏ 2...

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్య కేసులో కీలక ముందడుగు పడింది. ప్రణయ్‌ను హత్య చేయించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ 1, ఏ 2 నిందితులు అమృత తండ్రి మారుతిరావు, బాబాయ్‌ శ్రవణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్‌ అమృతతో సుమారు గంటన్నర పాటు మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు.

తన తండ్రి మారుతిరావే తన భర్త ప్రణయ్‌ను హత్య చేయించాడని అమృత ఆరోపిస్తోంది. పదో తరగతి నుంచి ప్రణయ్‌, తాను ప్రేమలో ఉన్నట్లు చెబుతున్న అమృత తామిద్దరి పెళ్లికి ఇంట్లో అస్సలు ఒప్పుకోలేదని వివరించింది. ఇక తాను గర్భవతి అని తెలిసినప్పటి నుంచి అబార్షన్‌ చేయించుకోవాలని తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని అమృత తెలిపింది. అందుకు తాను ససేమీరా అన్నానని అప్పటి నుంచే మాపై తమ తండ్రి కక్ష కట్టారని కన్నీరుమున్నీరైంది. ప్రణయ్‌ను చంపేస్తే తాను పుట్టింటికి వస్తానని భావించారంటున్న అమృత తన కడుపులో పెరుగుతున్న బిడ్డను ప్రణయ్‌ గుర్తుగా పెంచుకుంటానని వివరించింది. హంతకులకు శిక్ష పడే వరకు పోరాడుతానని స్పష్టం చేసింది.

మరోవైపు ప్రణయ్‌ హత్యకు గత 20 రోజుల క్రితమే ప్లాన్ వేశారు. నిన్న ప్రణయ్‌ హత్యకు ముందు కూడా అతని ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించారు. అక్కడి నుంచి హాస్పిటల్‌కు వెళ్తుండగా వారిని వెంటాడారు. ఆస్పత్రి లోనికి వెళ్లే వరకు అక్కడే మాటు వేశారు. బయటకు రాగానే అదును చూసుకుని ప్రణయ్‌ను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

హైదరాబాద్‌కు చెందిన ఓ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చి మారుతిరావు హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే హత్య చేసిన వ్యక్తితో అమృత తండ్రి మారుతిరావు ఎప్పటికప్పుడు మొబైల్‌లో టచ్‌ లో ఉన్నాడు. ముందుగా కొంత అడ్వాన్స్‌ చెల్లించిన మారుతిరావు పని పూర్తయ్యాక మిగతా మొత్తాన్ని ఇస్తాననే ఒప్పందం చేసుకున్నాడు.

మరోవైపు ప్రణయ్‌ హత్యకు నిరసనగా షెడ్యూల్‌ కులాలు బంద్‌కు పిలుపునివ్వడంతో మిర్యాలగూడ నిర్మాణుశ్యంగా మారింది. ఇటు ప్రణయ్‌ కుటుంబ సభ్యులను తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్‌ ఛైర్మెన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ పరామర్శించారు. ఇది పూర్తిగా కుల అహంకారపూరిత హత్యగా భావిస్తున్నట్లు ఆయన హెచ్ఎం టీవీతో తెలిపారు. ఇలాంటి వారికి కఠిన శిక్ష పడేలా చేస్తామని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories