పెట్రో మంటకు మోదీ ఆయింట్‌మెంట్ పూస్తారా..?

Submitted by arun on Thu, 09/13/2018 - 14:43

ఈ వారంలో ప్రధాని మోడీ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి మారకం విలువ భారీగా పతనమవ్వడం, పెట్రోలు ధరల విపరీతంగా పెరగడంపై సమీక్ష జరపబోతున్నారు. రేపో ఎల్లుండో ప్రధాని నరేంద్ర మోడీ ఈ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. రూపాయి పతనం, ఇంధన పెరుగుదల అంశాలపై సమీక్ష జరిపిన తర్వాత ప్రధాని కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. పెట్రో ధరల కట్టడి కోసం ప్రభుత్వం చేపట్టబోతున్న చర్యలను గురించి ప్రధాని ప్రజలకు వివరించే అవకాశం ఉంది. 

అంతర్జాతీయ మార్కెట్‌ లో రూపాయి విలువ భారీగా పతనమవ్వడం, పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలను సీరియస్ గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం..ఈ అంశంపై దృష్టి సారించింది. రూపాయి బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని సమీక్షిస్తారు. అలాగే రోజు రోజుకీ పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరల్ని అదుపు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై చర్చలు జరుపుతారు. ఈ భేటీకిఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌, పీఎంఈఏసీ ఛైర్మన్‌ వివేక్‌ దేవ్‌రాయ్‌ హాజరవుతారు. అలాగే రిజర్వు బ్యాంకు అధికారులు, ఆర్థిక సలహాదారులు, వివిధ శా‌ఖల ఉన్నతాధికారులను కూడా సమావేశానికి రమ్మని ఆదేశించారు.

ముఖ్యంగా పెట్రోల్ ధర 80 రూపాయలు దాటడం డీజిల్ ధర 73 రూపాయలు దాటడం ప్రజల్లో ఆందోళన కల్గిస్తోంది. ఆఖరికి పండగపూటైన ఇవాళ కూడా చమురు కంపెనీలు పెట్రో బాదుడు ఆపలేదు. ఇవాళ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 13పైసలు, డీజిల్‌పై 11 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 81రూపాయలకు చేరుకోగా డీజిల్ 73 రూపాయల 8 పైసలకు చేరుకుంది. రోజురోజుకూ ఇంధన ధరలు పెరుగుతుండటంపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీలో చేర్చాలని ప్రజలతో పాటు విపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి.

పెట్రో ధరలు భారీగా పెరుగుతున్న సమయంలో ప్రధాని నిర్వహించబోయే సమీక్షా సమావేశం ఆసక్తికరంగా మారింది. పెట్రో ధరల పెరుగుదలపై మోడీ ఏ నిర్ణయం తీసుకుంటారా అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. పెట్రోల్-డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే ప్రతిపాదనను మోడీ పరిశీలించే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల సమాచారం. ఒకవేళ అదే జరిగితే పెట్రోల్-డీజిల్ ధరలు 50 రూపాయల దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. పెట్రో ధరల భారం పెరిగిపోవడంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించి వాహనదారులకు కాస్త ఊరట కలిగించాయి. ఇప్పుడు మోడీ పెట్రో ధరల తగ్గింపునకు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ఆసక్తి నెలకొంది.

English Title
PM Modi calls high-level meet on rising fuel prices, falling rupee

MORE FROM AUTHOR

RELATED ARTICLES