నోటాకు ఎందుకు టాటా? అసలు ఏముంది ఆ మూవీలో!?

నోటాకు ఎందుకు టాటా? అసలు ఏముంది ఆ మూవీలో!?
x
Highlights

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో నోటా మూవీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. ఓ వైపు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీలు మరో వైపు నోటా మూవీని...

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో నోటా మూవీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. ఓ వైపు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీలు మరో వైపు నోటా మూవీని అడ్డుకునేందుకు అడుగడుగునా ప్రయత్నాలు చేస్తున్నాయి. అసలు నోటాకు ఎందుకు నో చెబుతున్నారు ? నిజంగానే ఓ పార్టీకి అనుకూలంగానే ఈ చిత్రాన్ని నిర్మించారా ? మూవీ విడుదలయితే శాంతి భద్రతలు తలెత్తే ప్రమాదముందా ? లేక ఈ చిత్రం నిజంగానే ప్రేక్షకులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయా ?

తెలంగాణ రాజకీయాలు నోటా మూవీ చుట్టూ తిరుగుతున్నాయి. యంగ్ హీరో విజయ్ దేవరకొండ, మెహ్రీన్ జంటగా నటించిన ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని కోరుతున్న వివిధ రాజకీయ పార్టీలు రోజుకో వివాదాన్ని తెరపైకి తెస్తున్నాయి. తాజాగా ఓయూ జేఏసీ నేత కైలాస్‌ ఈ మూవీని రిలీజ్‌ను అడ్డుకోవాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సమయంలో నోటా అనే పదాన్ని వాడకుండా చూడాలని తప్పనిసరి అయిన పక్షంలో ఎన్నికల సంఘం అనుమతి తీసుకునేలా ఆదేశించాలంటూ కోర్టును కోరారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కోడ్‌ అమలులో ఉన్నందున ఎన్నికల సంఘం ఈ చిత్రాన్ని పరిశీలించాలంటూ పిటీషన్‌లో పేర్కొన్నారు.

ఇక తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా నోటా విడుదలను అడ్డుకోవాలంటూ ఈసీని ఆశ్రయించారు. రాజకీయపరమైన అంశాలతో చిత్రాన్ని నిర్మించారంటూ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డితో పాటు టీపీసీసీ కోశాధికారి నారాయణరెడ్డి ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఎన్నికల తరుణంలో ఈ సినిమాతో ఓటర్లు ప్రభావితమై పోలింగ్‌కు దూరంగా ఉండే ప్రమాదం ఉందన్నారు.

ఇదే సమయంలో చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్‌రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తెలంగాణలోని ఓ ప్రధాన రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉన్నట్టు కేతిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమా వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశముందని కేతిరెడ్డి అంటున్నారు.

నోటా చుట్టూ వరుస వివాదాలు ముసురుకోవడంతో చిత్ర విడుదల సందిగ్ధంలో పడింది. ఓ రాజకీయ పార్టీకి అనుకూలమంటూ ఒకరు, శాంతి భద్రతలంటూ మరోకరు, ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేస్తుందంటూ ఇంకోకరు ఇలా రోజుకో వివాదం తెరపైకి తెస్తున్నారు. అయితే చిత్ర బృందం మాత్రం సినిమాలో ఎలాంటి అభ్యంతరకర దృశ్యాలు లేవంటున్నారు. ఓ విభిన్నమైన కథాంశంతో చిత్రాన్ని నిర్మించామని కథకు ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. సరికొత్త పొలిటికల్ ఎంటర్‌టైనర్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories