ముంచిన పెథాయి... కోస్తా కోలుకునేదెలా?

ముంచిన పెథాయి... కోస్తా కోలుకునేదెలా?
x
Highlights

పెథాయ్ తుపాను పెను బీభత్సం సృష్టిస్తోంది. ఏడు జిల్లాలు చిగురుటాకుల వణికాయి. పెనుగాలులు భయపెట్టాయి. పంటచేలు నీటి పాలయ్యాయి. విద్యుత్ స్తంభాలు...

పెథాయ్ తుపాను పెను బీభత్సం సృష్టిస్తోంది. ఏడు జిల్లాలు చిగురుటాకుల వణికాయి. పెనుగాలులు భయపెట్టాయి. పంటచేలు నీటి పాలయ్యాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. విమాన, రైలు , బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. పునరావస కేంద్రాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన దగ్గర తీరాన్ని తాకిన పెథాయ్ తీవ్ర తుపాను... కాకినాడ-యానాం మధ్య తీరం దాటింది. దాంతోతీరం వెంబడి గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. తీరం వెంబడి సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఉప్పాడ దగ్గర అలలు పెద్దఎత్తున ఎగిసిపడుతున్నాయి. పెథాయ్ ప్రభావం అధికంగా తూర్పుగోదావరిపై ఉండటంతో... జిల్లా అంతటా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.

తీరం దాటిన పెథాయ్ తీవ్ర తుపాను బీభత్సం సృష్టిస్తోంది. దక్షిణ కోస్తా నుంచి ఉత్తరాంధ్ర వరకూ జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మొత్తం 7 జిల్లాలను అతలాకుతలం చేసింది. ఎక్కడికక్కడ విద్యుత్‌ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరగగా, పెద్దఎత్తున పంట నష్టం జరిగింది. అలాగే పలు జిల్లాల్లో వరి పంట ధ్వంసమైంది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటివరకూ 107 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, ఆరు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తూర్పుగోదావరిలో పెథాయ్‌ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. పెనుగాలుల ధాటికి విద్యుత్‌ స్తంభాలు, కొబ్బరి చెట్లు, అరటి తోటలు నేలకొరిగాయి. తుపాను సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న హోంమంత్రి చినరాజప్ప కూడా... తూర్పుగోదావరి జిల్లాపైనే పెథాయ్‌ ప్రభావం ఎక్కువ ఉందని తెలిపారు.

మరోవైపు సముద్రంలో చిక్కుకున్న ఆరుగురు జాలర్లు ఇంకా ఒడ్డుకు చేరలేదు. ఈనెల 11న బైరవపాలెం-కొత్తపాలెం మధ్య వేటకు వెళ్లిన జాలర్లు... బోటులో ఆయిల్ అయిపోవడంతో సముద్రం మధ్యలో ఇరుక్కుపోయారు. పెథాయ్ తుపాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో ఒడ్డు చేరడం వారికి కష్టంగా మారింది. వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తుపాను కారణంగా పలు రైళ్లు రద్దు కాగా... విమాన రాకపోకలపై కూడా ప్రభావం పడింది. విశాఖకు రావాల్సిన 14 విమానాలను రద్దు చేశారు. ఇక సామర్లకోటలో మెయిల్‌, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌‌లు నిలిపివేశారు. అలాగే విశాఖ వైపు నుంచి బస్సుల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఇక తుపాను కారణంగా పలు జిల్లాల్లో ఇప్పటికే పాఠశాలకు సెలవు ప్రకటించారు.

విశాఖ మన్యంలోని 11 మండలాల్లో గాలులతో కూడిన వర్షాల కురుస్తున్నాయి. చింతపల్లి, జీకేవీధి, అనంతగిరి మండలాల్లో గాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. పలుచోట్ల చెట్లు నేలకొరగడంతో అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. భీమిలి నియోజకవర్గంలో పలు మత్స్యకార గ్రామాలను మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. కలెక్టర్‌తో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. పెథాయ్‌ తుపాను ధాటికి పలుచోట్ల చెట్లు నేలకూలాయి. ఉభయగోదావరితో పాటు విశాఖ జిల్లాలో రోడ్లపై చెట్లు కూలిపోయాయి. విశాఖ జిల్లా నర్సీపట్నంలో రోడ్లపై కూలిన చెట్లను యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్నారు. నర్సీపట్నం ఐదురోడ్ల కూడలి వద్ద చెట్లు కూలడంతో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. అలాగే అనకాపల్లి-తుని మధ్య రోడ్లపై పెద్దఎత్తున చెట్లు నేలకూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెథాయ్‌ తుపాను ప్రభావంతో... రెండ్రోజులుగా ఆకాశం మేఘావృతమై చలిగాలులు వీస్తుండటంతో... తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాలు, గాలుల తాకిడికి పలుచోట్ల సెల్‌టవర్లు పనిచేయడం లేదు. సమాచార వ్యవస్థను వెంటనే పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories