చెదిరిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కల

x
Highlights

కూడుకు కష్టంగా ఉన్నా గూడైనా ఉందనే భరోసాతో బతికారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చి ఆ ఇళ్లన్నీ కూలగొట్టింది. 6 నెలల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు...

కూడుకు కష్టంగా ఉన్నా గూడైనా ఉందనే భరోసాతో బతికారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చి ఆ ఇళ్లన్నీ కూలగొట్టింది. 6 నెలల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానంది. కానీ మూడేళ్లవుతున్నా గూడు లేదు. ఇంకా ఎన్నేళ్లవుతుందో తెలీదు. కిరాయి కట్టుకోలేని ఆ పేదలకు మిగిలినవి కన్నీళ్లే.

వరంగల్ ఎస్.ఆర్ నగర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంకల్పించింది తెలంగాణ ప్రభుత్వం. 6 నెలల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టించి ఇస్తామని నమ్మించింది. కొందరు నమ్మలేదు. ఇళ్లు కూల్చేయడానికి ఒప్పుకోలేదు. అయినా రెవెన్యూ అధికారులు వెంటరాగా, పోలీసుల పహారాలో, ముందస్తు సమాచారం కూడా లేకుండా ఇళ్లను అధికారులు కూల్చేశారు. పేదలను కట్టుబట్టలతో బైటకు నెట్టేశారు. ఇదంతా జరిగి మూడేళ్లవుతోంది. కానీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు లేదు. ప్రభుత్వ వంచన, కష్టాలే మిగిలాయి.

2015 జనవరిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తానని ప్రకటించారు. కాలనీకి 792 ఇళ్లను మంజూరు చేశారు. ఎస్.ఆర్. నగర్ లో మొత్తం 650 ఇళ్లు ఉండగా మరికొందరు పూరి గుడిసెల్లో నివసిస్తుండేవారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల కట్టిస్తామని సీఎం ప్రకటనతో 180 మంది స్వచ్చందంగా తమ ఇళ్లను తొలగించుకున్నారు. మిగతా వాళ్లు డబుల్ బెడ్ రూం ఇళ్లను నిరాకరించారు. స్వచ్చందంగా ముందుకొచ్చిన నిరుపేదల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. 6నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించినా 3ఏళ్లు గడిచినా పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

ఉన్నట్టుండి ఒక్క రోజులో సొంతిల్లు కూల్చేస్తే వచ్చే కష్టాలు అనుభవించేవాళ్లకే తెలుస్తుంది. కిరాయి కట్టడం కష్టమైనా ఆరు నెలలే కదా ఈ కష్టాలు తర్వాత ఎలాగూ సొంతింటికి వెళ్లిపోతామని పంటి బిగువున ఆ కష్టాలన్నీ భరించారు. కానీ ఆరు నెలలు పూర్తయ్యాయి. ఏడాది, రెండేళ్లు, మూడేళ్లవుతున్నా సర్కారు ఇళ్లు కట్టివ్వలేదు. ప్రత్యామ్నాయం చూపకుండా, ప్రణాళిక లేకుండా పేదల ఇళ్లు కూలగొట్టిన ప్రభుత్వం.. తమను నరకంలో విసిరేసిందని వరంగల్ ఎస్.ఆర్. నగర్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లుగా కిరాయిలు కడుతున్న పేదలు ఇక తమవల్ల కాదంటున్నారు.

అధునాతమైన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మూడు నెలల్లో హుటాహుటిన కట్టి ప్రారంభోత్సవం కూడా చేస్తుంది ప్రభుత్వం. కానీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని గుడిసెలు కూల్చేసి, కట్టుబట్టల్తో నడిరోడ్డ మీద పడేసే ప్రభుత్వం.. మూడేళ్లవుతున్నా పట్టించుకోవడం లేదు. నోరు విప్పితే కేసులేస్తారేమోనన్న భయంతో కన్నీళ్లను కళ్లలోనే దాచుకొని బతుకుతున్న వరంగల్ ఎస్. ఆర్ నగరవాసులు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆరు నెలల్లో ఇస్తామని చెప్పి 180 ఇళ్లను కూల్చేసి మూడేళ్లవుతున్నా పూర్తిచేయలేకపోయిన అధికారులు 6 నెలల క్రితం మరో నిర్వాకానికీ పూనుకున్నారు. ఆ 180 ఇళ్ల నిర్మాణానికి అడ్డుగా ఉన్నాయని చెప్పి మే 10న మరో 38 ఇళ్లను కూల్చేశారు. ఈ 38 ఇళ్ల ప్రజలు తమకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లే వద్దని, ఉన్నదాంట్లోనే బతుకుదామని నిర్ణయించుకొని సర్కార్ ప్రతిపాదనకు దూరంగా ఉన్నారు. దీంతో ముందస్తు సమాచారం కూడా లేకుండా అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో వాళ్లను కొట్టి, బైటకు లాగివేసి మరీ 38 ఇళ్లను కూల్చేశారు.

మూడేళ్లుగా సొంత ఇళ్లు లేక, ప్రభుత్వం వారి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రాక, అద్దె ఇంట్లో కిరాయి కట్టలేక ఎస్. ఆర్ నగర్ వాసులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. కొంతమంది వృద్ధులు చెట్ల కింద తలదాచుకుంటున్నారంటే వాళ్ల కష్టాలెలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అద్దె ఇంట్లో ఉంటే అద్దె చెల్లిస్తామన్న ప్రభుత్వం అదికూడా చెల్లించక మరోసారి వంచన చేసింది.

ఈ సమస్యలతో పిల్లల చదువులు సరిగా లేక అనేక కుటుంబాలు దెబ్బతింటున్నాయి. ఇళ్లు లేక పెళ్లిల్లు కూడా కావడం లేదు. అయినా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం అతి నెమ్మదిగా సాగుతోంది. క్యాంప్ కార్యాలయాల నిర్మాణాలను నాలుగైదు నెలల్లో పూర్తి చేసి సకల సౌకర్యాలు అనుభవించే పాలకులకు తమ కష్టాలు కనిపించడం లేదా అని ఎస్ ఆర్ నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ఉన్న ఇంటిని కూల్చేసి మూడేళ్ల అష్టకష్టాలు పెడుతున్న ప్రభుత్వం ఇంకా ఎన్నేళ్లు తమను ఈ నరకంలో ఉండనిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories