పవన్-లెఫ్ట్...కీలక భేటీ

పవన్-లెఫ్ట్...కీలక భేటీ
x
Highlights

ప్రత్యేకహోదాపై పోరాటానికి సిద్ధమవుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు లెఫ్ట్ పార్టీ నేతలతో కీలక సమావేశం జరపనున్నారు. హోదా సాధించడానికి అనుసరించాల్సిన...

ప్రత్యేకహోదాపై పోరాటానికి సిద్ధమవుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు లెఫ్ట్ పార్టీ నేతలతో కీలక సమావేశం జరపనున్నారు. హోదా సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై విజయవాడలోని తన పార్టీ కార్యాలయంలో చర్చించనున్నారు. విభజన హామీలపై వామపక్ష నేతలతో చర్చించిన అనంతరం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇచ్చేందుకు కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తుండగా, రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రయత్నాలు కేంద్రాన్ని దారిలోకి తీసుకురాలేకపోతున్నాయి. దీనిపై బీజేపీ, టీడీపీ, వైసీపీలపై ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆరోపణలు గుప్పించిన పవన్.. ప్రత్యేకహోదా సాధనకు సీపీఐ, సీపీఎంలతో జతకట్టి ఫలితం సాధించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించే లెఫ్ట్ పార్టీ నేతలో కీలక సమావేశాన్ని విజయవాడలో నిర్వహిస్తున్నారు.

పార్టీ సభ్యులతో సమావేశం అనంతరం వామపక్ష ప్రతినిధులతో ఉదయం 11 గంటలకు భేటీ అవుతున్న జనసేన అధినేత.. ప్రత్యేకహోదా సాధనతోపాటు విభజన హామీలపై ఎలా పోరాడాలో ఈ సమావేశం ద్వారా నిర్ణయం తీసుకోనున్నారు. ఏఏ మార్గాల్లో పోరాటం సాగిస్తే ఫలితం సాధించవచ్చోనన్న అంశంపై ప్రధానంగా చర్చిస్తారు.

లెఫ్ట్ పార్టీలతో భేటీ అనంతరం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం పవన్ సమావేశాలు నిర్వహిస్తారు. అనంతపురం, ఒంగోలు, ఉత్తరాంధ్ర సమస్యలపై అక్కడి మేధావులతో దశలువారీగా చర్చించనున్నారు. అలాగే ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు రాసిన.. అమరావతి ఎవరి రాజధాని? పుస్తకావిష్కరణలో పవన్ పాల్గొనడంపై ఉత్కంఠ వీడలేదు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో బీజేపీ నేతలు ఎక్కువమంది ఉండటంతో పవన్.. వారితో కలిసి వేదికను పంచుకుంటారా? లేదా.. ? అనేది సందేహంగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అంశం రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారడంతోపాటు కేంద్రంలోనూ వేడి పుట్టిస్తున్న తరుణంలో జనసేన- లెఫ్ట్ పార్టీల సమావేశంపై ఆసక్తి నెలకొంది. ఈ సమావేశం అనంతరం పవన్ తీసుకునే నిర్ణయం.. కీలకంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories