రేవంత్ రెడ్డి రాక‌..చాప‌కింద నీరులా వ‌ర్గ‌పోరు

Submitted by arun on Mon, 01/08/2018 - 16:18

మహబూబ్‌నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత పోరు మొదలయ్యాయ్. పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం కృష్టి చేస్తుంటే మరోవైపు జిల్లా నేతలు వర్గపోరుతో కొట్టుకుంటున్నారు. ఎన్నికలకు మరో ఏడాదిన్నర మాత్రమే ఉండటంతో కాంగ్రెస్‌లో కుమ్ములాటలు కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నాయ్.

రేవంత్‌‌రెడ్డి రాకతో మహబూబ్‌నగర్‌ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని కార్యకర్తలు సంబరపడుతుంటే టికెట్‌ ఆశించే నేతలు వర్గపోరుకు శ్రీకారం చుట్టారు. పార్టీ ప్రతిష్టకంటే టికెట్‌ కోసమే కొందరు నేతలు పావులు కదుపుతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న నేతలకు పెద్దపీట వేస్తూ వ్యతిరేకంగా ఉన్న నేతలను పట్టించుకోకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. 

దేవరకద్ర నియోజకవర్గంలో పవన్‌కుమార్‌రెడ్డి, ప్రదీప్‌గౌడ్‌లు మధ్య వర్గపోరు తారస్థాయికి చేరింది. వీరిలో పవన్‌కుమార్‌రెడ్డి డికే అరుణ వర్గమయితే ప్రదీప్‌గౌడ్‌ పార్టీ సీనియర్ నేత జైపాల్‌‌రెడ్డి వర్గం. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన పవన్‌కుమార్‌ ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందన్న ధీమాతో పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. అటు జడ్పీటీసీగా ఎన్నికైన ప్రదీప్‌గౌడ్‌ ఎమ్మెల్యే టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. బీసీ సామాజికవర్గం కావడంతో తనకే టికెట్‌ వస్తుందని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. జైపాల్‌రెడ్డి కూడా అండగా ఉండటంతో టికెట్‌పై కొండంత ఆశలు పెట్టుకున్నారు. టికెట్‌ రాకపోయినా పార్టీ కోసం పని చేస్తానని ప్రదీప్ అంటుంటే పవన్‌కుమార్‌రెడ్డి మాత్రం లోలోపల రగిలిపోతున్నారు. 

దేవరకద్ర నియోజకవర్గంలో పవన్‍కుమార్, ప్రదీప్‌ గౌడ్‌ల మద్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇటీవల దేవరకద్రలో జరిగిన ఫ్లెక్సీల గొడవే ఇందుకు కారణంగా మారింది. గత 31 డిసేంబర్ ప్రదీప్‌గౌడ్‌ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు చించేశారు. పవన్ కుమార్ వర్గీయులే ఫ్లెక్సీలను చించేశారన్న భావనతో ప్రదీప్‌ కేసు పెట్టేందుకు యత్నించారు. ఇంతలోనే జిల్లా నేతలు చెప్పడంతో ప్రయత్నాన్ని విరమించుకున్నారు. 

కాంగ్రేస్ పార్టీలో పవన్ కుమార్ రెడ్డి, ప్రదీప్‌గౌడ్‌ల అంతర్గతంగా కొట్టుకుంటుంటే చాపకింద నీరులా ప్రముఖ న్యాయవాది మదుసూదన్‍రెడ్డి నియోజకవర్గంలో ప్రచారం ఊపుమీద కొనసాగిస్తున్నాడు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పవన్‌కుమార్‌, ప్రదీప్‌గౌడ్‌ గొడవలతో మూడో వ్యక్తి లాభ పడేట్లు ఉన్నాడు. చూద్దాం ఏం జరుగుతోంది. 

English Title
Pawan Kumar Reddy Vs Pradee Goud

MORE FROM AUTHOR

RELATED ARTICLES