జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కొత్త పిలుపు

Submitted by arun on Thu, 02/08/2018 - 11:54
Pawan Kalyan

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో, జేఏసీ తరహా వేదికను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధనకు జేఏసీ తరహా వేదిక ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. ఉండవల్లి, జేపీ, చలసాని వంటి మేధావులందరితో చర్చించి, హక్కుల సాధనకు ఇక పోరుబాట పట్టబోతున్నట్టు వెల్లడించారు. మరి ఉండవల్లి, జేపీ పవన్‌తో కలిసి వస్తారా?

కేంద్ర బడ్జెట్‌పై తొలిసారి స్పందించిన పవన్
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టి వారంరోజులైంది. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై ఆగ్రహావేశాలు, ఆందోళనలు, మాటల యుద్ధాలు, పార్లమెంటు స్తంభింజేయడాలు హోరెత్తుతున్నాయి. కానీ ప్రశ్నిస్తాను అంటు పార్టీ పెట్టి, 2014లో బీజేపీ, టీడీపీలకు మద్దతిచ్చిన పవన్‌ మాత్రం, అస్సలు మాట్లాడ్డంలేదన్న విమర్శలు చెలరేగాయి. బహుశా విమర్శలు పెరిగిపోతున్నాయి, ఆలస్యమవుతోందని అనుకున్నారేమో, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, మీడియా ముందుకొచ్చారు. కేంద్ర బడ్జెట్‌పై మీడియా సమావేశంలో మాట్లాడిన పవన్, కాంగ్రెస్‌లా బీజేపీ మోసం చేయబోదనే నమ్మకంతో మద్దతిచ్చానని చెప్పారు. తొలి రెండేళ్లూ ఎంతో సంయమనం పాటించానని, ఇప్పుడు నాలుగేళ్లు గడుస్తున్నా మాటలతో సరిపెట్టడం సరికాదని చెప్పారు.

జేఏసీ తరహా వేదిక ఏర్పాటు చేస్తాం-పవన్
ఈ మీడియా సమావేశంలో, పవన్ చెప్పిన కీలకమైన విషయం, జాయింట్‌ యాక్షన్ కమిటీ తరహాలో ఒక వేదికను ఏర్పాటు చేస్తామని చెప్పడం. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై పోరాడేందుకు తన ఒక్కడి శక్తీ సరిపోవడం లేదున్న పవన్, ఉండవల్లి, జేపీ, చలసాని శ్రీనివాస్ లాంటి మేధావులు, ప్రజాసంఘాలతో కలిసి జేఏసీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని పార్టీలూ కలిసి పని చేసినట్టు, ఏపీలో కూడా అన్ని పార్టీలూ ఏకతాటిపైకి వచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు పవన్.

ఉండవల్లి, జేపీ జనసేనాని జేఏసీలోకి వస్తారా?
హోదా కోసం, విభజన చట్టం అమలు కోసం, కలిసి పోరాడేందుకు జేఏసీని ఏర్పాటు చేస్తామని పవన్ చెప్పడం మంచిదే. తెలంగాణ సాధన తరహాలో దీన్ని ఒక సెంటిమెంట్‌ ఉద్యమంగా మలచాలనుకోవడమూ ఆహ్వానించదగ్గదే. కానీ ఇప్పటికే అనేక వేదికల మీద విభజన హామీలపై మాట్లాడిన ఉండవల్లి, జేపీ జనసేనాని జేఏసీలోకి వస్తారా ఎవరికివారే ఉద్దండులైన వీళ్లిద్దరూ పవన్ సారథ్యంలో కలిసి నడుస్తారా తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌‌తో పాటు ప్రజాసంఘాలన్నీ జేఏసీతో కలిసి వచ్చాయి మరి ఎప్పుడు జనంలోకి వస్తాడో తెలియని పవన్, వీరందర్నీ కూడగట్టగలడా అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలు జేఏసీ గొడుగు కిందకు వస్తాయా వీరి బలం లేకుండా జనసేనాని జేఏసీని నడపగలడా.

పార్టీనే నిర్మాణం కాలేదు, జేఏసీ నిర్మాణమవుతుందా?
నిజానికి సీమాంధ్ర హక్కుల సాధన కోసం, ఆల్రెడీ చలసాని శ్రీనివాస్, హీరో శివాజీ, వామపక్షాలు, ప్రజాసంఘాలతో ఒక వేదిక ఉంది. ఆడపాదడపా ఆందోళనలూ చేస్తున్నారు. మరి పవన్‌ ఈ జేఏసీలోకి వెళ్లి, ముందుకు నడిపించొచ్చు కదా అన్న సలహాలూ వస్తున్నాయి. అంతేకాదు, పార్టీ నిర్మాణమే కాని జనసేన, ఇక జేఏసీని ఎలా నిర్మిస్తోందో, ఎలా సమన్వయం చేస్తుందో, ఎన్నికల వరకే వేదిక పోరాటమా తర్వాతా హక్కుల కోసం పోరాడుతుందో, సైడైపోతుందో తెలీదు. కానీ ప్రత్యక హోదా, విభజన హక్కుల కోసం జేఏసీ లాంటి వేదిక ఏర్పాటు చేయడం మాత్రం మంచి విషయమంటున్నారు విశ్లేషకులు. కానీ అన్ని రాజకీయ పార్టీలు, మేధావులను ఒకే గొడుగు కిందకు తేవడమే అసలైన సవాల్.

English Title
Pawan Kalyan 'Disappointed' With Modi Govt Over Andhra Special Status

MORE FROM AUTHOR

RELATED ARTICLES