జనసేనాని అంటే మీటింగులు.. ప్రెస్‌మీట్లేనా.?

Submitted by arun on Tue, 03/06/2018 - 11:40

పార్టీలో ప్యూరిటీ ఉంది.. కానీ పర్సన్‌లో క్లారిటీ లేదు. ప్రశ్నలున్నాయి.. కానీ సమాధానాల్లేవ్.. ఆశయాలున్నాయ్.. ఆచరణ లేదు. ఏదో చేయాలన్న తపన ఉంది.. కానీ.. ఎలా ముందుకెళ్లాలన్న కార్యాచరణ లేదు.. మీటింగులున్నాయి.. ప్రెస్ మీట్లున్నాయి.. కానీ.. అసలు విషయమేంటో ఎవరికీ అర్థం కావటం లేదు. ఇంతకీ.. ఆయన చర్యలు ఎందుకు ఊహతీతంగా మారాయి.?

నాలుగేళ్లు.. జనసేన ఆవిర్భవించి అక్షరాలా నాలుగేళ్లు. ప్రశ్నించడానికే పాలిటిక్స్‌లోకి వచ్చిన జనసేనాని.. తొలిరోజు నుంచి కన్ఫ్యూజన్‌లోనే ఉన్నారన్న వాదనలున్నాయి. ఇష్యూ ఏదైనా సరే.. పవన్‌లో అస్పష్టతే కనిపిస్తోందని చెప్తున్నారు. మరి నిజంగానే పవన్‌ చుట్టూ గందరగోళం కమ్ముకుందా.? క్లారిటీ లేకే ఆయన కంటెంట్ బయటకు తీయడం లేదా.? వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ జనసేన... 

ప్రశ్నించడం కోసమే పుట్టిన పార్టీ.. జనసేన. ఎప్పుడూ కాకపోయినా.. అప్పుడప్పుడూ పవన్ కల్యాణ్ బయటికొచ్చి తనవంతుగా ప్రశ్నిస్తున్నారు. కొన్నిసార్లు ఆయన ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతున్నాయి. కానీ.. అన్నిసార్లు పవన్ ప్రశ్నలకు.. ఆన్సర్స్ దొరకడం లేదు.

పార్టీ పెట్టినప్పటి నుంచి.. జెండా ఎగిరినప్పటి నుంచి.. అజెండా చెప్పినప్పటి నుంచి.. పవన్‌లో అస్పష్టతే కనిపిస్తోంది. అవును.. జోరు పెంచాల్సిన చోట మెతక వైఖరి, సమయానుకూల నిర్ణయాల్లో ఆలస్యం.. నాలుగేళ్ల పొలిటికల్ కెరియర్‌లో.. అంతా కన్ఫ్యూజనే. క్లారిటీ లేని నిర్ణయాలే. మరికొద్ది రోజుల్లో.. పార్టీ ఆవిర్భావ సభ జరగనుండటంతో.. ఏ అంశాన్ని అజెండాగా తీసుకోవాలన్న దానిపై పవన్‌కు ఇంకా క్లారిటీ లేదు. ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టిన జనసేనాని.. తొలిరోజు మినహాయిస్తే.. ఇప్పటివరకు ఆయన గొంతు తడబడుతూనే ఉందన్న వాదనలున్నాయి.

పవన్ ఉద్దేశ్యాలు, ఆశయాలు మంచివే అయినప్పటికీ.. ఆయనలో క్లారిటీ లేకపోవడం పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రతి విషయంలో మెతక వైఖరి, కర్ర విరగకూడదు పాము చావకూడదనే పవన్ వ్యవహార శైలితో.. విమర్శలకు కారణమవుతోంది.

ప్రత్యేక హోదా కోస ఏపీ అంతా ఒక్కటై నినదిస్తుంటే.. నిలదీస్తుంటే.. పవన్ మాత్రం వెయిట్ చేద్దాం.. అంటున్నాడు. అన్నీ తేల్చుకోవాల్సిన టైమొచ్చినా.. అప్పుడే వద్దంటున్నారు. JFC పేరుతో కొన్నాళ్లు హడావిడి చేశారు. తర్వాత రిపోర్ట్ వచ్చింది. దానివల్ల ఏం ఒరిగింది.? ఏపీకి ఏం ఒరిగింది.? అసలు పవన్ వ్యూహమేంటి.?

జనసేనకు.. ఎమ్మెల్యేలు లేరు. ఎంపీల్లేరు. ఐనా.. మా లీడర్ పవన్ కల్యాణ్ ఉన్నాడు చాలనుకున్నారు కార్యకర్తలు. ఏపీ పాలిటిక్స్‌లో.. పవన్ కల్యాణ్‌కు అదోరకమైన క్రేజ్ ఉంది. ఆయన ఒక్క మాట చెప్తే రాష్ట్రమంతా ఒక్కటై కదిలి వస్తుంది. కానీ.. ఆయన చెప్పరు. పవర్ స్టార్.. ఎప్పుడెప్పుడు తన పవర్ చూపిస్తారోనని కార్యకర్తలు, అభిమానులు వెయిట్ చేస్తున్నారు. కానీ.. అది జరగటం లేదు. అవన్నీ జరగాలంటే.. ముందు జనసేనానికి ఓ క్లారిటీ రావాలి. ఏం చేయాలి.. ఎలా చేయాలన్న దానికి ఆలోచన కావాలి.. దానిని ఆచరణలో పెట్టాలి.

ఏపీలో ఇప్పుడు హోదా అంశం రగులుతోంది. జనసేన తీసుకొచ్చిన JFC కూడా కేంద్రం, రాష్ట్రం కలిసి ఏపీని నిండా ముంచాయని తేల్చింది. పేజీలకొద్దీ రిపోర్ట్ ఇచ్చింది. కానీ.. జేఎఫ్‌సీ రిపోర్ట్‌తో ఏపీలో ఏం జరిగిందంటే.. ఎవరి దగ్గరా ఆన్సర్ లేదు. అసలు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఫ్యాక్ట్స్ రిపోర్ట్‌ను.. జనసేనాని ఎవరికి ఇచ్చారు.? ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు.. అటు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు.. మరి ఆ రిపోర్ట్‌తో ఏంటి లాభం.. రిపోర్ట్ మంచిదే.. అందులో ఉన్న కంటెంట్ మంచిదే. కానీ.. దానితో ఏం చేయాలో క్లారిటీ లేనప్పుడు.. ఏం లాభం.? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హోదా విషయంలో.. పవన్ ఉద్యమాన్ని లీడ్ చేస్తే.. ఆయన వెంట కలిసి నడుస్తామనే వాళ్లు ఏపీలో చాలా మందే ఉన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని చాలా మంది స్పష్టం చేశారు. స్టేట్ కోసం.. స్టేటస్ ఫైట్ మొదలుపెట్టండి.. మేం వస్తాం మీ వెంట అంటూ.. అన్ని వర్గాల నుంచి ప్రెజర్ పెరుగుతోంది. ఐనా.. పవన్‌ ఆ దిశగా అడుగులు వేయడం లేదు. ఇప్పుడే ఎందుకు.. ఇంకొన్నాళ్లు ఆగుదాం అంటారు. 

పవన్‌లో ఉన్న పవర్.. జనాల్లో ఉన్న ఫైర్ కలిసి అంతా రోడ్ల మీదికొస్తే.. కేంద్రం ఎందుకు దిగిరాదు.. హోదా ఎందుకు రాదు.. అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పవన్ ముందు నిల్చుంటే.. మిగతాది మేం చూసుకుంటాం అంటున్నారు చాలామంది నేతలు. ఐనా.. పవన్ సైలెంటుగానే ఉంటున్నారు.

ఓవరాల్‌గా పవన్ JFC ఎపిసోడ్‌ మొత్తాన్ని.. ఒక్క ప్రెస్‌మీట్‌లో తేల్చేశారు అంతే. ప్రకటనలకు మాత్రమే పవన్ పరిమితమవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీలో, పార్లమెంటులో మా పార్టీ సభ్యులెవరూ లేరు.. నేనెలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురాగలుగుతానన్న పవన్ కౌంటర్‌పై.. రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. జనసేనానికి ఉన్న క్రేజ్ చాలంటున్నారు. కల్యాణ్ ముందుంటే.. చాలా ముంది ముందుకు కదులుతారని చెప్తున్నారు. కానీ.. పవన్ ఎందుకు ధైర్యంగా అడుగు ముందుకు వేయలేకపోతున్నారో అర్థం కావడం లేదు. 

హోదా కోసం పోరాటం చేయాలని.. అన్ని వర్గాల నుంచి పవన్‌పై ఒత్తిడి పెరుగుతున్న టైంలో.. ఆయన మెతక వైఖరితో అటు అభిమానులు, ఇటు పార్టీ వర్గాలు కూడా అధినేత ఏం చేస్తారు.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. ప్రజాక్షేత్రంలోకి అడుగుపెడతారా.. లేరా.. అని కన్ఫ్యూజన్‌లో కూరుకుపోతున్నారు. ప్రశ్నించేపార్టీపైనే.. ఇప్పుడు వందల ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
 

English Title
Is Pawan Kalyan In Confusion?

MORE FROM AUTHOR

RELATED ARTICLES