అపరిచితుడు కాదు... అజ్ఞాతవాసి కాదు.. పవన్‌ ఇప్పుడో పొలిటికల్‌ బుల్లెట్‌

అపరిచితుడు కాదు... అజ్ఞాతవాసి కాదు.. పవన్‌ ఇప్పుడో పొలిటికల్‌ బుల్లెట్‌
x
Highlights

పవన్ కల్యాణ్ ఇప్పుడు అజ్ఞాతవాసి కాదు. పూర్తిగా ప్రజల్లోకి వచ్చేశారు. మొదటి నుంచి కూడా వామపక్ష భావజాలాన్ని ఒంటపట్టించుకున్న పవన్ తనదైన రీతిలో ప్రజల...

పవన్ కల్యాణ్ ఇప్పుడు అజ్ఞాతవాసి కాదు. పూర్తిగా ప్రజల్లోకి వచ్చేశారు. మొదటి నుంచి కూడా వామపక్ష భావజాలాన్ని ఒంటపట్టించుకున్న పవన్ తనదైన రీతిలో ప్రజల సంక్షేమానికి భాష్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశ్నించడంతో మొదలైన పవన్ రాజకీయం అధికారం చేజిక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రశ్నించడంతో మాత్రమే ప్రజల సమస్యలు పరిష్కారం కావని పవన్ గ్రహించారు. ఉద్దానం విషయంలో జరిగింది

గతంలోనే పవన్ కల్యాణ్ ఉద్దానం విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సమస్య మరింతగా వెలుగులోకి వచ్చిన ఫలితం లేకుండా పోయింది. అందుకే ఇక పవన్ కల్యాణ్ నేరుగా రంగంలోకి దిగారు. ప్రజాక్షేత్రంలో ప్రజల సమక్షంలో నేరుగా సమస్యల పరిష్కారానికి నడుం బిగించారు. ఒక విధంగా చెప్పాలంటే నేడు పవన్ చుట్టూరా వ్యతిరేక పరిస్థితులే ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పవన్ లాంటి వారు అంతర్ముఖులవుతారు. తమలో తామే మధనపడుతారు. ఒక పరిష్కారంతో ప్రజల ముందుకు వస్తారు. తమ చేతలతో ప్రత్యర్థుల నోళ్ళు మూయిస్తారు. ఇప్పుడు పవన్ చేస్తున్నది సరిగ్గా ఇదే. అధికార పక్షాలను నేరుగా ఢీకొనలేకపోయిన సందర్భాల్లో పరిస్థితులకు అనుగుణంగా పవన్ కొంత వెనుకడుగు వేశారు. అది కూడా వ్యూహాత్మకమే. బలం పుంజుకున్న తీసుకున్న వ్యవధి మాత్రమే. ఒక బంతిని ఎంత గట్టిగా నేలకు కొడితే అంతగా పైకి అది ఎగురుతుంది. తనపై వస్తున్న విమర్శలకు పవన్ ఇలానే జవాబు చెబుతున్నారు.

భావోద్వేగాలు అధికంగా ఉన్న వపన్ లో మానవత్వం కూడా ప్రగాఢంగానే ఉంది. అందుకే ఆయన శ్రీకాకుళంలో ఉద్దానం సమస్యను ఎంచుకున్నారు. సమస్య అధ్యయనం కోసం విదేశాల నుంచి నిపుణులను సొంత ఖర్చుతో రప్పించారు. కుటుంబంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుడు ఉన్న వారికే ఆ సమస్యలు ఎంత భయంకరమైనవో అర్థమవుతుంది. శారీరకం, మానసికం, ఆర్థికపరం...ఇలా ఎన్నో రకాలుగా ఆ సమస్యలు వేధిస్తుంటాయి. వ్యాధిగ్రస్తుల సమస్యలు ఒకరకమైతే... అలాంటి వారు కుటుంబాల సమస్యలు మరో రకం... మొత్తం మీద చూస్తే వేలల్లో బాధితులు ఉంటే పరోక్షంగా లక్షల మంది కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈ భారం ఆయా కుటుంబాల మీదనే కాదు....ప్రత్యక్షంగా, పరోక్షంగా సమాజం మీద కూడా పడుతోంది. ప్రజల ఆర్థిక ఉత్పాదక శక్తి తగ్గితే, సమాజానికి కూడా చేటు. అలా జరగకూడదనుకుంటూ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందే. తన కార్యాచరణ ఫలితాలు ఇచ్చేదిగా ఉండాలని పవన్ కోరుకున్నాడు. అందుకే ఆయన నిరాహార దీక్ష మార్గాన్ని ఎంచుకున్నాడు. అన్నా హజారే, కేజ్రీవాల్... లాంటి వారంతా ఇదే బాటన పయనించిన వాళ్లే. అన్నిట్లో కాకపోయినా కొన్ని అంశాల్లోనైనా వారు విజయం సాధించారు. మరి పవన్ కల్యాణ్ తన దీక్షతో ప్రభుత్వం లో చలనం తీసుకురాగలుగుతారా ?

ఒక ప్రజా సమస్య పరిష్కారం కోసం పవన్ ఎంచుకున్న మార్గం ఒక రోజు నిరాహార దీక్ష...మరి దాంతోనే సమస్య పరిష్కారమవుతుందా ? సమస్య పరిష్కారం కాకుంటే పవన్ ఏం చేస్తారు ? ఇలా దీక్షలు చేస్తూ పోతే ఎన్ని అంశాలపై ఎక్కడెక్కడ ఎన్ని రోజులు అలా దీక్షలు చేస్తూ వెళ్తారు ? వైఎస్ పాదయాత్ర తరహాలో ఏపీ అంతటా దీక్షా యాత్ర చేస్తారా ? లేదంటే ఇతర పోరాట రూపాలను ఎంచుకుంటారా ? ఇప్పుడిప్పుడే సంస్థాగతంగా బలోపేతం అవుతున్న జన సేన ఒక నిర్దిష్ట రూపం సంతరించుకుంటే తప్ప ఈ ప్రశ్నలకు సమాధానం లభించడం కష్టం. అయితే ఒక్కటి మాత్రం నిజం....పవన్ లో ప్రశ్నించే తత్వం ఉంది. అందులో నిజాయితీ ఉంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే మాత్రమే బయటకు వచ్చే లక్షణం మాత్రం ఆ నిజాయితీని ప్రశ్నించేలా చేస్తుంది. వేదికపై కుదురుగా ఉండని చంచల తత్వం ఆయనది. సమస్యలను ఎంచుకోవడంలో, వాటిపై పోరాటం చేయడంలో కూడా అలాంటి చంచలత్వాన్ని ప్రదర్శించకుండా పట్టు విడవని విక్రమార్కుడిలా పోరాడితేనే జనసేనాని రాజకీయాల్లో రాణించే అవకాశం ఉంటుంది. రాజు అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే కింగ్ మేకర్ పాత్రకే పరిమితం కావాల్సి ఉంటుంది. తానేం కాదల్చుకున్నారో ఇక తేల్చుకోవాల్సింది ఆయనే.

Show Full Article
Print Article
Next Story
More Stories