వదంతులు ప్రాణాలు తీస్తున్నాయి? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది!!

వదంతులు ప్రాణాలు తీస్తున్నాయి? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది!!
x
Highlights

చినిగిన బట్టలు వేసుకున్న వ్యక్తి కనిపిస్తే చాలు...చితక్కొట్టేస్తున్నారు. కాస్త తేడాగా ఉండి, హిందీ మాట్లాడితే చాలు...మక్కలిగ్గొట్టేస్తున్నారు. కాస్త...

చినిగిన బట్టలు వేసుకున్న వ్యక్తి కనిపిస్తే చాలు...చితక్కొట్టేస్తున్నారు. కాస్త తేడాగా ఉండి, హిందీ మాట్లాడితే చాలు...మక్కలిగ్గొట్టేస్తున్నారు. కాస్త కొత్త వ్యక్తిలా కనపడితే చాలు చెట్టుకు కట్టేస్తున్నారు. తిక్కతిక్కగా మాట్లాడటం, పిచ్చిపిచ్చిలా చూడ్డం చేసే మనుషులను, సాటి మనుషులే చావగొట్టేస్తున్నారు. ఇదెక్కడో ఆఫ్రికా అడవుల్లోనో, ఆటవిక రాజ్యంలోనూ జరగడం లేదు. మన తెలుగు రాష్ట్రాల్లోనూ. వాట్సాప్‌లు వస్తున్న కొన్ని మెసేజ్‌లతో, భయభ్రాంతులకు గురవుతున్న జనం, అవి నిజమో కాదో విచారించకుండానే, అనుమానితులను చావబాదేస్తున్నారు.

పేద, ధనిక తేడా లేదు. స్టూడెంట్, ఎంప్లాయీ అన్న తారతమ్యం లేదు. ఇప్పుడు అందరి చేతుల్లోనూ స్మార్ట్‌‌ఫోన్లున్నాయి. అందులో జియో డేటానో, మరో డేటానో దండిగా ఉంది. ఇంటర్నెట్‌ను, అందులోని, వాట్సాప్, ఫేస్‌బుక్‌ను సరిగా వినియోగించుకుంటే మంచిదే, కానీ కొందరు జనం తమ వాట్సాప్‌లో వచ్చిపడే, ప్రతి మెసేజ్‌‌నూ చూసి భయపడిపోతున్నారు. వెనకాముందు ఆలోచించకుండా, ఆ భయాన్ని షేరింగ్, ఫార్వర్డ్‌ రూపంలో తమకు తెలిసినవారికి పంచుతున్నారు. పిల్లలను చంపే పార్థి గ్యాంగ్ తిరుగుతోంది....కిడ్నీలు, మెదడును తినేస్తారంటా అంటూ వచ్చే కొన్ని మెసేజ్‌లను వణికిపోతున్నారు. దాని ఫలితం, అమాయకులను కూడా దొంగలుగా భావించి చంపుతున్నారు జనం.

మొన్న చెడ్డీ గ్యాంగ్, గడ్డం గ్యాంగ్, నిన్న దండుపాళ్యం, స్నేక్ గ్యాంగ్. నేడు పార్థి గ్యాంగ్. వీటిలో కొన్ని గ్యాంగ్‌లను పోలీసులు కటకటాల వెనక్కినెట్టారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న పిల్లల కిడ్నాప్‌, నరమాంస భక్షకుల గ్యాంగ్‌లు మాత్రం, ఇప్పటి వరకూ తారసపడలేదు. అలాంటి కేసులు దేశవ్యాప్తంగా ఒక్కటీ నమోదుకాలేదు. కానీ కొందరు ఆకతాయిలు, రకరకాల వీడియోలు షూట్ చేసి, వాట్సాప్‌లోకి వదులుతున్నారు. సాధారణంగా, పిల్లలకు సంబంధించిన విషయాలపై జనం భయపడతారు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఘటనలు చూస్తుంటే, జనం కూడా విచక్షణ మరిచిపోతున్నారని అనిపిస్తోంది. తమకు తెలియనివారు తారసపడినా, చిరిగిన బట్టలు, మాసిన గడ్డం, తిక్కతిక్కగా మాట్లాడినా, హిందిలో సంభాషించినా, వెంటనే కిడ్నాప్‌ గ్యాంగ్‌ అని సొంతంగా డిసైడ్‌ అవుతున్నారు. ముందూ, వెనకా ఆలోచించడం లేదు. అందుకు నిదర్శనం, నల్గొండ, నిజామాబాద్ ఘటనలే. పక్క ఊరివాళ్లనే చితక్కొట్టి చంపేశారు.

దేశవ్యాప్తంగా బీహార్, యూపీ, రాజస్థాన్‌ల నుంచి పేదజనం, ఉపాధి కోసం నగరాలకు వస్తుంటారు. కానీ వీరిని దొంగలుగా, కిడ్నాప్‌ ముఠాగా జనం అనుమానపడుతున్నారు. ఒకవేళ నిజంగా అనుమానముంటే, పోలీసులకు ఫిర్యాదు చేయాలి కానీ, కొట్టి చంపకూడదు. గ్యాంగ్‌ ముఠానేమో కానీ, మొదట కొట్టినవారు కటకటాలపాలవుతారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తమకు వచ్చిన మెసేజ్‌లు, నిజమా కాదా అని నిర్ధారించుకున్న తర్వాతే, ఇతరులకు ఫార్వర్డ్ చేయాలి కానీ, చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంది కదా అని, ఇలాంటి వదంతులు షేర్ చేయకూడదన్న పోలీసుల హెచ్చరికలను జనం గుర్తుంచుకోవాలి. .

సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మొద్దని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ పోలీసులు జనాలకు విజ్తప్తి చేస్తున్నారు. కొద్ది రోజుల నుంచి వాట్సాప్, ఫేస్‌బుక్‌లో వైరల్‌ అవుతున్న కిడ్నాప్‌ గ్యాంగులు, దోపిడీ గ్యాంగుల ప్రచారంపై ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ మాలకొండయ్య స్పందించారు. అలాంటి గ్యాంగులు రాష్ట్రంలోకి రాలేదని, ఆ వదంతులు నమ్మొద్దన్నారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కూడా, దీనిపై స్పందించారు. రాష్ట్రంలో ఎలాంటి అంతర్రాష్ట్ర కిడ్నాపింగ్, దోపిడీ దొంగల ముఠాల సంచారం లేదని స్పష్టం చేశారు. వీటికి సంబంధించి సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం వదంతి మాత్రమే అన్నారు.

ఈ మెసేజ్ లు అటు పోలీసులను కంగారు పెట్టిస్తున్నాయి. వీటిని కట్టడి చేయడం కోసం పోలీసులు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అసలు దొంగల ముఠాల సంచారం గురించి ఇప్పటివరకు తమ దృష్టికి ఏ చిన్న ఫిర్యాదు రాలేదని, తమ పెట్రోలింగ్ వాహనాలు నిత్యం గస్తీకాస్తుంటాయని, జనం ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని, రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా కొందరు పోకిరీలు చేస్తున్న ఈ ప్రచారాన్ని కట్టడి చేయటానికి సైబర్ క్రైమ్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇలాంటి మెసేజ్ లను పంపుతున్న వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories