ఖాళీగా ఉండేకంటే పకోడా అమ్మడం మంచిదే

ఖాళీగా ఉండేకంటే పకోడా అమ్మడం మంచిదే
x
Highlights

పకోడీలు అమ్ముకుంటే తప్పేంటని, అందులో సిగ్గుచేటైన వ్యవహారం ఏముందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రశ్నించారు. రోడ్డుపై ఎవరైనా పకోడీలు అమ్ముకుని...

పకోడీలు అమ్ముకుంటే తప్పేంటని, అందులో సిగ్గుచేటైన వ్యవహారం ఏముందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రశ్నించారు. రోడ్డుపై ఎవరైనా పకోడీలు అమ్ముకుని రూ.200 సంపాదిస్తే, దానినే ఉద్యోగంగా భావించాలంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం రేగడం, కాంగ్రెస్ సైతం విమర్శలు గుప్పించడంపై అమిత్‌షా రాజ్యసభలో స్పందించారు. పెద్దలసభలో శనివారంనాడు అమిత్‌షా తొలి ప్రసంగం చేస్తూ, కాంగ్రెస్ పకోడా రాజకీయాలు చేస్తోందన్నారు. ఉద్యోగం చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, అది సిగ్గుచేటు కాదని అన్నారు. 'పకోడీలు అమ్ముకునే వాళ్లు అడుక్కోవడం లేదు కదా?' అని ప్రశ్నించారు. నిరుద్యోగిగా ఉండటం కంటే కష్టపడటం తప్పుకాదని అన్నారు. అది ఎంతమాత్రం సిగ్గుచేటైన వ్యవహారం కాదని అన్నారు. 'ఒక పేదవాడు ఇవాళ పకోడీలు అమ్ముకుంటే ఆయన తర్వాత తరాలు పారిశ్రామికవేత్తలయ్యే అవకాశం ఉంటుంది. ఒక ఛాయ్‌వాలా కొడుకు ప్రధాని అయినప్పుడు ఏదైనా సాధ్యమే' అని అమిత్‌షా అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసించడంతో పాటు కాంగ్రెస్‌ వైఫల్యాలను విమర్శించారు. తాము అధికారంలోకి రాకముందు దేశ పరిస్థితి ఎలా ఉందో గుర్తుంచుకోవాలని, అప్పుడు విధాన వైఫల్యం చాలా ఎక్కువగా ఉండేదని పేర్కొన్నారు. గత మూడున్నరేళ్లలో ఆ పరిస్థితిని చాలా వరకు మార్చేశామని అన్నారు. ఈ మూడున్నరేళ్ల ఎన్డీఏ పాలనలో చరిత్రలో నిలిచిపోయే పనులు చేశామని చెప్పుకొచ్చారు. మహాత్మా గాంధీ, దీన్‌దయాళ్‌ కలల్ని సాకారం చేసే దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. జన్‌ధన్‌ యోజన తమ గొప్ప విజయమని, 31కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిపించామని అన్నారు. స్వచ్ఛభారత్‌, సర్జికల్‌ స్ట్రైక్స్‌, ట్రిపుల్‌ తలాక్‌, ఒకే ర్యాంకు ఒకే పింఛను, ఈ ఏడాది బడ్జెట్లో పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్య సంరక్షణ పథకం తదితర అంశాల గురించి ప్రస్తావించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories