కమలం.. కాషాయం.. రాజకీయం.. పరిపూర్ణం?

Submitted by santosh on Wed, 10/10/2018 - 12:38
paripurnanda swamy, bjp

ఆధ్యాత్మిక సభలు, ప్రవచనాలతో తెలుగు రాష్ట్రాల్లో బిజిబిజీగా ఉండే స్వామి పరిపూర్ణానంద, వరుసగా బీజేపీ నేతలతో కలిసి ఢిల్లీ ఫ్లైటెక్కుతున్నారు. కాషాయ పార్టీ అధినేతలతో సమావేశమవుతున్నారు. తాజాగా మరోసారి దేశ రాజధాని వెళ్లిన స్వామి పరిపూర్ణానంద, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాతో దాదాపు 45 నిమిషాలు సమావేశమయ్యారు. కానీ భేటిలో ఏం చర్చించారు, మిమ్మల్ని ఎలా ప్రయోగించబోతున్నారో చెప్పాలని మీడియా ప్రశ్నిస్తే, నర్మగర్భంగా సమాధానమిచ్చారు పరిపూర్ణానంద. బీజేపీ పెద్దలు ఎలా చెబితే, అలానే చేస్తానని పరిపూర్ణానంద చెబుతున్నారు. మరి అమిత్‌ షా, ఫైర్‌ బ్రాండ్‌ స్వామిజీని ఎలా ప్రయోగించబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. ఒకవైపు ఆధ్యాత్మిక ప్రవచనాలు, మరోవైపు హిందుత్వ అజెండాను భుజనా వేసుకున్న స్వామి పరిపూర్ణానంద, ఎన్నోసార్లు పొలిటికల్‌ హీట్‌ పుట్టించే మాటల మంటలు రగిలించారు. అలాంటి ఫైర్‌ బ్రాండ్‌ పరిపూర్ణానంద స్వామిని, పార్టీలో తీసుకురావడానికి బీజేపీ శతవిధాలా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన రాజకీయ రంగ ప్రవేశంతో పార్టీ మరింత బలం పుంజుకుంటుందని అధిష్టానం లెక్కలువేస్తోంది. త్రిముఖ పోటీ కారణంగా, హిందూ ఓట్ల సమీకరణకు స్వామిజీనే అస్త్రంగా బీజేపీ గట్టిగా భావిస్తోంది.

అయితే పరిపూర్ణానందను, బీజేపీ ఎలా ఉపయోగించుకుంటుంది అన్నదానిపై చాలా వాదనలు వినిపిస్తున్నాయి. మాములుగా హిందుత్వ ఎజెండా కాకుండా, అదే భుజానికెత్తుకున్న వారిని ఫేస్‌గా చేసి వెళ్తే బాగుంటుందని పార్టీ నేతల చర్చ. అందుకే ఈ ఎన్నికలో  సీఎం అభ్యర్థిగా, స్వామిజీని  ప్రకటించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అమిత్‌ షా, ఇప్పటికే రాష్ట్ర పార్టీ అభిప్రాయం  తీసుకున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. యూపీ తరహాలో మరో యోగిలా, పరిపూర్ణానందను ప్రయోగించాలని భావిస్తోంది. లేదా కేవలం ప్రచారానికి పరిమితం చేసి, హిందూత్వ ఓట్ల సమీకరణకు ఉపయోగపడేలా ఆలోచిస్తోంది. రాష్ట్రంలో పార్టీ నాయకులతో మాట్లాడి, పరిపూర్ణానందపై ఒక కీలక నిర్ణయం ప్రకటించబోతున్నారు అమిత్‌ షా. స్వామిపరిపూర్ణానందను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే, పార్టీకి మొదటికే మోసమన్న అభిప్రాయం పార్టీలోనే సాగుతోంది. స్వామి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి కావడంతో, సహజంగానే తెలంగాణలో ఆ ముద్ర, నష్టం తెస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దానికి తోడు స్వామిజీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే, మతతత్వ అజెండాగా ప్రత్యర్థి పార్టీలు జనంలో ప్రచారం చేస్తాయన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. పార్టీలో పాతుకుపోయిన సీనియర్లను కాదని స్వామిజీని నెత్తినపెట్టుకుంటే, విభేదాలు భగ్గుమంటాయన్న వాదనా వినిపిస్తోంది.

English Title
paripurnanda swamy, bjp

MORE FROM AUTHOR

RELATED ARTICLES