పద్మావతి సినిమా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!

Highlights

పద్మావతి. ప్రఖ్యాత దర్శకుడు సంజయ్‌ లీలా దర్శకత్వం. మేటి నటి దీపికా పదుకోణ్‌ టైటిల్ రోల్. యువ హీరోలు షాహీద్ కపూర్, రణ్‌వీర్ సింగ్‌ కథానాయకులు....

పద్మావతి. ప్రఖ్యాత దర్శకుడు సంజయ్‌ లీలా దర్శకత్వం. మేటి నటి దీపికా పదుకోణ్‌ టైటిల్ రోల్. యువ హీరోలు షాహీద్ కపూర్, రణ్‌వీర్ సింగ్‌ కథానాయకులు. డిసెంబర్‌ ఒకటిన విడుదల కావాల్సిన పద్మావతి, ఇప్పటివరకూ సెన్సార్‌ బోర్డు నుంచి బయటికి రానేలేదు. వివాదాల సుడిగుండంలో ఇంకా విలవిల్లాడుతోంది.

పద్మావతి మూవీపై చిత్తోడ్‌గఢ్‌ ఎంపీ పార్లమెంట్ ప్యానెల్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై రిపోర్ట్‌ అడిగిన ప్యానెల్, తాజాగా విచారణ చేపట్టింది. చిత్రంపై వివాదాలు నిగ్గుతేల్చేందుకు కేంద్ర సమచార సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో పార్లమెంటు ప్యానెల్‌ సమావేశమైంది. దీంట్లో సెన్సార్‌ బోర్డు సభ్యులు కూడా ఉన్నారు. దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ, ఈ మీటింగ్‌కు హాజరయ్యారు. జాయ్‌ సీ రాసిన ఒక కాల్పనిక కవిత ఆధారంగానే చిత్రాన్ని రూపొందించానని, చరిత్ర ఆధారంగా తీయలేదని స్పష్టం చేశారు భన్సాలీ. అయితే ప్యానెల్‌లో బీజేపీ, శివసేన సభ్యులు మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్‌పుత్‌ల చరిత్రను కించపరిచేలా ఉన్న ఈ సినిమాను నిషేధించాల్సిందేనని డిమాండ్ చేశారు.

మొత్తానికి రెండున్నర గంటల పాటు పార్లమెంటు భవనంలో జరిగిన చర్చలో పద్మావతి వివాదం తేలలేదు. దీంతో సినిమా రిలీజ్‌పై స్పష్టత రావడం లేదు. మరోవైపు సినిమాలో రాజ్‌పుత్‌ వీరనారి పద్మావతి పాత్రను కించపరిచేలా చిత్రీకరించారని, డ్రీమ్‌ సీన్లు పెట్టారని కొన్ని నెలలుగా దేశమంతా ఆందోళన జరుగుతోంది. రాజ్‌పుత్‌ కర్ణిసేన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తోంది. బీజేపీతో పాటు ఆరెస్సెస్‌ అనుబంధ సంఘాలు కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు సినిమాపై బ్యాన్ విధించాయి.

కాగా పద్మావతి సినిమాలో తాజా ట్విస్ట్‌ ఏంటంటే....అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రను కించపరిచేలా చిత్రీకరించారని ముస్లిం సంఘాల పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఖిల్జీని దోపిడీదారుడిగా చూపించారని విమర్శిస్తున్నారు. దీంతో ముస్లిం సంఘాలు కూడా త్వరలో ఆందోళనబాటపట్టే అవకాశముంది. మొత్తానికి పద్మావతి చుట్టూ రోజుకో వివాదం కమ్ముకుంటోంది. సినిమా విడుదలకు ఆటంకం కలిగించడం భావప్రకటనా స్వేచ్చ, కళాకారులపై దాడిగా కొందరు సినిమా రంగానికి చెందిన ప్రముఖులు అభివర్ణిస్తున్నారు. మొత్తానికి పద్మావతికి ఎన్ని కత్తిరింపులు వేస్తారో, ఎప్పుడు రిలీజ్‌ చేస్తారోనని సగటు ప్రేక్షకుడు మాత్రం ఎదురుచూస్తున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories