బీజేపీకి కోలుకోలేని షాక్.. ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌దే గెలుపు

Submitted by arun on Mon, 10/08/2018 - 09:19

2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కమలానికి భారీ షాక్ తగలనుందా ? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎదురుదెబ్బలు తగలనున్నాయా ? అధికారం నిలబెట్టుకోకపోతే భవిష్యత్‌లో కష్టాలు తప్పవని కాషాయ నేతలు భావిస్తున్నారా ..?  ఏబీపీ న్యూస్‌-సీవోటర్‌ సర్వేలో వెల్లడైన అంశాలేంటో ఇప్పుడు చూడండి. ? 

కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదంతో చరిత్రను తిరగరాస్తామంటూ దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్న కాషాయదళం నేతలకు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఊహించని పరాజయాలు ఎదురవుతాయని  ఒపీనియన్‌ పోల్స్‌ చెబుతున్నాయి.  గత 15 ఏళ్లుగా బీజేపీ పాలనలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లతో పాటు గత ఎన్నికల్లో 80 శాతం సీట్లు కైవసం చేసుకున్న రాజస్ధాన్‌లో కమలానికి ఎదురుగాలి వీస్తున్నట్టు ఏబీపీ న్యూస్‌-సీవోటర్‌ సర్వే వెల్లడించింది.  

ప్రధాని మోదీ తరువాత బీజేపీ ముఖ్యమంత్రుల్లో అత్యధిక కాలం పాలించిన సీఎంగా గుర్తింపు పొందిన శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌కు ఈ సారి పరాజయం తప్పదని ఈ సర్వేలో వెల్లడైంది. మొత్తం 230 సీట్లకు గాను ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 108 కాంగ్రెస్‌కు 122 వస్తాయంటూ ఈ సర్వే వెల్లడించింది. ఓట్ల శాతంగా చూస్తే కాంగ్రెస్‌కు42.2, బీజేపీకి 41.5 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్టు తెలిపింది.  

2013  ఎన్నికల్లో బంపర్‌ మెజార్టీ సాధించి  రాజస్ధాన్‌ పీఠం అధిరోహించిన రాజమాత వసుంధర రాజేకు ఈ సారి పరాజయం తప్పదని సర్వేలో తేలింది. మొత్తం 200 స్ధానాలున్న రాజస్ధాన్‌ అసెంబ్లీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ 142 స్ధానాల్లో విజయం సాధించే అవకాశాలుండగా బీజేపీ 56 స్ధానాలకే పరిమితం కానుంది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ఓట్ల శాతం కూడా భారీ తేడాతో ఉన్నట్టు సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్‌కి 50 శాతం మేర ఓట్లు రానుండగా బీజేపీ మాత్రం 34.3 శాతానికి పరిమితమైంది

చావల్ సింగ్‌‌గా గుర్తింపు పొందిన ఛత్తీస్‌గఢ్‌ బీజేపీ సీఎం రమణ్‌సింగ్‌కు ఈ సారి ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం 90 అసెంబ్లీ నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌కి 47, బీజేపీకి 40 సీట్లు వచ్చే అవకాశాలున్నట్టు ఏబీపీ న్యూస్‌-సీవోటర్‌ సర్వే వెల్లడించింది. అయితే ఓట్ల పరంగా స్వల్ప మెజార్టీ ఉండటం, ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో విజయం ఇరుపార్టీల మధ్య దోబూచులాట ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సర్వే ప్రకారం కాంగ్రెస్‌కు 38.9 శాతం ఓట్లు రానుండగా .. 38.2 శాతం బీజేపీకి వచ్చే అవకాశాలున్నాయి. అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో ఎదురుగాలి వీస్తూ ఉండటంతో కాషాయదళం ఖంగుతుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రభావం 2019 సార్వత్రిక ఎన్నికల్లో పడుతుందని భావిస్తున్న  అగ్రనేతలు గెలుపుపై సమాలోచనలు చేపట్టారు.  

English Title
Opinion poll projects Cong win in MP, Rajasthan and Chhattisgarh

MORE FROM AUTHOR

RELATED ARTICLES