ఇవాళ కేసీఆర్ ఒక్కరే ప్రమాణం చేసే అవకాశం...స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక తర్వాతే మంత్రివర్గ కూర్పు..?

ఇవాళ కేసీఆర్ ఒక్కరే ప్రమాణం చేసే అవకాశం...స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక తర్వాతే మంత్రివర్గ కూర్పు..?
x
Highlights

కేసీఆర్ పట్టాభిషేకానికి రంగం సిద్ధమైంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇవాళ మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేస్తారు....

కేసీఆర్ పట్టాభిషేకానికి రంగం సిద్ధమైంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇవాళ మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేస్తారు. రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 1:25 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌ ఆయనతో వరుసగా రెండోసారి సీఎంగా ప్రమాణం చేయిస్తారు. కేసీఆర్ జాతక రీత్యా ఇవాళ మధ్యాహ్నం 1. 25 ముహూర్తాన్ని ఎంచుకున్నారు. ప్రస్తుతానికి కేసీఆర్‌ ఒక్కరే ప్రమాణం చేస్తారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వ్యవధి తక్కువగా ఉండటంతోనే కేబినెట్‌లోకి మంత్రులను ఎవరినీ తీసుకోకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. జిల్లాలు, సామాజిక వర్గాల కూర్పు తర్వాత వారంలోపు పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరుతుందని సమాచారం.

కేసీఆర్‌ ప్రమాణస్వీకారానికి రాజ్‌ భవన్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్న కేసీఆర్ ఆ కార్యక్రమాన్ని ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా, నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. కేబినెట్‌ కూర్పునకు సమయం లేకపోవడంతో మరోదఫాలో మంత్రుల పదవీ ప్రమాణం ఉంటుంది. ప్రస్తుతం మంత్రివర్గ కూర్పుపై తెలంగాణలో వాడి వేడి చర్చ జరుగుతోంది. నలుగురు మంత్రులు ఓడిపోయినందు వల్ల వీరి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేసుకోవడంతోపాటు ప్రస్తుతమున్న వారిలో కూడా కొందరిని మార్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. రాజ్యాంగం ప్రకారం శాసన సభ్యుల సంఖ్య ఆధారంగా తెలంగాణలో సీఎంతోపాటు మరో 17 మంది మంత్రులు ఉండాలి.. ఆ దిశగా కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారు.

మంత్రి వర్గంతో పాటు స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికపై కూడా కేసీఆర్ దృష్టి సారించారు. త్వరలో తెలంగాణ రెండవ శాసనసభ తొలి సమావేశాలను ఏర్పాటు చేసి, కొత్త ఎమ్మెల్యేల ప్రమాణం చేయించి, స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక పూర్తి చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక తర్వాతే మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories