ఒకటి కాదు, రెండు కాదు.. ఎనిమిది ముఖాల శివుడు

Submitted by admin on Wed, 12/13/2017 - 15:47

శివుడి రూపాలను ఎన్నింటినో మీరు చూసే ఉంటారు. ఇప్పుడు మాత్రం మీరు గతంలో ఎన్నడూ చూసి ఉండని రూపంలో శివుడిని మీరు చూస్తారు. అభిషేక ప్రియుడిగా పేరొందిన శివుడు ఇక్కడ ఒక విశిష్ట రూపంలో దర్శనమిస్తాడు. ఒకటి కాదు... రెండు కాదు...  శివలింగానికి ఎనిమిది ముఖాలు ఉండడం ఇక్కడి ప్రత్యేకత.  ఇక్కడి దేవుడిని చూస్తే చాలు...బాధలన్నీ మర్చిపోవాల్సిందే. వాటన్నింటినీ ఆయన తొలగిస్తాడు. 

పశుపతినాథ్ దేవాలయం అనగానే మనకు నేపాల్ లోని కఠ్మాండూ నగరమే ముందుగా గుర్తుకొస్తుంది. అయితే, మన దేశంలోనే శివ్నానది ఒడ్డున కొలువుదీరిన పశుపతినాథుడు ఎన్నో ప్రత్యేకతలు కలవాడుగా పేరు పొందాడు.  ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా అష్టముఖాలతో ఈశ్వరుడు భక్తకోటిచే పూజలు అందుకుంటున్నాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని మంద్ సౌర్ పట్టణంలో శివ్నా  నదీ తీరంలో ఈ ఆలయం నెలకొంది. శివ్నానది గలగలలతో పశుపతినాథుడుని కీర్తించే భజనలతో ఈ ప్రాంతం ఆధ్యాత్మికతకు అసలు సిసలైన చిరునామగా నిలుస్తుంది.  దేశంలోనే విశిష్ట పశుపతినాథ మందిరంగా ఈ ఆలయం పేరొందింది. మహాకవి కాళిదాసు తన కావ్యం మేఘదూత్ లో ఎన్నో చోట్ల ఈ పట్టణం గురించి ప్రస్తావించాడు.  

అష్టముఖ పశుపతినాథ స్వామి స్వయంభువుడు. ఆలయంలో 3.5 మీటర్ల ఎత్తయిన శివలింగానికి నాలుగు దిక్కులా, రెండు వరుసల్లో మొత్తం ఎనిమిది ముఖాలున్నాయి. పై వరుస నాలుగు ముఖాలకు దిగువన రెండో వరుసలో మరో నాలుగు ముఖాలు చెక్కబడి ఉన్నాయి.  పై నాలుగింటితో పోలిస్తే, కింది నాలుగు ముఖాలు కొంత అస్పష్టంగా ఉంటాయి. శివలింగం కైవారం 8 అడుగులు. ఎత్తు పదిన్నర అడుగులు. బరువు 4.6 టన్నులు. శివ్నా నది ఒడ్డున 90 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు, 101 అడుగుల ఎత్తుతో మందిరం నిర్మించబడింది. మందిరం పై భాగంలో బంగారంతో అలంకరించబడిన 100 కిలోల కలశం నెలకొల్పారు.  ఆలయ ప్రాంగణంలో పార్వతి, గణేశ, కార్తికేయ, గంగ, విష్ణు, లక్ష్మి, ఆదిశంకరాచార్య మూర్తులను ప్రతిష్టించారు. 

English Title
not-one-not-two-shiva-eight-faces

MORE FROM AUTHOR

RELATED ARTICLES