కమలంలో సీట్ల కల్లోలం... ఇందూరులో ఏంటీ ఇంటి గోల!!

Submitted by santosh on Mon, 11/05/2018 - 16:15
nizamabad bjp issue

రాష్ట్రంలో కీలక నియోజకవర్గంగా గుర్తింపు ఉన్న నిజామాబాద్ అర్బన్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. టీఆర్ఎస్ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు టికెట్టు ఖరారు కాగా.. బీజేపీ నుంచి యెండల లక్ష్మీనారాయణను అభ్యర్ధిగా ప్రకటించింది బీజేపీ అధిష్ఠానం. కాంగ్రెస్ నుంచి మహేష్ కుమార్ గౌడ్ రేసులో ఉండగా.. తాజాగా బీజేపీ అసంతృప్తి నేతకు ఆ పార్టీ నేతలు గాలం వేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో  బీజేపీ అభ్యర్దిగా పోటీ చేసిన ధన్‌పాల్ సూర్యనారాయణ, ఈ ఎన్నికల్లో అర్బన్ టికెట్టు ఆశించారు. చివరి క్షణం వరకు ప్రయత్నం చేశారు. ఐతే అర్బన్ నుంచి మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణకు, బీజేపీ అధిష్ఠానం టికెట్టు ప్రకటించింది. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన ధన్ పాల్.. రెబల్ గా బరిలో ఉంటానని ప్రకటించారు. ఈ మేరకు నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో ఆత్మీయ  సమావేశం ఏర్పాటు చేశారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని కార్యకర్తలకు స్పష్టం చేశారు. ఏ పార్టీ నుంచి బరిలో నిలిచేది రెండు రోజుల్లో వెల్లడిస్తానని ప్రకటించారు.

నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్దిగా యెండల ఖరారు కావడంతో.. ధన్ పాల్ వర్గం పార్టీ కార్యాలయంపై దాడి చేసింది. ఈ వ్యవహారాన్ని అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. మరోవైపు ధన్ పాల్ సైతం రెబల్‌గా బరిలో నిలిచేందుకు నిర్ణయించారు. దీంతో ఆయనకు టీఆర్ఎస్ - కాంగ్రెస్ గాలం వేస్తున్నాయి. అర్బన్‌లో మంచి పట్టు ఉండటం, వివాదారహితునిగా గుర్తింపు ఉండటంతో ఆయన్ను పార్టీలోకి చేర్చుకుంటే అర్బన్ స్ధానంలో గెలుపు, నల్లేరుపై నడకలా ఉంటుందని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఇటు కాంగ్రెస్ ఓ అడుగు ముందుకేసి ధన్‌పాల్‌ను పార్టీలోకి చేర్చుకుని, అర్బన్ అభ్యర్దిగా బరిలో నిలిపితే బాగుంటుందనే అంశాన్ని పరిశీలిస్తోంది. కాంగ్రెస్ కీలక నేతలు ఇప్పటికే ధన్‌పాల్‌కు టచ్‌లోకి వెళ్లడంతో ఆసక్తికరంగా మారింది. ధన్ పాల్ కాంగ్రెస్ గూటికి చేరితే, అర్బన్‌లో పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

కాంగ్రెస్ - టీఆర్ఎస్ నేతలు బీజేపీ అసంతృప్తి నేతకు గాలం వేయడం.. ఆయన సైతం రెండు రోజుల్లో రాజకీయ నిర్ణయం ఉంటుందని ప్రకటించడం నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ధన్ పాల్ ఏ పార్టీలో చేరుతారన్నది ఇటు బీజేపీ నేతల్లోను కాక రేపుతోంది. కాంగ్రెస్ గూటికి చేరితే అర్బన్ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశం స్పష్టంగా ఉంది.

English Title
nizamabad bjp issue

MORE FROM AUTHOR

RELATED ARTICLES