తెలంగాణలో హై అలర్ట్...

Submitted by arun on Mon, 10/08/2018 - 10:02
mao

ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ లో ‍NIA హై అలర్ట్ ప్రకటించింది. రెండు పార్టీలకు చెందిన నాయకులపై మావోయిస్టులు దాడులు చేసే అవకాశం ఉందని ఐబీ హెచ్చరికలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని జిల్లాల ఎస్పీలకు పోలీసు శాఖ ఆదేశించింది. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలపై గట్టి నిఘా పెట్టారు పోలీసులు. 

ఎన్నికల షెడ్యూల‌్ ప్రకటనతో రాజకీయ నేతలు మంచి ఊపు మీదున్నారు. ప్రచారంలో జోష్ పెంచారు. ఎన్నికల ప్రచారానికి పల్లె  పల్లెకు వెళుతూ గడప గడప తొక్కుతున్నారు. తమకే ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. అయితే తెలంగాణ ఎన్నికలపై మావోయిస్టులు కన్నేశారని NIA తెలిపింది. తెలంగాణలో TRS, BJP నాయకులను టార్గెట్ గా చేసుకుని దాడులు చేసే అవకాశం ఉందని రాష్ట్ర పోలీసులకు సమాచారం అందింది. దీంతో అన్ని జిల్లాల SPలను రాష్ట్ర పోలీసు శాఖ అప్రమత్తం చేసింది. మావోల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో నిఘా పెంచాలని కోరింది. ఉమ్మడి కరీంనగర్ , ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ, మహబూబ‌్ నగర్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపింది. ప్రచారానికి వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది. 

చత్తీస్ గఢ్ సుక్మా దండకారణ్యంలో ఎన్నికల సమయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై మావోలు కసరత్తు చేస్తున్నట్లు నిఘావర్గాలు సమాచారం అందించాయి. ఎన్నికల ప్రచారాలు, బహిరంగ సభల్లో మావోల నుండి ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నారు. మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో నేతలు  ప్రచారానికి వెళ్లినప్పుడు అదనపు భద్రత కల్పించాలని SPలకు ఆదేశాలు అందాయి. ఏపీలో అరకు MLA కిడారి సర్వేశ్వరరావు, మాజీ MLA సోమలను మావోయిస్టులు కాల్చి చంపిన నేపథ్యంతో అక్కడ పోలీసులు కూంబింగ్, దాడులు చేస్తున్నారు. దీంతో మావోయిస్టులను ఎదుర్కోనేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. 

ఎన్నికల సమయంలో మావోల వ్యూహాలకు ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్లాలని ఉన్నతాధికారులు పోలీసులను ఆదేశించారు. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో తరచు సోదాలు, కూంబింగ్ లు నిర్వహించాలని యోచిస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభధ్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ఎన్నికల సమయంలో రాష్ట్రానికి కేంద్ర బలగాలతో భద్రత చర్యలు తీసుకోబోతున్నారు. 

English Title
NIA alerts TS police of Maoists attacks on politicos

MORE FROM AUTHOR

RELATED ARTICLES