శరవేగంగా ముందస్తు ఎన్నికల ఏర్పాట్లు...పొలిటికల్‌ హీట్‌ అంతకంతకూ పెంచేస్తున్న కేసీఆర్

x
Highlights

ముఖ్యమంత్రి ముందస్తు యాత్రపై ఊహాగానాలు జోరు మీదున్నాయి. ఎవరికి తోచింది వారు మాట్లాడుకుంటున్నారు. ఎన్నికల కోసమే అంటూ కొందరు విభజన హామీల కోసమేనని...

ముఖ్యమంత్రి ముందస్తు యాత్రపై ఊహాగానాలు జోరు మీదున్నాయి. ఎవరికి తోచింది వారు మాట్లాడుకుంటున్నారు. ఎన్నికల కోసమే అంటూ కొందరు విభజన హామీల కోసమేనని మరికొందరు ఇలా ఎవరి అభిప్రాయాలు వారివి. ఎవరి అంచనాలు వారివి. ఏమైనా సీఎం ఢిల్లీ టూర్ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. మరి హస్తిన పర్యటన పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? తెలంగాణ రాజకీయాన్ని ఏ మలుపు తిప్పబోతున్నాయి?

ముందస్తు ముచ్చట ముదురుతోంది. ఎన్నికల వేడి కాక పుట్టిస్తోంది. రాజకీయ మంత్రాంగాలు జోరు మీదుంటే రణతంత్ర వ్యూహాలకు అధికార పార్టీ మరింత పదును పెడుతోంది. ఇప్పటికే ప్రగతి నివేదనంటూ అంటూ పనులు చకచకా సాగిస్తున్న గులాబీ దళపతి ఇంతలోనే హస్తిన పర్యటన అంటూ పొలిటికల్‌ హీట్‌ పెంచేస్తున్నారు. ఓ పక్క అబ్బే ముందూ లేదూ వెనుకా లేదూ అని గులాబీ రేకులు ఊహాగానాలను కొట్టిపారేస్తున్నాయి. విభజన హామీల అమలు ప్రత్యేక హైకోర్టు, కాళేశ్వరానికి నిధుల వరద పారించడమే కేసీఆర్‌ పర్యటన ముఖ్య ఉద్దేశమంటూ సమర్థిస్తున్నాయి. ఈ విషయాన్ని కొట్టి పారేయలేం అందులో నిజం లేదనీ చెప్పలేం. కానీ కేసీఆర్‌ రాజకీయ వ్యూహ చతురతా సామర్థ్యాన్ని కూడా అంత తక్కువగా అంచనా వేయలేం.


ఏ లెక్కన చూసినా తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నట్టే కనిపిస్తున్నాయి. ప్రగతి నివేదన సభ అంటూ హడావుడి చేసింది గులాబీ క్యాంప్‌. అంతేకాదు సభస్థలిని స్వయంగా ముఖ్యమంత్రి పరిశీలించారు. సభా ప్రాంగణం ఎలా ఉండాలో నిర్దేశించారు. దీంతో సీనంతా మారిపోయింది. తెలంగాణలో రాజకీయం రసపట్టుకు చేరినట్టయింది. రాష్ట్రంలో జరుగుతున్న ఈ హడావిడి నుంచి ప్రతిపక్షాలు కుదురుకొని ఏం చేయాలో ఆలోచించుకునే లోపే ఢిల్లీ టూర్‌ అంటూ కేసీఆర్‌ మరో బాంబు పేల్చారు. ప్రత్యర్థులకు ముందస్తు వ్యూహం ప్రకారమే ఇదంతా జరుగుతుందన్న ఆలోచన కల్పించారు.

నెలలో రెండుసార్లు. ఇంకా చెప్పాలంటే 20 రోజుల్లోనే మరోసారి. కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌ షెడ్యూల్‌ ఇది. ముందస్తు ముచ్చట్లు జోరందుకుంటున్న సమయంలో కేసీఆర్‌ హస్తిన పర్యటన అన్ని వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిజమెంతో తెలియదు కానీ మంత్రి కేటీఆర్‌ మూడో కంటికి తెలియకుండా కేంద్ర పెద్దలతో ముందస్తు మంత్రాంగం జరిపారన్న ప్రచారమూ ఉండనే ఉంది. అదే సమయంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవడం, ఆతర్వాత గవర్నర్‌ నరసింహన్‌తో ముఖ్యమంత్రి భేటీ కావడం తెల్లారే ప్రగతి నివేదన సభాస్థలిని పరిశీలించడం, కాసేపటికే పార్టీ పార్లమెంటరీ స్థాయి అత్యున్నత సమావేశం కావడం ఆపై హస్తినకు విమానమెక్కడం ఇలా పొలిటికల్‌ హీట్‌ అంతకంతకూ పెంచేస్తున్నారు కేసీఆర్‌.

రాజస్థాన్, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాలకు అక్టోబరు మొదటివారంలో షెడ్యూల్ రావచ్చు. వీటితో పాటే తెలంగాణకు కూడా ఎన్నికలు జరగాలన్నది కేసీఆర్‌ ఆలోచనగా కనిపిస్తోంది. అసెంబ్లీని రద్దు చేస్తే ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం రెడీగానే ఉందని చెబుతోంది గులాబీ గ్యాంగ్. మంచిదే.!! కానీ శాసనసభ రద్దు తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? అదే జరిగితే అసలుకే మోసం రాక తప్పదు. సరిగ్గా ఇక్కడే తన రాజకీయ బుర్రకు పదును పెట్టినట్టున్నారు కేసీఆర్‌. ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మను రంగంలోకి దింపి సాధ్యాసాధ్యాలపై ఓ అంచనా వచ్చినట్టున్నారు. ఆ తర్వాతే ఢిల్లీ యాత్రకు పయనమైనట్టున్నారు.

కొంత మంది చేసేది పక్కవారికి కూడా తెలియనివ్వరు. కుడిచేత్తో చేసే పని ఎడంచేతికి కూడా తెలియదు. కేసీఆర్ వ్యవహారం కూడా కొన్ని సందర్భాల్లో ఇలాగే ఉంటుంది. ముందస్తు ఊహాగానాల మధ్య తెలంగాణ రాజకీయం ఓ పక్క ఉడికిపోతుంటే ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కేసీఆర్ పేల్చే బాంబు తీవ్రత ఎంతో లెక్కలు వేసుకునే పనిలో పడ్డాయి ప్రతిపక్షాలు. ఇంతకీ కేసీఆర్‌ ఢిల్లీలో ఎవరిని మెప్పిస్తారు? ఎలా మెప్పిస్తారు.?

ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్‌ క్యాడర్‌ కాస్ల క్లారిటీ ఇచ్చినట్టే ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడనేది తనకు వదిలేయాలని, ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని సూచించిన కేసీఆర్‌.. ప్రగతి నివేదన సభ నుంచే ఎన్నికల రణభేరిని, ప్రచారభేరి మోగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పార్లమెంటరీ స్థాయి సంయుక్త సమావేశంలో దిశానిర్దేశం చేసిన కేసీఆర్ క్యాడర్‌లో ఉత్సాహం నింపుతూ అటు నుంచి అటే ఢిల్లీకి పయనమయ్యారు. ఢిల్లీ పెద్దలు ఒప్పుకొని అన్నీ అనుకూలించి నవంబరులో ఎన్నికలు వచ్చి విజయం సాధిస్తే... తెలంగాణకు మైలురాయిలాంటి డిసెంబరు 9న ఆయన తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని గులాబీ గ్యాంగ్‌ గుసగుసలాడుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నాటి హోంమంత్రి చిదంబరం 2009 డిసెంబరు 9న చేసిన ప్రకటనను చారిత్రాత్మకంగా మార్చాలన్నది గులాబీ దళపతి ఆలోచనగా కనపడుతోంది.

ఒకపక్క పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరుగుతుండగానే కీలక స్థానాలకు ఐఏఎస్‌ల బదిలీ కూడా ముందుస్తు ఊహాగానాలకు మరింత ఊతం ఇచ్చినట్టు కనిపిస్తుంది. అయితే ముందస్తు ఎన్నికలే వస్తే అవి శాసనసభకే కానీ లోక్‌సభకు కాదు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కుండబద్దలు కొట్టింది. గులాబీ క్యాంపు రకరకాల లీకులు ఇస్తున్నా ఒక రాజకీయ అంశానికి సంబంధించిన అనుమతి కోసం, ఒక నిర్ణయం కోసమే కేసీఆర్‌ ప్రధానమంత్రిని కలబోతున్నారు. ఇతిమిద్ధంగా ఇదీ అని చెప్పలేకున్నా కీలకమైన విషయమే వారి మధ్య ప్రస్తావనకు వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. పెద్దమనిషి తరహాలో ప్రధాని మాట సాయం తీసుకుందామని కూడా కేసీఆర్‌ అనుకొని ఉండవచ్చు అయితే ముందస్తు ఎన్నికలపై మోడీ ఏమనుకుంటున్నారో తెలుసుకునే ఆలోచన ఒకటైతే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న దానిపైనా క్లారిటీ తీసుకోవడం రెండోది కావచ్చు.

ముందస్తు ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ఎన్నికల సంఘంతో చర్చించడం, అందుకున్న సీఈసీని ఒప్పించడం పెద్దపని. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నిర్వహణకు సిద్ధమేనని ఎన్నికల సంఘం సంకేతాలిచ్చినా తక్కువ సమయంలో మౌలిక వసతులు కల్పించడం, కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడం కత్తి మీద సాములాంటిదే. సరే!! దానికి కూడా ఒప్పుకున్నా నిబంధనలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిందే. ఒకవేళ అసెంబ్లీని రద్దు చేస్తే షెడ్యూల్ ప్రకటించబోయే రాష్ట్రాలతో కలపి తెలంగాణకు ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అన్నది కూడా పాయింటే.

ఏమైనా తెలంగాణ సమీకరణలు పూర్తిగా రాజకీయాన్ని రంగరించుకుంటున్నాయి. కేసీఆర్‌ మూడురోజుల ఢిల్లీ పర్యటన తర్వాత తెలంగాణకు ముందస్తు ఎన్నికలు వస్తాయో లేదో కానీ పొలిటికల్‌గా మాత్రం పాలక, ప్రతిపక్షాలు వ్యూహప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. మొత్తానికి ముందుస్తు సంకేతాలు ఎంతవరకు నిజమో పాలకు పాళ్లు... నీళ్లకు నీళ్లులా వచ్చే వారం తేలిపోనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories