మహా కూటమి పొత్తుల్లో కొత్త ట్విస్ట్‌

Submitted by arun on Mon, 10/15/2018 - 11:35
 Mahakutami

మహా కూటమి పొత్తులో కొత్త కోణం వెలుగు చూసింది.  మిత్రపక్షాలను సాధ్యమైనంత వరకు తక్కువ స్ధానాలు ఇవ్వాలని భావిస్తున్న టీ కాంగ్రెస్ పొత్తులపై ఆచితూచి వ్యవహరిస్తోంది. అటు  భవిష్యత్‌కు ఢోకా లేకుండా ఇటు పొత్తులు విఛిన్నం కాకుండా తనదైన శైలిలో పావులు కుదుపుతుంది. తాజాగా  పొత్తుల్లో భాగంగా తెలంగాణ జనసమితికి ఇచ్చే సీట్ల విషయంలో ఎవరూ ఊహించని  ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది.  టీజేఎస్‌ అభ్యర్థులు తమ పార్టీతో కాకుండా కాంగ్రెస్‌ బీఫారంపైనే పోటీ చేయాలంటూ ప్రతిపాదించింది. ఇందుకోసం ఆ పార్టీ కోరుకుంటున్న స్థానాలు ఇచ్చేందుకు సిద్ధమంటూ పార్టీ కోర్‌కమిటీ  నిర్ణయించారు. ఈ ప్రతిపాదనపై టీజేఎస్‌ను ఒప్పించడంతోపాటు కూటమిలోని మిగిలిన పార్టీల మధ్య పొత్తు సమన్వయం చేసే బాధ్యతలను సీనియర్‌ నేత జానారెడ్డికి అప్పగించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్సీ కుంతియాతో పాటు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, పార్టీ సీనియర్‌ నేతలు జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, మధు ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు.  

సీట్ల సర్దుబాట్లపై జరిగిన చర్చలో టీడీపీకి 10–12 స్థానాలు, టీజేఎస్‌కు 8–10 స్థానాలు, సీపీఐకి 2 స్థానాలు ఇవ్వడానికి కాంగ్రెస్‌ నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.  టీజేఎస్‌ అధ్యక్షుడు  ప్రొఫెసర్‌ కోదండరాం గౌరవానికి భంగం కలిగించకుండా.. టీజేఎస్‌ కోరుకుంటున్నట్లుగా.. 8–10 సీట్లు ఇవ్వాలనే అభిప్రాయానికి వచ్చారు. టీజేఎస్‌కు ఇచ్చే సీట్లలో పోటీచేసే నేతలకు కాంగ్రెస్‌ బీఫారం ఇచ్చి హస్తం గుర్తుపైనే బరిలో దించాలని నిర్ణయించారు. ఇలాగైతేనే కూటమికి మేలు జరుగుతుందనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ నేతలు వెల్లడిస్తున్నారు.  టీజేఎస్‌ కోరుతున్న విధంగా కూటమి కనీస ఉమ్మడి ప్రణాళిక అమలు చైర్మన్‌గా కోదండరాంను నియమించాలని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కమిటీకి చట్టబద్ధత కల్పించి  కమిటీ చైర్మన్‌కు డిప్యూటీ సీఎం హోదా కల్పించాలని భేటీలో నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలను టీజేఎస్‌ నేతల ముందుపెట్టి వీలున్నంత త్వరగా పొత్తుల వ్యవహారం తేల్చాలనుకుంటున్నారు. కోదండరాంను పోటీ చేయించడం కన్నా ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసే బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. కోదండరాం పర్యటనల కోసం అవసరమైతే ప్రత్యేక హెలికాప్టర్‌ సమకూర్చాలని, ఆయన పోటీలో ఉన్నదాని కన్నా ప్రచారంలో కీలకంగా ఉండడమే కూటమికి మేలు చేస్తుందని కోర్‌కమిటీ  అభిప్రాయపడినట్టు సమాచారం. 

కూటమి పార్టీలను సమన్వయపరిచి వీలున్నంత త్వరగా పొత్తుల వ్యవహారం తేల్చే బాధ్యతను పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి బృందానికి అప్పగిస్తూ కోర్‌కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో చిన్నారెడ్డి, పొన్నం ప్రభాకర్, పి.వినయ్‌కుమార్‌లను సభ్యులుగా ఉంచాలని, ఈ నలుగురి బృందం ఇతర పార్టీలతో పొత్తుల చర్చల్లో పాల్గొనాలని, మిగిలిన పార్టీ నేతలు ఇతర కార్యక్రమాలు చూసుకోవాలని నిర్ణయించారు. 
 

English Title
New Twist In Telangana Mahakutami

MORE FROM AUTHOR

RELATED ARTICLES