శతాధిక వసంతాల కాంగ్రెస్ లో మొదలవుతున్న కొత్తశకం

Highlights

వందేళ్లు పైబడ్డ కాంగ్రెస్ చరిత్రలో ఆనాటి వృద్ధతరం అధ్యాయం ఇక ముగిసినట్టేనా? వృద్ధతరం స్థానంలో ఇకపై పార్టీలో యువతరానికే అగ్రతాంబూలం వేస్తున్నారా? గత...

వందేళ్లు పైబడ్డ కాంగ్రెస్ చరిత్రలో ఆనాటి వృద్ధతరం అధ్యాయం ఇక ముగిసినట్టేనా? వృద్ధతరం స్థానంలో ఇకపై పార్టీలో యువతరానికే అగ్రతాంబూలం వేస్తున్నారా? గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ లో నాయకత్వ మార్పు కోరుకుంటున్న చాలా మంది నేతల అభీష్టం నెరవేరబోతోంది. ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించినా... సమర్థుడైన నాయకుడిగా రాహుల్ రాణించలేకపోయారు. 2014 ఎన్నికలకు ముందు ఉపాధ్యక్షుడి హోదాలో.. పార్టీకి జవసత్వాలు నింపుతారని, మళ్లీ అధికారంలోకి తీసుకొస్తారని కాంగ్రెస్ నేతలు భావించారు. కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. కేవలం 44 సీట్లకే పరిమితమై రాహుల్ ను ఓ అసమర్థ నాయకుడికి ఆనవాలుగా నిలబెట్టింది. ఇక తాజాగా.. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు.. కాంగ్రెస్ లో మరో భారీ ప్రయోగం జరుగుతోంది. రాహుల్ ను ఏకంగా అధ్యక్ష పీఠం మీద కూర్చోబెట్టి.. దేశ భవిష్యత్తును తిరగరాయాలన్న ఉద్దేశంతో.. కాంగ్రెస్ ఇప్పుడు కొత్తపంథాలో ప్రయాణించేందుకు నిర్ణయించుకుంది.

9న పార్టీ పగ్గాలు చేపట్టబోతున్న యువరాజు

దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు ఉన్న గుర్తింపు... మరే పార్టీకీ లేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి సుదీర్ఘమైన చరిత్ర ఉన్న పార్టీ పగ్గాలను రాహుల్ చేపట్టబోతున్నారు. అధ్యక్ష పదవికి రాహుల్ తప్ప కాంగ్రెస్ లో మరో నాయకుడు నామినేషన్ వేయకపోవడంతో.. ఆయన ఎన్నిక లాంఛనంగా మారిపోయింది. ఈ నెల 9న ఆయన్ని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా దేశానికి పరిచయం చేస్తారు. దీంతో కాంగ్రెస్ లో ఓ నూతన శకం మొదలవుతోందన్నమాట. కొత్త బాధ్యతలు చేపడుతున్న రాహుల్ ముందు అనేక సవాళ్లు.. ఆయన శక్తిసామర్థ్యాలకు పరీక్షగా నిలుస్తున్నాయి. 2019లో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడం అంతిమ లక్ష్యం అయితే.. అధికారం కోల్పోయిన దాదాపు 10 రాష్ట్రాల్లో పార్టీకి పూర్వవైభవం తీసుకురావడం అన్నింటికన్నా ముఖ్యమైన అంశం. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ దీనావస్థలోకి దిగజారిపోయిన తరువాత.. బిహార్, అసోం, నాగాలాండ్ వంటి అనేక రాష్ట్రాల్లో అధికారానికి దూరమైంది. ఇక ఉమ్మడి ఏపీలో కూడా బలమైన శక్తిగా ఉన్న కాంగ్రెస్ పరిస్థితిని చూసి.. పార్టీ కేడరే జాలిపడుతోంది. ఈ క్రమంలో పార్టీ అత్యున్నత నిర్ణాయక బాధ్యతలు చేపట్టిన తరువాత.. ఈ లక్ష్యాలన్నింటినీ రాహుల్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అన్నిటికన్నా.. రాహుల్ శక్తిసామర్థ్యాలు నిరూపించుకునే అవకాశం గుజరాత్ ఎన్నికల రూపంలోనే ఉందంటున్నారు విశ్లేషకులు.

రాహుల్ కు పార్టీ పగ్గాలు అంటే.. కూలుతున్న కోట అప్పగింతేనా?

ఇక వ్యూహాత్మక తప్పిదాలకు కాంగ్రెస్ సీనియర్లు పెట్టింది పేరు. రాహుల్ కు పట్టాభిషేకం అప్పగించే తరుణంలో... సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్.. చేసిన ఓ కామెంట్.. బీజేపీ నేతలకు తాజా అస్త్రాన్ని అందించినట్టయ్యిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యం గురించి ఘనంగా మాట్లాడే కాంగ్రెస్ నేతలు.. రాహుల్ కు బాధ్యతల అప్పగింతను మొఘల్ సామ్రాజ్యంలో జరిగిన అధికార మార్పిడితో పోల్చడం సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టయ్యిందంటున్నారు విశ్లేషకులు. షాజహాన్, ఔరంగజేబుల అధికార దాహాన్ని మోడీ ఉటంకిస్తూ... రాహుల్ ను కార్నర్ చేసే అవకాశాన్ని కల్పించడం... కాంగ్రెస్ నేతల వ్యూహాత్మక తప్పిదానికి నిదర్శనంగా చెబుతున్నారు. మరోవైపు.. 70 ఏళ్లు దాటిన వయసులో సోనియా.. రాహుల్ కి పార్టీ బాధ్యతలు అప్పగించడాన్ని.. కూలుతున్న సామ్రాజ్యపు బాధ్యతల అప్పగింతగా పలువురు అభివర్ణిస్తున్నారు. మరి.. రాహుల్.. కూలుతున్న కోటను నిలబెడతారా? లేక మరింత పతనావస్థలోకి నెట్టేస్తారా.. అన్నదే కాంగ్రెస్ అభిమానులు, దేశ ప్రజానీకం ఎదురుచూస్తున్న అంశం.

Show Full Article
Print Article
Next Story
More Stories