మంత్రిగా ప్రమాణస్వీకారంచేసే ఆ ఒక్కరు ఎవరు...ఆ ఇద్దరిలో ఒకరు ఉండొచ్చని పార్టీ వర్గాల్లో చర్చ

x
Highlights

గులాబీ బాస్‌ కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయనతోపాటు ఒక్కరు మాత్రమే మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారని కేసీఆరే...

గులాబీ బాస్‌ కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయనతోపాటు ఒక్కరు మాత్రమే మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారని కేసీఆరే స్వయంగా చెప్పారు. దాంతో ఆ ఒక్కరూ ఎవరనేది ఆసక్తిగా మారింది. అయితే ప్రస్తుత అసెంబ్లీలో తానే సీనియర్‌ ఎమ్మెల్యేనన్న కేసీఆర్‌ ఆ తర్వాత రెడ్యానాయక్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉన్నారన్నారు. దాంతో ఈ ఇద్దరిలో ఒకరుంటారనే చర్చ జరుగుతోంది, అదే సమయంలో ఈటల రాజేందర్‌, కడియం శ్రీహరిల్లో ఒకరు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయొచ్చనే టాక్‌ నడుస్తోంది.

ప్రమాణస్వీకార తంతు ముగిసిన తర్వాతే పూర్తిస్థాయి మంత్రివర్గ కూర్ఫుపై కేసీఆర్‌ కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో నలుగురు మంత్రులు ఓడిపోగా, పన్నెండు మంది మినిస్టర్స్‌ మళ్లీ విజయం సాధించారు. దాంతో వీరిలో ఎంతమంది రెన్యువల్‌ అవుతారో, కొత్తగా ఎవరికి అవకాశం వస్తుందనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.

మంత్రి పదవులు ఆశిస్తున్నవారు ఎవరికి వారు తమ బలాలను అంచనా వేసుకుంటున్నారు. సామాజిక వర్గాలు, జిల్లాలు, సీనియారిటీలను బేరీజు వేసుకుంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి మంత్రిగా పనిచేసిన జూపల్లి ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో నిరంజన్‌‌రెడ్డికి అవకాశం దక్కొచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. అలాగే మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మళ్లీ తనకు పదవి గ్యారంటీ అనే ధీమాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కేసీఆర్‌ గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈసారి తనకు మంత్రి పదవి దక్కుతుందని శ్రీనివాస్‌గౌడ్ ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మళ్లీ తనకు మంత్రిగా అవకాశం లభిస్తుందని జగదీశ్‌‌రెడ్డి భావిస్తున్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌‌రెడ్డి కూడా తనకు మంత్రి పదవి గ్యారంటీ అనే ధీమాలో ఉన్నారు. ఇక ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సైతం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఖమ్మం జిల్లా నుంచి గెలిచిన ఒకే ఒక్కడు పువ్వాడ అజయ్‌‌కు మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఓడిపోయిన తుమ్మలకు ఎమ్మెల్సీ ఇచ్చి, మళ్లీ కేబినెట్‌లోకి తీసుకుంటారనే చర్చ సైతం నడుస్తోంది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కేటీఆర్‌, ఈటెలకు దాదాపు బెర్త్‌ ఖాయం కాగా, మెదక్‌ జిల్లా నుంచి హరీష్‌‌రావు మంత్రి పదవి లాంఛనమే. ఇక మహిళా మంత్రి లేరనే అపవాదుకు ఈసారి ఫుల్‌స్టాప్‌‌ పెట్టనున్నట్లు తెలుస్తోంది. మెదక్‌ నుంచి గెలిచిన పద్మా దేవేందర్‌‌రెడ్డికి పదవి దక్కుతుందనే మాట వినిపిస్తోంది. ఇక నిజామాబాద్‌ జిల్లా నుంచి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి మళ్లీ బెర్త్‌ ఖాయమని అంటున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ఇంద్రకరణ్‌‌రెడ్డి, జోగు రామన్నలకు మళ్లీ అవకాశం వస్తుందా? లేక కొత్త వాళ్లను తీసుకుంటారా అనే చర్చ జరుగుతోంది. ఇక వరంగల్‌ జిల్లా నుంచి కడియంకు బెర్త్‌ పక్కా అంటున్నారు. అయితే ఈసారి ఎర్రబెల్లి, రెడ్యానాయక్‌, వినయ్‌ భాస్కర్‌ కూడా పోటీలో ఉన్నారు.

ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌లోనూ టీఆర్‌ఎస్‌ మెజారిటీ సీట్లే సాధించింది. దాంతో ఇక్కడ్నుంచి కూడా మంత్రి పదవుల కోసం పోటీ ఎక్కువగానే ఉంది. మాజీ మంత్రులు తలసాని‌, పద్మారావు మళ్లీ రెన్యువల్‌ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే నాయిని, మహమూద్‌ అలీకి ఈసారి ఛాన్స్‌ ఉండకపోవచ్చనే మాట వినిపిస్తోంది. దాంతో దానం నాగేందర్‌ సైతం మంత్రి పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మహేందర్‌రెడ్డి ఓడిపోవడంతో, రేవంత్‌రెడ్డిపై గెలిచిన నరేందర్‌రెడ్డికి అవకాశం ఇవ్వొచ్చనే చర్చ జరుగుతోంది. ఆశావహులు ఇలా ఉంటే, సామాజిక సమీకరణాలు, జిల్లాలు, సీనియారిటీ లెక్కల్లో ఎవరిని మంత్రి పదవులు వరిస్తాయ్ననది ఆసక్తికరంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories