ట్విస్టులు తిరుగుతున్న నయీం కేసు

ట్విస్టులు తిరుగుతున్న నయీం కేసు
x
Highlights

నయీమ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న పలువురు పోలీసులకు తెలంగాణ ప్రభుత్వం క్లీన్ చీట్ ఇచ్చింది. గ్యాంగ్‌స్టర్‌తో కలసి అక్రమాలకు పాల్పడ్డ పోలీసు అధికారుల...

నయీమ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న పలువురు పోలీసులకు తెలంగాణ ప్రభుత్వం క్లీన్ చీట్ ఇచ్చింది. గ్యాంగ్‌స్టర్‌తో కలసి అక్రమాలకు పాల్పడ్డ పోలీసు అధికారుల సస్పెన్షన్‌ను ఎత్తేసింది. దర్యాప్తు ఎలా సాగుతుందో తెలియదు కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు మాత్రం కేసు నుంచి తప్పుకుంటున్నారు. మరి ఈ కేసు నీరుగారిపోతోందా..? కనుచూపుమేరలో కేసును ముగించే అవకాశం ఉందా..?

ఆ ఘటన.. వేల ప్రశ్నలను సంధించింది.. ఆ ఎన్‌కౌంటర్.. ఎన్నో చీకటి కోణాలను తెరపైకి తెచ్చింది.. ఆ ఉదంతం.. తెరచాటు బాగోతాలను కళ్లముందు ఉంచింది..

అవును.. నయీమ్ ఎన్‌కౌంటర్‌ విచారణ.. దర్యాప్తు అధికారుల పనితీరును ప్రశ్నార్థకం చేస్తోంది. చీకటి కోణాలను వెలుగులోకి తెచ్చేందుకు సాగుతున్న విచారణ కూడా అదే చీకట్లో సాగుతుందా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. గతంలో ఐపీఎస్‌ స్థాయి అధికారులు కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నా ఆ స్థాయిలో దర్యాప్తు సాగిన దాఖలాలు కనిపించవు. విచారణ అంతా గప్‌చుప్‌గా నడుస్తున్నట్లే కనిపిస్తోంది.

నయీం కేసులో కీలకంగా మారిన పలువురు పోలీసులకు తెలంగాణ ప్రభుత్వం క్లీన్ చీట్ ఇవ్వడమే ఈ కేసు విచారణ నడుస్తున్న తీరును ప్రశ్నిస్తోంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌తో దర్యాప్తు చేయించింది. దర్యాప్తులో ఒక్కొక్కరి పాత్ర ఆధారాలతో సహా బయటపడింది. సీఐడీ డీఎస్పీ మద్దిపాటి శ్రీనివాసరావు నయీంతో కలిసున్న ఫోటోలు బయటకురావడం పోలీసుశాఖ కలకలం రేపింది. ఆయనతో పాటు మల్లినేని శ్రీనివాస్‌రావు, డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్ ఏసీపీ చింతమనేని శ్రీనివాస్, కొత్తగూడెం ఇన్‌స్పెక్టర్ రాజగోపాల్, సంగారెడ్డి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మస్తాన్ వలీకి నయీంతో సంబంధాలున్నట్లు నిర్ధారించారు. దీంతో వీరిని గతేడాది మే నెలలో సస్పెండ్ చేసింది. అంతేకాకుండా మరికొంత మంది పోలీసులకు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే దర్యాప్తు ఆరంభంలో హడావుడి చేసిన అధికారులు చివరకు ఆయా పోలీసులకు నయీంతో ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. ఆరోపణలు రుజువు కాకపోవడంతో ఆయా అధికారుల సస్పెన్షన్‌ను ఎత్తేసినట్లు హోంశాఖ అదేశాలు జారీ చేసింది.

ఖాకీలే కాదు ఖద్దరు చొక్కాలు కూడా ఈ కేసులో కీలక పాత్ర పోషించాయి. సెటిల్మెంట్లు, భూకబ్జాల్లో పెద్ద తలకాయల ప్రమేయంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. తెరచాటు బాగోతాల్లో బడా రాజకీయనాయకులకు సంబంధం ఉందనే వార్తలు నివ్వెరపర్చాయి. మరి ఆ లీడర్లేమయ్యారు..? వారిని శిక్షించే దిశగా విచారణ సాగుతోందా..?

నల్లగొండ జిల్లా నరహంతకుడు నయీం నేరాల గుట్టు చెప్పుకుంటే చరిత్రే అవుతుంది. పదుల సంఖ్యలో హత్యలు, లెక్కలేనన్ని సెటిల్మెంట్లు, బెదిరింపులు, భూకబ్జాలు ఇలా చెబితే నయీం పాపాల కొండ చాంతాడంత. నక్సలైట్‌గా తర్వాత కోవర్టుగా పనిచేసిన నయీం తొలుత పోలీసు ఉన్నతాధికారులతో తర్వాత రాజకీయ నాయకులతో సత్సంబంధాలను నెరపాడు. దారుణమైన` నేరాలకు పాల్పడ్డాడు. అయితే నయీం కేసులో పోలీసులతో పాటు.. పలువరు రాజకీయ నాయకుల పేర్లు కూడా ప్రముఖంగా వినిపించాయి. కానీ ఈ కేసులో ప్రధానంగా వినిపించిన రాజకీయ నాయకులపై ఇప్పటివరకైతే ఎలాంటి చర్యలు లేవు. ముఖ్యంగా అధికారపార్టీకి చెందిన నాయకుల ఇన్వాల్వ్‌మెంట్‌ ఉందనే ఆరోపణల వల్లే.. కేసు తప్పుదోవ పడుతుందనే ఆరోపణలు కూడా ప్రతిపక్షాలు చేశాయి.

దర్యాప్తు పురోగతిపై హైకోర్టుకు సమర్పించిన సిట్‌ నివేదికలో.. పలువురు నాయకుల పేర్లు కనిపించాయి. శాసనమండలి డిప్యూటీ ఛైర్మెన్ నేతి విద్యాసాగర్, భువనగిరికి చెందిన చింతల వెంకటేశ్వర్‌రెడ్డితో పాటు.. మరికొందరి పేర్లను ప్రస్తావించారు. అయితే ఇప్పటివరకు ఈ విషయంలో ఎలాంటి పురోగతి ఎక్కడా కనిపించదు. ముఖ్యంగా.. నయీం కేసులో పెద్ద తలకాయలను తప్పించి.. చిన్నవారిని బలిచేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ప్రధాన ఆరోపణగా వినిపిస్తుంది. ఇప్పటికే రెండేళ్లు పూర్తి చేసుకున్న ఈ కేసు దర్యాప్తులో.. ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తుందో అంతుబట్టని విషయంగా చెబుతారు. ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసులకు క్లీన్ చీట్ ఇచ్చినట్లే.. త్వరలోనే రాజకీయ నాయకులు కూడా అదే దారిలో పక్కకు తప్పుకుంటారా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories