మాటల్లేవ్.. మాట్లాడుకోడాల్లేవ్

Submitted by arun on Fri, 03/09/2018 - 10:14
Narendra Modi

టీడీపీ మంత్రుల రాజీనామా అస్త్రం మొత్తానికి ఢిల్లీలో కదలిక తెచ్చినట్టే కనిపిస్తోంది. రాజీనామా నిర్ణయానికి ముందు ఫోన్‌లో కూడా అందుబాటులోకి రాని ప్రధాని మోడీ, చంద్రబాబు ప్రకటన తర్వాత స్వయంగానే ఫోన్ చేసి నచ్చజెప్ప బోయారు. ముఖాముఖి మాట్లాడుకుందామని ఆహ్వానించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీకి వెళ్లకపోవడమే ఉత్తమంగా భావిస్తున్నట్టు సమాచారం.

ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. బీజేపీ, టీడీపీ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలపైనే దేశమంతా చర్చ జరుగుతోంది.  సుజనా చౌదరి, అశోక్‌ గజపతిరాజు రాజీనామాలకి ముందు ప్రధాని మోడీ నుంచి చంద్రబాబుకు ఫోన్ వచ్చింది. 20 నిమిషాలపాటు ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఆ వెంటనే చంద్రబాబు అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసర సమావేశం జరిపారు. 

ప్రధానితో సంభాషణను మంత్రులతో పంచుకున్నారు. ఏపీకి అన్నీ ఇస్తున్నాం కదా అని ప్రధాని మోడీ అంటే.. ఇంకా చాలా పెండింగ్ లో ఉన్నాయని చంద్రబాబు అన్నారు. ఏపీకి చేయాల్సిన సాయం గురించి ఎన్నిసార్లు అడిగినా.. కేంద్రం నుంచి స్పందన రావడం లేదని చంద్రబాబు చెప్పారు. అయితే, కేంద్రమంత్రుల రాజీనామాల విషయంలో కొంత సమయం ఆగాల్సిందని ప్రధాని అన్నట్టు తెలుస్తోంది.

రాజీనామా నిర్ణయానికి ముందు ఫోన్‌ చేశానని చంద్రబాబు మోడీకి చెప్పారు. అందుబాటులోకి రానప్పుడు.. కొంత సమయం వేచి ఉండాల్సిందని ప్రధాని అభిప్రాయపడ్డారు. కేంద్రమంత్రి పదవులకు మాత్రమే రాజీనామా చేశాం..ఎన్డీయే నుంచి ఇంకా బయటకు రాలేదని చంద్రబాబు మోడీకి చెప్పినట్లు తెలుస్తోంది. సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు రాజీనామా లేఖలు సమర్పించేందుకు వెళ్లినప్పుడు.. ఇవే విషయాలు ప్రధాని మోడీ వారితో ప్రస్తావించినట్లు సమాచారం.

ప్రధాని మోడీతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత అందుబాటులో ఉన్న రాష్ట్ర మంత్రులతో చంద్రబాబు అత్యవసర సమావేశం నిర్వహించారు. హోదా సాధన కోసం ఎలా ముందుకెళ్లాలని చర్చించారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులను, ప్రజల ఆవేదనను ప్రధానికి వివరించినట్టు చంద్రబాబు తెలిపారు. మోడీ బాబును ఢిల్లీ రావాలని కోరినట్టు మంత్రి కాలువ శ్రీనివాసులు  చెప్పారు. అయితే ఢిల్లీ వెళ్లేదిలేదని, తన పార్టీ మంత్రుల రాజీనామాలను వెనక్కు తీసుకోలేమని ప్రధానికి చంద్రబాబు స్పష్టం చేశారు. 

English Title
Narendra Modi’s call fails to pacify Chandrababu Naidu

MORE FROM AUTHOR

RELATED ARTICLES