పరిటాల రవిని అందుకే రంగంలోకి దించాం: బాలయ్య

Submitted by arun on Thu, 01/11/2018 - 13:58
Balakrishna

నాడు పెనుగొండ ఏరియాలో అరాచక శక్తులు రాజ్యమేలుతుండగా తెలుగుదేశం పార్టీ పరిటాల రవిని రంగంలోకి దింపి ఆటకట్టించిందని సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.
గురువారం పెనుగొండలోని మడకశిర కూడలిలో దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టిన ఘనత ఎన్టీఆర్ ది అని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని అన్నారు. నాడు అరాచక శక్తులకు అడ్డాగా ఉన్న పెనుగొండలో నేడు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన ఎన్టీ రామారావు విగ్రహాన్ని నేనే ఆవిష్కరించడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. రాయలసీమలో పలు పరిశ్రమలు నెలకొల్పడంలో సీఎం చంద్రబాబునాయుడు విశేష కృషి చేస్తున్నారని బాలకృష్ణ పేర్కొన్నారు.

తెలుగు గంగ, హంద్రీనీవా సుజల స్రవంతి పథకాల ద్వారా రాయలసీమకు నీరందించాలని ఆనాడే ఎన్టీఆర్ కలలుగన్నారని చెప్పారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ కలలను నిజం చేశారని తెలిపారు. దీనికి తోడు కియా, బెల్ నాసన్ తదితర పరిశ్రమలను ఈ ప్రాంతానికి తీసుకొచ్చి, ఈ ప్రాంత అభివృద్ధికి పాటు పడుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా సినిమా డైలాగులు చెప్పి అందరినీ ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు, బాలయ్య అభిమానులు తరలి వచ్చారు.

English Title
Nandamuri Balakrishna About Paritala Ravi

MORE FROM AUTHOR

RELATED ARTICLES