"రైతేరాణి"

x
Highlights

వ్యవసాయం అనగానే అది మగాళ్ల జోన్ అనుకుంటారు. మహిళలు రాణించే రంగం కాదనే అభిప్రాయం కూడా బలంగానే ఉంటుంది. లెక్కలేనంత మంది మహిళలు వ్యవసాయరంగంలో పని...

వ్యవసాయం అనగానే అది మగాళ్ల జోన్ అనుకుంటారు. మహిళలు రాణించే రంగం కాదనే అభిప్రాయం కూడా బలంగానే ఉంటుంది. లెక్కలేనంత మంది మహిళలు వ్యవసాయరంగంలో పని చేస్తుంటారు. వాళ్లెవరినీ రైతులనలేం. కానీ మహిళల్లో రైతులున్నారని నిరూపిస్తున్నారు సూర్యపేటకు చెందిన శ్రీమతి శిల్ప. ఐదారు ఎకరాల్లో వ్యవసాయం చేయలేక అన్నదాతలు అవస్థలు పడుతున్న ఈరోజుల్లో 9 ఎకరాల్లో సేంద్రియ విధానంలో మల్బరీని సాగు చేస్తూ పట్టు పురుగుల పెంపకం చేపడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ మహిళా రైతు. అన్ని రంగాల్లోనూ మహిళలు రాణించగలరంటూ విజయపథంలో ముందుకు సాగుతోంది. మరి మహిళా దినోత్సవం సందర్భంగా పట్టు పరిశ్రమలో లాభాలబాటలో పయనిస్తున్న మహిళా రైతు శిల్పపై నేలతల్లి ప్రత్యేక కథనం

ఇంట్లో మగవారే సంపాదించాలి. ఆడవాళ్లు ఇంటి పనులకే పరిమితమవ్వాలి చాలా కుటుంబాల్లో కనిపించేది ఇదే. కానీ భర్తపై ఆధారపడకుండా తనకంటూ ఉపాధి ఉండాలనుకున్నారు శిల్ప. డిగ్రీ పూర్తి చేసిన శిల్ప ఇంటి పట్టున ఉండి ఏదో ఒక వ్యాపారం చేస్తే సరిపోతుందిలే అని అనుకోలేదు తనకు ఏమాత్రం అనుభవం లేని పట్టు పరిశ్రమవైపు అడుగులు వేసింది. అందులో మెళకవలను నేర్చుకుంది. అందులోనూ అందరికంటే భిన్నంగా పూర్తి సేంద్రియ విధానంలో మల్బరీని సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

పట్టుదల, కృషి విజయానికి సోపానాలు. ఈ మాటను ఎన్నోసార్లు విని ఉంటారు. ఎన్నో చోట్ల చదివుంటారు. శిల్ప జీవితంలో కృషి, పట్టుదల అడుగడుగునా కనిపిస్తాయి. ఆమె హాయిగా ఇంట్లోనే ఉంటూ కుటుంబ ఆలనాపాలనా చూసుకుంటూ కాలం గడిపేయొచ్చు. కానీ శిల్ప అలా ఆలోచించలేదు. స్వయం ఉపాధి పొందాలని నిర్ణయించుకుంది. తోటి మహిళలకు ఉపాధి కల్పించాలని భావించింది. పట్టుపురుగుల పెంపకంలో మెళకువలు నేర్చుకుంది. తన లక్ష్యం వైపు అడుగులేసి విజయంపథంలో ముందుకు కదులుతోంది

రైతు కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదివిన శిల్పా చిన్నప్పటినుంచి పల్లెటూరీ వాతవరణంలోనే పెరిగింది. శిల్ప అందరిలా కార్పొరేట్ ఉద్యోగాల వైపు ఎప్పుడూ చూడలేదు. సిటీ కల్చర్ కంటే అచ్ఛమైన పల్లెటూరి వాతావరణమంటేనే ఆమెకు ఇష్టం. వ్యాపార రంగంలో రాణించాలనుకున్న శిల్ప మొదట చీరల వ్యాపారం చేసింది. అయితే అందులో ఆమెకు సంతృప్తి దక్కలేదు..దీంతో వ్యవసాయ రంగంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది.

సూర్యపేట జిల్లా తిమ్మాపురం గ్రామంలో 9 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ నేలలు మల్బరీ సాగుకు అనుకూలమో కాదో తెలుసుకునేందుకు సాయిల్ టెస్ట్‌ను చేయించింది. మల్బరీ సాగుకు అనుకూలంగా నేలను తయారు చేసింది. మల్బరీ సాగును ప్రారంభించింది. కొంచెం స్థలంలో పట్టు ఛాకీ సెంటర్‌ను ఏర్పాటు చేసుకుంది. 2014 నుండి ఈ పట్టు పరిశ్రమలో కి అడుగుపెట్టిన శిల్ప తనకు తానుగా ఈ రంగంలో మెళకువలను తెలుసుకుంటూ ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తూ అందరి మన్ననలను పొందుతుంది.

ఒక మహిళగా ఈ పరిశ్రమలో ఎలా రాణిస్తారు అన్న సందేహాం మొదట అందరికీ వచ్చింది కానీ ఏ మాత్రం వెనుకంజ వేయకుండా తన భర్త రవీంధర్ ప్రోత్సాహాంతో ముందుకు సాగీ ఇప్పుడు తన కాళ్ల మీద తానే బ్రతుకుతూ పది మందికి ఉపాధి కల్పించే స్థాతికి చేరుకుంది. వ్యాపారం చేసేది సంపాదన కోసం కాదని పది మందిలో గర్వంగా బతకాలన్నదే తన కోరిక అని శిల్ప అంటోంది.

పట్టు పరిశ్రమలో ఛాకీ ప్రథాన ఘట్టం. ఉష్ణోగ్రత, తేమ, పారిశుద్యం, లేత మల్బరీ ఆకుల నాణ్యత, మంచి పెంపక వసతులు, అన్నిటికంటే మంచి సాంకేతిక నైపుణ్యత చాకీ పెంపకంలో ప్రముఖ స్థానం వహిస్తాయి. పట్టు పరిశ్రమలో అస్సలు ఏమాత్రం అనుభవం లేని శిల్ప ఛాకీ సెంటర్ నిర్వహణలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. అందుకే తెలంగాణ పట్టు పరిశ్రమ శాఖ శిల్పకు ఉత్తమ ఛాకీ సెంటర్ అవార్డును అందించింది.

ఉమ్మడి రాష్ట్రంలో పట్టు పరిశ్రమకి సంభందించి ఆంద్రప్రదేశ్ కే ఎక్కువ నిధులు కేటాయించేవారు ఇప్పటికే ఆంధ్రలో ఈ రంగం అభివృద్ధి చెందింది. ఇప్పుడిప్పుడే అదే స్థాయిలో తెలంగాణలో పట్టు పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది. ఈ రంగంలోకి వచ్చే వారికి ప్రభుత్వం సబ్సిడీలను కూడా అందిస్తోంది. కేంద్రి రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన ప్రోత్సాహంతో పట్టు పరిశ్రమలో రాణిస్తున్నారు శిల్ప.

పట్టు పరిశ్రమలో మొదటి రెండు దశలను ఛాకీ అంటారు. ఛాకీ స్థాయిలో సక్రమ పద్ధతుల్ని అవలంభించకపోతే పట్టుఉత్పత్తి నాణ్యమైనదిగా ఉండక నష్టాలకు దారితీసే పరిస్థితి రావచ్చు. అందుకే కేంద్ర పట్టు పరిశ్రమ శాఖ బెంగుళూరులో నిర్వహించిన శిక్షణ శిబిరాల్లో పాల్గొని పట్టు పురుగులు పెంపకంలో మెళకువలను తెలుసుకున్నారు ఈ మహిళా రైతు. ప్రతి నెల రెండు బ్యాచీలుగా ఒక్కో బ్యాచ్ కి తమ ఛాకీలో 5 వేల పట్టుగుడ్లను అభివృద్ధి చేస్తూ రైతులకు పట్టు పురుగులను అందిస్తున్నారు.

పట్టు పురుగులు సమృద్ధిగా పెద్ద సైజులో వుండేలా వీటికి కావలసిన మల్బరీ తోటను సాగు చేస్తున్నారు అందులోనూ పూర్తి సేంద్రియ పద్ధతిలో ఎక్కడా రసాయనాలు వినియోగించడం లేదు. పంట సాగుకు వేస్ట్ డీ కంపోజర్‌ను వినియోగిస్తున్నారు. దీని వల్ల మల్బరీ ఆకులో నీటి శాతం ఆకు సైజు మరింత పెద్దగా పెరుగుతుందని అంటున్నారు ఈ రైతు.

ఎగ్ దశలో వున్న చిన్న పురుగుల కోసం జీ2, పెద్ద పట్టు పురుగుల కోసం వీ1 మల్బరీ చెట్లను సాగుచేస్తున్నారు. ఆకులను కోసిన తరువాత వాటిని తడి బస్తాల్లో చుడతారు. పురుగులు ఆరోగ్యవంతంగా పెరిగేందుకు తెంపిన ఆకును సన్నగా కత్తిరించేందుకు ప్రత్యేకంగా ఎక్విప్‌మెంట్‌ను అర్చుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీతో చాప్ కట్టర్ ను కొని దాంతో ఆకులను సన్నగా కత్తిరించి పురుగులకు అందిస్తున్నారు. దీని వల్ల పురుగుల్లో ఎలాంటి అసమానతలు రావంటారు శిల్ప.

చాకీకి పొద్దున్న 8 గంటలకి. సాయంత్రం 6 గంటలకు ఫీడింగ్ ఖచ్చితంగా అందించాలంటారు శిల్ప దీని వల్ల పురుగు సైజు మంచిగా వచ్చి దిగుబడి బాగుంటుందంటారు శిల్ప. ఛాకీ నిర్వహణలో ప్రత్యేకతను చాటుకున్న శిల్పకు ఇటీవల తెలంగాణ పట్టు పరిశ్రమ శాఖ ఉత్తమ ఛాకీ సెంటర్ అవార్డు అందించింది.

తిండికి, బట్టకు సంబంధించి ఏ వ్యాపారంలోనైనా లోటుండదని చిన్నప్పటి నుంచి విన్న శిల్ప అదే బాటలో అడుగులు వేసింది. అందరిలా పత్తి సాగు చేసి నష్టాలను మూటగట్టుకోలేదు. లాభాలు అందించే పట్టు పరిశ్రమలో రాణిస్తోంది. మహిళలు వ్యవసాయం వైపు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందంటారు శిల్ప. ఓర్పులో, నేర్పులో మేటి అనిపించుకుంటున్న మహిళలు ఈ రంగంలో తప్పక రాణిస్తారంటోంది ఈ మహిళా రైతు.

మొదటి సారి పట్టు పురుగుల పెంపకం ద్వారా లక్షా 40 వేల రూపాయల ఆదాయం లభించింది. దీంతో ఎంతో సంతోషించిన విల్ప సెరీకల్చర్‌లో ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. మొదట రేరింగ్‌ , తరువాత ఏర్పాటు చేసుకున్న చాకీ సెంటర్లను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అందులో లాభాలను అందుకుంటున్నారు. రానున్న కాలంలో లీఫ్‌ టు క్లాత్‌ కాన్‌సెప్ట్‌ ను అమలు పరచాలనుకుంటున్నారు ఈ రైతు.
ప్రస్తుతం రేరింగ్ మీద లక్ష రూపాయలు, చాకీ మీద లక్ష రూపాయలను ఆర్జిస్తున్నారు. ఎంత ఆదాయం వచ్చిందన్నది కాదు స్పాట్ లో క్యాష్ వస్తుండడమే తనకు సంతోషంగా ఉందంటున్నారు శిల్ప.

మహిళలకు సెరీకల్చర్ ఎంతో అనుకూలమైనది. రెండు ఎకరాల భూమి ఉన్నా చాలు మహిళలు 50 వేలు సంపాదించుకోవచ్చు. మన డబ్బులు మనమే సంపాదించుకోవాలంటారు ఈ మహిళా రైతు. తెలంగాణలోని మహిళలకు పట్టు పరిశ్రమపై అవగాహన లేదు. ప్రభుత్వం కూడా ఈ రంగంలోకి కొత్తగా వచ్చే వారిని ఎంతో ప్రోత్సహిస్తోంది. రెండు ఎకరాల్లో మల్బరీ వేసుకుంటే. నెలకు పది వేల పెట్టుబడితో 60 నుండి 70 వేల వరకు సంపాదించవచ్చంటున్నారు.

అన్ని రంగాల్లో మహిళలు ముందుంటున్నారు. ఎందుకోగానీ వ్యవసాయంలోకి ముందుకు రావడం లేదు. ప్రకృతితో మమేకమై మహిళలు పంటల సాగు చేసినట్లైతే అద్భుతాలు సాధించవచ్చంటున్నారు ఈ మహిళా రైతు. ఓ వైపు కుటుంబ సభ్యుల ఆలనా పాలనా మరో వైపు పట్టు పరిశ్రమ నిర్వహణ అతి తక్కువ కాలంలో పట్టు పరిశ్రమలో రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు శిల్ప. మహిళలు ఏ రంగంలోనైనా విజయం సాధిస్తారని నిరూపిస్తున్నారు. రైతే రాజు అంటుంటారు అందరూ అలాగే భవిష్యత్తులో రైతే రాణి కావాలన్నది శిల్ప లక్ష్యం. ఆ దిశగా మహిళలు అడుగు వేస్తారని ఆశిద్దాం.

Show Full Article
Print Article
Next Story
More Stories