పార్టీని విలీనం చేస్తే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుంది

పార్టీని విలీనం చేస్తే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుంది
x
Highlights

తెలంగాణ టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలన్న మోత్కుపల్లి వ్యాఖ్యలు.. ఆ పార్టీలోనే గాక రాజకీయ విశ్లేషకుల్లోనూ చర్చకు దారి తీస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలన్న మోత్కుపల్లి వ్యాఖ్యలు.. ఆ పార్టీలోనే గాక రాజకీయ విశ్లేషకుల్లోనూ చర్చకు దారి తీస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలోనే గాక.. తెలంగాణ ఏర్పడే కీలకమైన దశలో కూడా మోత్కుపల్లి నరసింహులు.. కేసీఆర్ టార్గెట్ గా తీవ్రమైన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి టీడీపీని దెబ్బతీసే కుట్ర పన్నాయని విమర్శలు గుప్పించారు. అదే మోత్కుపల్లి టీడీపీ విలీనాన్ని ప్రతిపాదించడం ఆసక్తి రేపుతోంది.

ఎన్టీఆర్ 22వ వర్ధంతి సందర్భంగా టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు.. ఆ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలన్న వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగుతోంది. మోత్కుపల్లికి ముందు చాలా మంది టీడీపీ నాయకులు అదేపనిగా కేసీఆర్ మీద దుమ్మెత్తిపోసినా.. రాజకీయ భవిష్యత్తు కోసం టీఆర్ఎస్ లో చేరిపోయారు. మోత్కుపల్లి కూడా అదే తరహాలో.. ఇంకా అంతకన్నా ఘాటుగానే విమర్శలు గుప్పించారు. పరిమితకాలంలోనే టీడీపీ నాయకుల స్టాండ్ అందుకు పూర్తి భిన్నంగా మారిపోవడం పలు రకాల వ్యాఖ్యానాలకు తావిస్తోంది.

ఎన్టీఆర్ వర్ధంతి రోజున పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హైదరాబాద్ లో లేకపోవడం దగ్గర మొదలుపెట్టిన మోత్కుపల్లి.. ఇకపై తెలంగాణలో టీడీపీ బట్టకట్టే పరిస్థితి లేదని, ఆ బాధ్యత మోయగల నాయకుడు కూడా కనిపించడం లేదని, ఈ క్రమంలో పార్టీ మునిగిపోకముందే కనీసం టీఆర్ఎస్ లో విలీనం చేస్తే గౌరవంగా ఉంటుందన్నారు. కేసీఆర్ కూడా టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి.. ఆయన పార్టీలో కలిపితే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందని కూడా మోత్కుపల్లి అభిప్రాయపడ్డారు. ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలకు ప్రస్తుత వ్యాఖ్యలకు ఎంత తేడా ఉందో ఆయన మాటలే సాక్ష్యం. తాజా వ్యాఖ్యల వెనుక రాజకీయ ఉద్దేశాలేమీ లేవని మోత్కుపల్లి అంటున్నా... మాజీ టీడీపీ నేతల బాటలోనే ఆయన కూడా నడవక తప్పని పరిస్థితులు తెలంగాణలో చోటు చేసుకున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కేసీఆర్ ను మచ్చిక చేసుకునేందుకు మోత్కుపల్లి చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories