అయోధ్య కేసులో ఇవాళ సుప్రీంకోర్టు కీలక నిర్ఱయం..

Submitted by arun on Thu, 09/27/2018 - 10:57
sc

అయోధ్యలో రామమందిరం-బాబ్రీ మసీదు వివాదం కేసులో సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు వెల్లడించబోతోంది. కేసును రాజ్యాగ ధర్మాసనానికి నివేదించాలా? వద్దా? అనే అంశంపై తీర్పు ప్రకటించనుంది. అదే విధంగా ముస్లింలు ప్రార్థనలు ఎక్కడైనా చేయవచ్చా? ఖచ్చితంగా మసీదులోనే నమాజ్ చేయాలా? అనే అంశంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశముంది. 

అయోధ్య లో వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలు చేయాలంటూ 2010లో అలహాబాద్‌ కోర్టు వెల్లడించిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసును సీజేఐ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్, అబ్దుల్ నజీర్ విచారిస్తున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా అక్టోబరు 2న పదవీ విరమణ చేయనున్న జస్టిస్ దీపక్ మిశ్రాకు ఇదే చివరి తీర్పు కానుంది. సుప్రీంకోర్టులో మరో ఐదు పని దినాలే ఆయనకు మిగిలి ఉన్నాయి. 

దీపక్ మిశ్రా తన రిటైర్మెంట్‌కు ముందు ఆధార్ కేసు, సెక్షన్ 377, పదోన్నతుల్లో రిజర్వేషన్ల కేసు, నేర ప్రజా ప్రతినిధులపై నిషేధం, శబరిమల ఆలయ ప్రవేశంతో పాటు పలు కీలక కేసులను ఆయన విచారించారు. మిగతా కేసుల పోలిస్తే అయోధ్య వివాదం చాలా సంక్లిష్టమైన కేసు. రెండు మతాలకు చెందిన అంశం కావడంతో ఎటువంటి తీర్పు వెలువడుతుందోనని ఉత్కంఠ నెలకొంది.  

మసీదు ఇస్లాంలో అంతర్భాగం కాదని గతంలో ఇస్మాయిల్ ఫారూఖీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. నమాజ్ చేసుకునేందుకు ప్రత్యేకంగా ప్రార్థనా మందిరం అవసరం లేదని సుప్రీం ధర్మాసనం 1994లో స్పష్టం చేసింది. ఈ తీర్పును విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించడంపై నిర్ణయాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
 

English Title
Is Mosque Essential To Islam? Supreme Court's Ayodhya-Linked Verdict Today

MORE FROM AUTHOR

RELATED ARTICLES