పార్లమెంట్‌లో చెలరేగిపోయిన ప్రధాని మోడీ

Submitted by arun on Wed, 02/07/2018 - 14:13
modi

పార్లమెంట్‌లో ప్రధాని మోడీ చెలరేగిపోయారు. దేశంలో ఇన్ని సమస్యలకు కారణం కాంగ్రెస్సే అంటూ ఆ పార్టీని తూర్పారపట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించిన మోడీ కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్యంపై మాట్లాడే అర్హత లేదంటూ మండిపడ్డారు. తెలుగువారిని తీవ్రంగా అవమానించింది కాంగ్రెస్సే అంటూ దుయ్యాబట్టారు. ఆ అవమానాల నుంచే తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీకి జీవం పోశారని పార్లమెంట్‌లో ప్రస్తావించారు.

ఆంధ్రప్రదేశ్‌ విభజన పూర్తిగా అప్రజాస్వామికంగా జరిగిందన్నారు మోడీ. చట్టసభ తలుపులు మూసేసి ఏపీని విభజించారన్నారు. వాజ్‌పేయి హయాంలో మూడు రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత తలెత్తని ఇబ్బందులు ఏపీ విషయంలో కాంగ్రెస్‌ పాలన లోపం వల్లే తలెత్తుతున్నాయని విమర్శించారు. ఏపీ విభజన ఆద్యంతం విధి విధానాలు పాటించకుండా జరిగిందని దుయ్యబట్టారు. ఏపీ విభజన సమయంలో కాంగ్రెస్ తీరు వల్లే రాష్ట్రానికి ఇప్పుడు సమస్యలు వచ్చాయని, రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా కాంగ్రెస్ మోసం చేసిందని మోదీ మండిపడ్డారు. 

ఎన్డీయే ప్రభుత్వం మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసిందని, అప్పుడు ఏ రాష్ట్రానికీ ఇలాంటి అన్యాయం జరగలేదన్నారు మోడీ.  ఎవరికి ఇవ్వాల్సినవి వారికి ఇవ్వడం వల్ల అప్పట్లో సమస్య రాలేదని, అలాంటి మహోన్నత చరిత్ర ఎన్డీయేదన్నారు. రాజకీయ ప్రయోజనాలు కాకుండా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అప్పట్లో కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్‌ తలుపులు మూసి హడావుడిగా ఏపీని విభజించిందని మోడీ ఆరోపించారు.
 
రెండు రాష్ట్రాలకూ న్యాయం జరుగుతుందనే తెలంగాణ ఏర్పాటుకు మద్దతిచ్చామన్నారు మోడీ. ఏపీకి అండగా ఉంటామని చెప్పారు. టీడీపీ ఎంపీల ఆందోళనపై నేరుగా కామెంట్ చేయని ప్రధాని మోదీ.. సభా కార్యక్రమాలకు అడ్డు తగలాలని ఎవరు అనుకున్నా పార్లమెంట్‌కు అది శ్రేయస్కరం కాదని హితవు పలికారు. 

English Title
modi targets congress loksabha

MORE FROM AUTHOR

RELATED ARTICLES