ప్రాణాలు తీస్తున్న పుకార్లు

ప్రాణాలు తీస్తున్న పుకార్లు
x
Highlights

చెడ్డీ గ్యాంగ్ , పార్థీ గ్యాంగ్ పుకార్లను నమ్మొద్దని పోలీసులు చెబుతున్నా...జనానికి ఎక్కడం లేదు. ఇంకా బీహార్ గ్యాంగ్ వదంతుల భయం గుప్పిట్లో...

చెడ్డీ గ్యాంగ్ , పార్థీ గ్యాంగ్ పుకార్లను నమ్మొద్దని పోలీసులు చెబుతున్నా...జనానికి ఎక్కడం లేదు. ఇంకా బీహార్ గ్యాంగ్ వదంతుల భయం గుప్పిట్లో గడుపుతున్నారు. చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే బీహారీ గ్యాంగ్ సంచరిస్తోందన్న సోషల్ మీడియా ప్రచారంతో కొన్ని గ్రామాల్లో నిద్రాహారాలు మాని జాగారం చేస్తున్నారు జనం. దండుపాళ్యం టైపు అరాచకాలు చేసే ఈ గ్యాంగ్ ఊళ్లల్లో తిరుగుతోందన్న ప్రచారంతో అలర్ట్ అయిన గ్రామస్తులు గుర్తు తెలియని వ్యక్తులు కనబడితే చాలు చితకబాదుతున్నారు.

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం చేంగల్ గ్రామంలో దొంగలు అనుకుని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను గ్రామస్తులు చితకబాదారు. గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని బందించి తీవ్రంగా కొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్ధలానికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఒకవ్యక్తి మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు చేంగల్ గ్రామ సమీపంలోని గిరిజన తాండకు చెందిన మాలవత్ దేవ్యా, మెగావల్ బాలుగా పోలీసులు గుర్తించారు.

ఇటు వికారాబాద్ జిల్లా గాజీపూర్ లో అనుమానంగా తిరుగుతున్న నలుగురిని గ్రామస్తులు నిలదీయగా అక్కడి నుంచి పారిపోయారు. పారిపోతున్న వారిని వెంబడించి ఒకరి పట్టుకుని విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు యాదాద్రి జిల్లా జియాపల్లిలో దొంగ అనుకుని బాలకృష్ణ అనే వ్యక్తిని చితకబాదారు. తీవ్రంగా గాయపడ్డ బాలకృష్ణ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

కిడ్నాపర్లు, హంతకులు రాత్రిపూట తిరుగుతూ దోపిడీలు, హత్యలకు పాల్పడుతున్నారనే పుకార్లను నమ్మొద్దని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. సోషల్ మీడియాలోని వదంతులు పుకార్లు నమ్మి అమాయకులు, మతిస్థిమితం లేనివాళ్లపై దాడి చేయవద్దన్నారు. అనుమానమొస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి కాని లా అండ్ ఆర్డర్ ని చేతుల్లోకి తీస్కోవద్దని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories