అబలలపై ఎన్నాళ్లీ అరాచకాలు?

Submitted by arun on Sat, 01/06/2018 - 13:31

జనారణ్యంలో మానవ మృగాలు విచ్చల విడిగా తిరుగుతున్నాయ్.. విశృంఖలంగా ప్రవర్తిస్తున్నాయ్. ఉద్యోగం కోసం,ఆర్థిక అవసరం కోసం బయటకొచ్చే అమాయక లేడి పిల్లలను వెంటాడి వేధిస్తున్నాయ్.. దొరకబుచ్చుకుని మాన,ప్రాణాలను హరిస్తున్నాయ్.. సభ్య సమాజంలో యధేచ్ఛగా తిరుగుతున్న  ఈ మేకవన్నె పులులను ఏంచేయాలి? ఎప్పటికప్పుడు ఆత్మరక్షణతో,ఎదురు దాడి చేస్తూ తప్పించుకు తిరగాల్సిన ఖర్మ ఆడపిల్లలకి ఎన్నాళ్లు? ఆడపిల్ల ఓర్పును, సహనాన్ని, మంచితనాన్ని.. అసహాయతగా తీసుకునే ఆటవిక మృగాలను ఏం చేయాలి?సమాజంలో పేరు, డబ్బు, పలుకుబడి.. నలుగురిలో గుర్తింపు.. పురుషాహంకారంతో విర్రవీగే కొందరికి ఇదే లైసెన్స్..ఇదే పెట్టుబడి.. ఈ అహంకారాన్నే ఆస్తిగా పెట్టి.. ఆడపిల్లల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారు.. అవసరంలో ఉన్న వాళ్లు ఏమన్నా పడుంటారనే సంకుచిత ఆలోచనలే వీరిని అహంకారులుగా మార్చేస్తున్నాయి.

చెప్పేవి ఆధ్యాత్మిక బోధనలు.. పాడేవి హిందూ ధర్మం.. సంస్కృతిని కాపాడే పాటలు.. కానీ చేేసేవి మాత్రం.. గలీజు పనులు.. సమాజంలో పెద్ద మనిషిలా చెలామణీ అవుతూ.. ఆడది కనిపిస్తే చాలు.. ఆవురావురు మనే చూపులతో మాటలతో వేపుకు తినే క్రూర మృగాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రముఖ గజల్ గాయకుడు కేసిరాజు శ్రీనివాస్ వికృత కామకేళీ రూపం  చూసిన సభ్యసమాజం అవాక్కయ్యింది.. నివ్వెర పోయింది.. నిలువెల్లా కుప్ప కూలింది.. నిరంతరం హిందూ ధర్మ పరిరక్షణ, ఆలయాలను రక్షిస్తామంటూ ప్రచారం చేస్తున్న వ్యక్తి లో రెండో కోణం ఇంత వికృతంగా ఉంటుందా అని సమాజం ఉలిక్కి పడింది..ఉద్యోగం కోసం, కుటుంబ పోషణ కోసం.. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడం కోసం.. సమాజంలో తానూ ఆత్మ గౌరవంతో సంపాదించుకునే మహిళగా స్థిరపడాలన్న సంకల్పంతో  అడుగులేసే ఆడపిల్లలకు ఎంత కష్టం? 

పైకి కనిపించని విష నాగులు  మాయమాటలతో రొంపిలోకి దించేందుకు చేసే కుటిల యత్నాలు.. వెకిలి వేషాలను తట్టుకుని, ఎదిరించి నిలబడాలంటే నేటి సమాజంలో ఆడపిల్లకు ఎంత ధైర్యముండాలి? 
చేసేది గౌరవ ప్రదమైన వృత్తి.. సమాజాన్ని తన పాటలతో, మాటలతో చైతన్యపరచి, సందేశమిస్తూ హిందూ ధర్మాన్ని కాపాడాలనే పవిత్రాశయంతో అడుగులేయాల్సిన వ్యక్తి.. అంతర్గత చరిత్ర ఇంత క్రూరంగా ఉంటుందా? వీడియో, ఆడియో ఆధారాలతో దొరికి పోయాడు కాబట్టి.. ఈ వంచకుడి వికృతాన్ని చూశాం.. మన సమాజంలో ఇలాంటి మేకవన్నె పులులు ఇంకెతమంది ఉన్నారో?దొరికితేనే దొంగలు.. దొరక్క పోతే దొరలే.. ఎన్ని సంఘటనలని చెప్పాలి.. ఆడపిల్లల ఆత్మ ఘోషలకు ఆధారాలు ఎన్నని చూపాలి? ఆడదంటే.. ఎందుకింత అలుసు..ఉద్యోగం కోసం.. వ్యాపారం కోసం, చదువుకోసం, ఇలా అనేకానేక కారణాలతో రోజూ బయటకొస్తున్న ఆడకూతుళ్లు ఎన్ని కష్టాలు పడుతున్నారో? ఎంత వేదనను పళ్ల బిగువన భరిస్తున్నారో?

విశాఖలో ఓ మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించాడో కీచకుడు.. చేసేది పవిత్రమైన పోలీస్ ఉద్యోగం.. నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యతాయుతమైన ఉద్యోగం. అసహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లల ఆత్మ గౌరవాన్ని కాపాడాల్సిన ఈ సిఐకి పోయేకాలం దాపురించింది... న్యాయం కోసం వచ్చిన ఓ మహిళపైనే కన్నేశాడు.. ప్రేమించిన ప్రియుడు మోసగించాడని.. అతగాడిని పట్టుకుని, మందలించమని అడిగిన పాపానికి ఆ ఆడకూతురిని లోకువగా చూశాడు సిఐ.. ముందు మాయమాటలతో నమ్మించాడు.. ఒంటరిగా హోటల్ రూమ్ లో ఉన్న అమ్మాయిని కేసు పేరు చెప్పి కలుసుకుని ఆమెపై ఏకంగా లైంగిక దాడికే ప్రయత్నించాడు విశాఖ త్రిటౌన్ సిఐ బెండి వెంకట్రావు. సిఐ వికృత మనస్తత్వాన్ని గ్రహించిన బాధిత మహిళ తెలివిగా ఆడియో, వీడియో సాక్ష్యాలను రికార్డు చేసి సిపికి ఫిర్యాదు చేసింది. ఆధారాలతో దొరికి పోడంతో   సిఐపై సస్పెన్షన్ వేటు పడింది.

విశాఖలో సమాజం తలదించుకునే ఘటన మరొకటి జరిగింది. మూగ బాలికపై ఓ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు..అసలే మాటలు రాని ఆ బాలిక తనకు జరిగిన అన్యాయాన్ని తన సోదరుడికి సైగలతో తెలియ చేసింది. బాలికపై అత్యాచారమే దారుణమంటే ఆ బధిర బాలిక శీలానికి వెలకట్టారు కొందరు నీచులు. విశాఖలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఈ అఘాయిత్యం జరిగింది. విధులు ముగించుకొని ఇంటికెళ్తున్న గిరిజన బదిర బాలికపై బస్సు డ్రైవర్ విశ్వనాథ్ అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు బాలిక శీలానికి వెలకట్టాడు. ఈ విషయం ఎవరితో చెప్పొద్దని లక్షన్నర ఇచ్చే ప్రయత్నం చేశాడు.

English Title
Men sexually Harassing Woman

MORE FROM AUTHOR

RELATED ARTICLES