అడవిలో అన్నలు... ఆదాయంలో మిన్నలు

అడవిలో అన్నలు... ఆదాయంలో మిన్నలు
x
Highlights

పెద్దోడిని కొట్టు పేదోడికి పంచు నినాదాన్ని మావోయిస్టులు ఆచరణలో చూపడం లేదా ? క్షేత్రస్ధాయిలో కార్యకర్తల పోరాటం అధినాయకత్వంలోని కొందరు నాయకులకు ఆదాయ...

పెద్దోడిని కొట్టు పేదోడికి పంచు నినాదాన్ని మావోయిస్టులు ఆచరణలో చూపడం లేదా ? క్షేత్రస్ధాయిలో కార్యకర్తల పోరాటం అధినాయకత్వంలోని కొందరు నాయకులకు ఆదాయ వనరుగా మారిందా ? సహచరులు అడవుల్లో పోరాడుతుంటే ... అధినేతలు మాత్రం విలాసవంతమైన జీవితం గడుపుతున్నారా ? కోట్లాది రూపాయలతో బ్యాంకు బ్యాలెన్స్‌లను కుటుంబ సభ్యులకు అందిస్తున్నారా ? అంటే అవుననే అంటోంది కేంద్ర హోంశాఖ తాజా నివేదిక.

మావోయిస్టులు ... పేరు వినగానే కనిపించేంది ఎర్రజెండా... గుర్తొచ్చేది పేదల అజెండా. నవ నాగరిక సమాజానికి దూరంగా అడవుల నుంచి పోరాటం చేస్తున్న అన్నల రాజ్యంలో కూడా త్యంత విలాసవంతమైన జీవితాలు గడుపుతున్న వారున్నట్టు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. అధినాయకత్వంలో ఉన్న కొందరు పెద్దలు పెద్దమొత్తంలో ఆస్తులను కూడబెట్టుకున్నారని, ఇదంతా దోపిడీ సంపాదనేనంటూ వెల్లడించింది. ఈ నివేదికలో కొందరు కోటీశ్వరులుగా ఎదగ్గా, మరికొందరు తమ కుటుంబీకుల ఉన్నత చదువుల కోసం లక్షల్లో ఖర్చుచేస్తున్నట్టు తెలిపింది.

మావోయిస్టు పార్టీ బీహార్-జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు ప్రద్యుమ్నకుమార్ తన మేనకోడలుకు స్థానిక వైద్య కళాశాలలో అడ్మిషన్‌కు 22 లక్షలు చెల్లించినట్టు వెల్లడించారు. బిహార్, జార్ఖండ్ పరిధిలో 37 లక్షల విలువైన వ్యవసాయ భూములు ఈయన పేరు ఉన్నట్టు గుర్తించారు. మరో సభ్యుడు సందీప్ యాదవ్ తన కుమారుడు, కూతురుకు స్థానికంగా ఉన్న కార్పోరేట్‌ ఇంజినీరింగ్ కాలేజీలో డొనేషన్లతో అడ్మిషన్లు తీసుకున్నట్టు గుర్తించారు. పార్టీ సీనియర్ నేత అరవింద్ యాదవ్ తన సోదరుడి కుమారుడి కోసం ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో 12 లక్షలు చెల్లించాడని నివేదికలో వెల్లడించారు. పెద్దనోట్ల రద్దు సమయంలో సందీప్ యాదవ్ సుమారు 15 లక్షల నగదు మార్చుకున్నట్టు కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఈయనకు రాంచీ లో 30 లక్షల విలువచేసే ఫ్లాట్, రియాల్టీలో సుమారు 50 లక్షల వరకు పెట్టుబడులున్నట్టు గుర్తించారు.

అగ్రనాయకులుగా ఉన్న వీరంతా బలవంతపు వసూళ్ల ద్వారానే ఆర్ధిక వ్యవహారాలు నడుపుతున్నట్టు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. గిరిజన ప్రాంతాల్లో పని చేసే కాంట్రాక్టర్లు, రవాణాదారులు, పారిశ్రామికవేత్తలను బెదిరించి ఆస్తులు కూడబెట్టుకుంటున్నారంటూ తెలిపింది. అనధికార మైనింగ్, స్టోన్ క్రషింగ్, తెండు పట్టాదారులను భయపెట్టి దోచుకుంటున్నారంటున్నట్టు నివేదికలో పేర్కొంది. మావోయిస్టుల ఆర్ధిక వనరులపై పూర్తి స్ధాయిలో దర్యాప్తు నిర్వహించిన కేంద్ర హోంశాఖ ఈ విషయాలను వెల్లడించింది. క్షేత్రస్ధాయిలో కార్యకర్తలు జరుపుతున్న పోరాటానికి ..అధినాయతక్వంలోని కొందరు పాటిస్తున్న సిద్ధాంతాలకు పొంతన లేదంటున్నారు సీనియర్ పోలీసు అధికారులు. అయితే ఇదంతా ఓ బూటకపు నివేదిక అంటూ తప్పుబడుతున్నారు ప్రజా సంఘాల నేతలు. నమ్మిన సిద్దాంతాల కోసం పోరాడుతున్న వారిని దెబ్బతీసే భాగంగా కుట్ర జరుగుతుందోన్నారు. ప్రజల నుంచి ఉద్యమాన్ని దూరం చేసేందుకు ఇలాంటి నివేదికలు విడుదల చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories