నిజామాబాద్‌ రూరల్ బరిలో మండవ..?...కాంగ్రెస్ ఆశావాహుల్లో టెన్షన్

Submitted by arun on Thu, 09/20/2018 - 17:33
mandava venkateswara rao

ఆ సీటు కోసం ఒకరు టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. మరొకరు ఎమ్మెల్సీగా ఉంటూ అధికార పార్టీని వీడి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే సంకల్పంతో హస్తం గూటికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్న మరో ఇద్దరు ముగ్గురు నేతలు ఆ టికెట్టు ఆశతో కష్టాల్లోనూ కాంగ్రెస్‌ను అంటిపెట్టుకుని గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ అందరి ఆశలను అంచనాలను తారుమారు చేస్తూ పొత్తుల్లో భాగంగా ఆ సీటును టీడీపీ కోరుకుంటోంది. మాజీ మంత్రి మండవను బరిలోకి దింపాలని భావిస్తోంది. దాంతో కాంగ్రెస్‌ ఆశావాహుల్లో టెన్షన్ నెలకొంది.

ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో మరోసారి పసుపు జెండా పాతాలని టీడీపీ వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికీ ఇక్కడ టీడీపీకి ఓటు బ్యాంకు బలంగా ఉండటం తెలుగుదేశం తరపున మండవ వెంకటేశ్వర్రావు పోటీచేస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీ అంతర్గత సర్వేలో తేలడంతో నిజామాబాద్‌ రూరల్‌పై టీడీపీ ఆసక్తి చూపుతోంది. మహాకూటమి పొత్తుల్లో భాగంగా ఈ సీటును తమకు కేటాయించాలని కోరుతోంది. 

అయితే రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన మండవ మారిన తాజా రాజకీయాలతో పోటీకి సై అంటున్నట్లు తెలుస్తోంది. అయితే నిజామాబాద్‌ రూరల్‌లో టీఆర్‌ఎస్‌ నుంచి బాజిరెడ్డి గోవర్దన్‌ బరిలో ఉండగా, ఇటీవల టీఆర్‌ఎస్‌ నుంచి హస్తం గూటికి చేరిన భూపతిరెడ్డి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. అలాగే అరికెల నర్సారెడ్డి, నగేష్‌రెడ్డి, భూమారెడ్డి కూడా కాంగ్రెస్‌ తరపున టికెట్‌ ఆశిస్తున్నారు. అయితే పొత్తుల్లో భాగంగా నిజామాబాద్‌ రూరల్‌ను టీడీపీకి కేటాయిస్తే మాత్రం వీళ్లందరి ఆశలు అడియాశలు కావడం ఖాయం. ముఖ్యంగా టికెట్‌ ఆశించి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ఆశలు గల్లంతు కానున్నాయి.

సుదీర్ఘ రాజకీయ అనుభవం, మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, సెటిలర్ల ఓట్లు, చెక్కు చెదరని క్యాడర్‌ మండవకు ఉండటంతో ఈ సీటు కోసం టీడీపీ పట్టుబడుతోంది. అయితే నిజామాబాద్‌ రూరల్‌ నుంచి మండవ బరిలోకి దిగితే పోటీ రసవత్తరంగా ఉంటుందనే మాట వినిపిస్తోంది.

English Title
mandava venkateswara rao may contest from nizamabad

MORE FROM AUTHOR

RELATED ARTICLES