సిద్ధిపేట జిల్లాల్లో ప్రసిద్ధి క్షేత్రంగా వెలుగొందుతున్న కొమురవెళ్లి

Submitted by arun on Sun, 12/17/2017 - 12:05
Mallanna Kalyanam

భక్తుల కొంగు బంగారంగా వెలుగుగొందుతున్న కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవం ఇవాళ అంగరంగవైభవంగా జరగనుంది. సిద్ధిపేట జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న మల్లన్న ఆలయం తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం. దీంతో మల్లన్న కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ఆలయ అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు.

కొమురవెల్లి మల్లన్న ఆలయం 650 ఏళ్ల పూర్తం నుంచే ఉన్నట్లు చరిత్ర ఆనవాళ్లు చెబుతున్నాయ్. ఆలయ సమీపంలో మొఘల్ చక్రవర్తి హుమయూన్‌ సిక్కా దొరకడంతో హుమాయూన్‌ కాలం కంటే ముందు నుంచే ఆలయం ఉన్నట్లు తెలుస్తోంది. ఆలయాన్ని రాజులు నిర్మించలేదని స్వామి వారే స్వయంగా వెలిసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. కైలాసంలోని పరమశివుడే మల్లికార్జున స్వామి రూపంలో కొమురవెల్లిలో వెలిసినట్లు భక్తులు నమ్మకం. 

స్వామి వారి గర్భగుడికి వెళ్లే దారిలో ముందు మెట్ల పక్కన ఉన్న ఒళ్లు బండకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులంతా ఒళ్లుబండ వద్ద తప్పనిసరిగా ధ్యానిస్తారు. బండ ముందు కూర్చొని రెండు చేతుల బొటనవేళ్లు ఒకదానిపై ఒకటి బండపై పెట్టి తమ మనసులో అనుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. రాజగోపురం నుంచి దేవాలయానికి వెళ్లే దారిలో ఉన్న గంగరేగు చెట్టును భక్తులు పవిత్రంగా పూజిస్తారు. ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడు ముందుగా గంగరేగు చెట్టు పూజలు చేసి ముడుపును కట్టి స్వామి వారిని దర్శించుకుంటారు. 

ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం కొమురవెల్లి మల్లన్న కల్యాణం నిర్వహిస్తారు. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం మొదలుకొని ఉగాది పండుగ ముందు వచ్చే ఆదివారం వరకు ఉత్సవాలు కొనసాగుతాయి. అనేక మంది భక్తులు ప్రత్యేకంగా రంగుల అంగీలు, గజ్జెల లాగులు, టోపీలు ధరించి ఒంటికి పసుపు రాసుకొని చేతిలో కొరడాలతో ఉత్సాహంగా గంతులు వేస్తూ స్వామి వారి దర్శనం చేసుకుంటారు. అలంకరించిన కుండలతో బోనం చేసి తలపై పెట్టుకుని నృత్యం చేస్తూ మొక్కులు తీర్చుకుంటారు.

అన్ని ఆలయాల్లో కుంకుమ ఉపయోగిస్తే ఇక్కడ మాత్రం పసుపు వాడతారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు, ఇతర సందర్భాల్లోనూ క్వింటాళ్ల కొద్ది పసుపును వినియోగిస్తారు. పసుపు బొట్టుగా పెట్టుకోవడంతో పాటు దానిని ప్రసాదంగా నోట్లో వేసుకోవడం అనవాయితీ. అంతేకాకుండా దెయ్యం, భూతాలు పట్టిన వారికి స్వామి వారి పసుపు నుదుటన పెడితే అవి మాయం అవుతాయని నమ్మకం. అంతేకాకుండా స్వామి పసుపును నోట్లో వేసుకుంటే రోగాలు తగ్గిపోవడంతో పాటు ఆరోగ్యం తయారవుతారని భక్తుల నమ్మకం.

English Title
Mallanna Kalyanam in Komuravelli

MORE FROM AUTHOR

RELATED ARTICLES