పురుషులకో కమిషన్‌.. మిషన్‌ వైఫ్‌ స్టార్ట్‌ అయినట్టేనా?

పురుషులకో కమిషన్‌.. మిషన్‌ వైఫ్‌ స్టార్ట్‌ అయినట్టేనా?
x
Highlights

పురుషుల బాధలు, గాథలు వినేందుకు ఒక కమిషన్‌ ఉండాలి. మగవారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఉండాలి. భార్యల హింస నుంచి భర్తలను కాపాడేందుకు ప్రభుత్వం...

పురుషుల బాధలు, గాథలు వినేందుకు ఒక కమిషన్‌ ఉండాలి. మగవారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఉండాలి. భార్యల హింస నుంచి భర్తలను కాపాడేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఏంటీ వింతగా, విడ్డూరంగా ఉందా...పురుషులేంటి కమిషన్లేంటి....భార్యల నుంచి వారిని రక్షించడమేంటని అనుకుంటున్నారా...అవును. ఇవన్నీ నిజంగా నిజం. అంతేకాదు ఇవన్నీ డిమాండ్లు చేసింది కూడా ఓ మహిళా నాయకురాలన్నది కూడా నిజం. స్త్రీలల్లో ఇలాంటి క్రూరత్వాలు పెరగడానికి, సీరియల్సే కారణమని కూడా ఆ నాయకులు ఫైర్‌ అవుతున్నారు.

భర్తలపై వరుసగా జరుగుతున్న ఇలాంటి దారుణాలు చూసి తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. మహిళలేంటి..భర్తలను చంపడమేంటి..చంపించడమేంటని అవాక్కయ్యారు. బహుశా ఇలాంటి ఘటనలే, ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ నన్నపనేని రాజకుమారినీ కదిలించాయేమో...మగవారి గోడు వినేవారులేరని మథనపడ్డారేమో...భార్యల నుంచి భర్తల రక్షణకూ ప్రత్యేక వ్యవస్థ ఉండాలని డిమాండ్ చేశారు నన్నపనేని రాజకుమారి. మహిళా కమిషన్ తరహాలోనే పురుషుల కమిషనూ ఉండాలని డిమాండ్‌ చేసి, కొత్త చర్చకు తెరతీశారు.

పురుషులకూ కమిషన్‌ ఉండాలన్న చర్చ, ఇప్పటిది కాదు. ఎందరో భార్యా బాధితులు దశాబ్దాలుగా, అప్పుడప్పుడు డిమాండ్ చేస్తున్నదే. సెక్షన్ 498ఏతో పాటు అనేక స్త్రీల పక్షపాత చట్టాలు, పురుషుల పాలిట పాశుపతాస్త్రాలుగా మారుతున్నాయని ఎందరో భార్యా బాధితులు గొంతెత్తారు. తమ మాదిరి, బాధను బయటకు చెప్పుకోలేడని అలుసుగా తీసుకుంటున్న భార్యలు, తమకు రక్షణ కల్పించే చట్టాలతో వారిని భర్తలను భక్షిస్తున్నారని మరెందరో గోడు వెళ్లబోసుకున్నారు. సీవీఎల్‌ నరసింహారావు వంటి భార్యాబాధిత సంఘాల నాయకులు, నన్నపనేని రాజకుమారి వాదనకు మద్దతు ప్రకటించారు.

ప్రపంచవ్యాప్తంగా స్త్రీల కన్నా, పురుషుల ఆత్మహత్యలే ఎక్కువని చాలా సర్వేలు ఘోషిస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లోనూ రకరకాల కారణాలతో మగవారి సూసైడ్స్‌ సంఖ్య పెరుగుతోందని స్వయంగా క్రైమ్ బ్యూరో రికార్డ్స్ చెబుతున్నాయి. అంతేకాదు, ఈమధ్య భర్తలను చంపే భార్యల ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో పురుషులకూ ఓ కమిషన్‌ ఉండాలంటున్న నన్నపనేని రాజకుమారి వాదన, ఒక చర్చనైతే సమాజం ముందు పెట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు కూడా రాశానంటున్న నన్నపనేని డిమాండ్‌ను మరి సర్కారు పెద్దలు ఆలోచిస్తారో, మగాడేంటీ...కమిషనేంటి అని ఊరుకుంటారో కాలమే సమాధానం చెప్పాలి. కానీ బాధితులు ఎవ్వరైనా, బాధితులేనన్న చర్చ మాత్రం నిత్యం జరుగుతూనే ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories