డ్రైవర్‌లెస్ ట్రాక్టర్లు రాబోతున్నాయి!

డ్రైవర్‌లెస్ ట్రాక్టర్లు రాబోతున్నాయి!
x
Highlights

ఇన్నాళ్లూ డ్రైవర్‌లెస్ కార్ల గురించి విన్నాం. గూగుల్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీ ఆ కార్లను అందుబాటులోకి తేవాలని భావించింది. టెస్ట్ డ్రైవ్ కూడా చేసింది....

ఇన్నాళ్లూ డ్రైవర్‌లెస్ కార్ల గురించి విన్నాం. గూగుల్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీ ఆ కార్లను అందుబాటులోకి తేవాలని భావించింది. టెస్ట్ డ్రైవ్ కూడా చేసింది. అవి రోడ్లపై తిరగడంతో పాటు జనంపైకి కూడా వెళుతుండటంతో ప్రస్తుతానికి ఆ ప్రయత్నాలను పక్కన పెట్టింది. అయితే ఇప్పుడు కొత్తగా డ్రైవర్‌లెస్ ట్రాక్టర్లు రాబోతున్నాయి. ట్రాక్టర్ల తయారీలో, అమ్మకాల్లో మహీంద్ర కంపెనీ స్థానమేంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆటోమొబైల్స్ రంగంలో దూసుకుపోతున్న మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీ ఈ వినూత్న ప్రయోగం చేసింది. మహీంద్ర మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గొయెంకా స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. డ్రైవర్ అసిస్ట్ ట్రాక్టర్‌ను 2018లో మార్కెట్లోకి తెస్తామని, 2019లో పూర్తి స్థాయిలో డ్రైవర్‌లెస్ ట్రాక్టర్లను అందుబాటులోకి తెస్తామని గొయెంకా తెలిపారు. ఈ ట్రాక్టర్లను మహీంద్ర రీసెర్చ్ వ్యాలీలో అత్యాధునిక టెక్నాలజీతో తయారుచేయనున్నట్లు చెప్పారు. డ్రైవర్‌లెస్ ట్రాక్టర్లను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ ఆమోద ముద్ర కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు పవన్ గొయెంకా తెలిపారు. అయితే ఈ ట్రాక్టర్లు ఎక్కువ ఖరీదే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

తయారీలో వినియోగించిన కొన్ని ట్రాక్టర్ భాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నామని, పైగా వినూత్న సాంకేతికతతో వీటిని రూపొందించినట్లు తెలిపారు. ఈ డ్రైవర్‌లెస్ ట్రాక్టర్‌ విశిష్టతలను ఆయన వివరించారు. జీపీఎస్ ఆధారిత టెక్నాలజీతో ఈ ట్రాక్టర్ పనిచేస్తుందని చెప్పారు. లాక్ సిస్టమ్‌ను వినియోగించుకుని పొలంలో నుంచి ట్రాక్టర్ బయటికెళ్లకుండా నిలిపివేయొచ్చని ఆయన తెలిపారు. రిమోట్ ఇంజన్ ఆప్షన్‌తో ట్రాక్టర్‌ను స్టార్ట్ లేదా స్టాప్ చేయొచ్చని మహీంద్ర మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గొయెంకా వివరించారు. ఈ ట్రాక్టర్లు అందుబాటులోకి వస్తే వ్యవసాయ రంగంలో మరో సరికొత్త మార్పుకు నాంది పలికినట్లే అవుతుంది. ఇవి పూర్తి స్థాయిలో తయారై, విజయవంతంగా టెస్ట్ డ్రైవ్‌లు పూర్తి చేసుకుంటే గానీ వీటి వినియోగంపై ఓ అంచనాకు రాలేమని చెప్పక తప్పదు.

Show Full Article
Print Article
Next Story
More Stories