మహాకూటమి సీట్ల సర్దుబాటు చర్చల్లో ప్రతిష్టంభన

Submitted by chandram on Sun, 11/11/2018 - 10:38

మరికొన్ని గంటల్లో ఎన్నికల నోటిఫికేషన్‌‌ విడుదలవుతున్నామహాకూటమి సీట్ల సర్దుబాటు చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ మిత్రపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తాము కోరిన నియోజకవర్గాలు ఇవ్వకపోవడం, సంఖ్యపై ఏకపక్షంగా ప్రకటనలు చేయడం, జాబితా ఖరారులో జాప్యం చేయడం పట్ల విస్మయం వ్యక్తం చేశాయి. మహాకూటమిలో సీట్ల పంపకంపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్నా సీట్ల సర్దుబాటు వ్యవహారం తీవ్ర జాప్యమవుతోంది. 93 స్థానాల్లో కాంగ్రెస్, 14 స్థానాల్లో టీడీపీ, 8 స్థానాల్లో టీజేఎస్, 3 స్థానాల్లో సీపీఐ, ఒక చోట ఇంటి పార్టీకి కేటాయించినట్టు కాంగ్రెస్ పెద్దలు ప్రకటించారు. అందులో భాగంగా 74 మంది అభ్యర్థుల పేర్లతో కాంగ్రెస్ తొలి జాబితాను సిద్ధం చేసింది. దీంతో తమకు సీట్ల సంఖ్య పెంచాలంటూ మిత్రపక్షాలు పట్టుబడుతున్నాయి. 

ఓ వైపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతున్నామిత్రపక్షాల సీట్ల వ్యవహారంపై కాంగ్రెస్ హైకమాండ్ క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో కాంగ్రెస్‌తో తాడో పేడో తేల్చుకునేందుకు టీడీపీ, సీపీఐ, టీజేఎస్ సిద్ధమయ్యాయి. ఇప్పటికే సీట్లతో పాటు స్థానాలపై కూడా క్లారిటీ ఇవ్వలేదని అసంతృప్తితో ఉన్న భాగస్వామ్య పార్టీలు సీట్ల సర్ధుబాటు విషయంలో కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచి, తమ పంతం నెగ్గించుకోవాలని భావిస్తున్నాయి.  

అందులో భాగంగానే నగరంలోని పార్క్‌హయత్‌లో కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్‌ నేతలతో ఎల్.రమణ, కోదండరాం, చాడ వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటుపై వారితో సీరియస్‌గా చర్చించారు. ఈ సందర్భంగా సీట్ల సర్దుబాటులో జాప్యం వద్దని కాంగ్రెస్‌ను కోరామని, సీట్ల సర్దుబాటులో తప్పనిసరిగా విజయవంతమవుతామనే ఆశాభావాన్ని సీపీఐ రాష్ట్రకార్యదర్శి చాడ వెంకటరెడ్డి వ్యక్తంచేశారు. మరోవైపు తమ కూటమికి త్వరలోనే తుది రూపు వస్తుందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం చెప్పారు. మొత్తానికి మిత్రుల సీట్లపై తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్ అధిష్టానం74 మంది అభ్యర్థులతో రెడీ చేసిన తొలిజాబితా ప్రకటనను కూడా డైలీ సీరియల్‌లా వాయిదా వేస్తోంది. మరి కూటమి గందరగోళానికి కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి.
 

English Title
Mahakutami Seats Allocation Issue

MORE FROM AUTHOR

RELATED ARTICLES